close

తాజా వార్తలు

ఇడుపులపాయ టు సీఎం సీటు!

పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ.. ముఖ్యమంత్రి కుర్చీవైపు జగన్‌ అడుగులు

గత ఎన్నికల్లో 75,243 ఓట్ల ఆధిక్యత.. ఈసారి 90,110 ఓట్లతో రికార్డు

వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటి కంటే ఎక్కువగా ఓట్లు నమోదు

కడప, ఈనాడు : ‘ముఖ్యమంత్రి జగన్‌..’ గత పదేళ్లుగా రాజకీయ యవనికపై నలిగిన మాట ఇది.. ఇప్పుడు నిజమవుతోంది. పులివెందుల నుంచి ముఖ్యమంత్రి కుర్చీ వరకు జగన్‌ సాగించిన ప్రయాణంలో ప్రస్తుతం సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వెలువడిన ఫలితాల్లో వైకాపా రాష్ట్రస్థాయిలో రికార్డు స్థాయి ఫలితాలు సాధించింది. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొంది, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఎన్నిక కానున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈసారి తిరుగులేని ఆధిక్యతను నమోదు చేసుకొన్నారు. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి సతీష్‌కుమార్‌రెడ్డిపై 75,243 ఓట్ల ఆధిక్యతతో వైఎస్‌ జగన్‌ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 90,110 ఓట్లు పొంది రికార్డు సృష్టించారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఇప్పటివరకు 1991 ఉపఎన్నికలో మాత్రమే 97,448 ఓట్ల ఆధిక్యతను వైఎస్‌ పురుషోత్తంరెడ్డి సాధించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2009లో 68,681 ఓట్ల ఆధిక్యతను పొందారు. ప్రస్తుతం జగన్‌ తన తండ్రి కంటే మించి ఆధిక్యత ప్రదర్శించడం గమనార్హం. కడప లోక్‌సభ అభ్యర్థిగా జగన్‌ పోటీచేసినప్పుడు మాత్రం 2009 ఎన్నికల్లో 1,78,846 ఓట్ల మెజారిటీ సాధించగా.. 2011 ఎన్నికల్లో 5,45,671 ఓట్లు ఆధిక్యత సాధించారు. అసెంబ్లీ అభ్యర్థిగా మాత్రం ఈసారి తిరుగులేని రికార్డు సొంతం చేసుకొన్నారు. 2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి తన పాదయాత్ర ప్రారంభించిన జగన్‌.. సుమారు 3,648 కిలోమీటర్లు నడిచి 13 జిల్లాల్లో ప్రజలను నేరుగా కలుసుకున్నారు. 2004 ఎన్నికల ముందు వైఎస్‌ కూడా ఇదే తరహాలో పాదయాత్ర చేపట్టి 2004లో అధికారంలోకి వచ్చారు. అనంతరం 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా పాదయాత్ర ద్వారా అధికారంలోకి రాగా.. ప్రస్తుతం జగన్‌ సైతం పాదయాత్ర ద్వారా అధికార పగ్గాలు చేపట్టి రికార్డు సృష్టిస్తుండటం గమనార్హం. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర చివరికి ముఖ్యమంత్రి పీఠం వైపు దారితీసింది. పులివెందుల నుంచి రెండో ముఖ్యమంత్రిగా జగన్‌ గద్దెనెక్కనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.