close

తాజా వార్తలు

ఇచ్చిపుచ్చుకొనే ధోరణే మా విధానం: కేసీఆర్‌

ప్రగతిభవన్‌లో జగన్‌కు ఆత్మీయ స్వాగతం

హైదరాబాద్‌: ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా అదే విధానం అవలంబిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. గోదావరి, కృష్ణా నదీ జలాలను సమర్థంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలూ సుభిక్షంగా ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, వైకాపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా శనివారం సాయంత్రం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రగతిభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ జగన్‌ దంపతులకు  ఘనస్వాగతం పలికారు. జగన్‌ను ఆలింగనం చేసుకున్నారు. శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా విజయవంతం కావాలని దీవించారు. మిఠాయి తినిపించి సంతోషం పంచుకున్నారు. రాష్ట్ర మంత్రులను, ఇతర ప్రముఖులను జగన్‌కు పరిచయం చేశారు. అనంతరం ఇద్దరి నేతల మధ్యా పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌తో సత్సంబంధాలు నెలకొల్పుతామని జగన్‌కు సీఎం కేసీఆర్ హామీ ఇస్తూ స్నేహహస్తం అందించారు. 

‘‘ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదని మేము మొదటినుంచీ భావిస్తున్నాం. నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢణవీస్‌ను కలిశాను. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ -మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై నేనే చొరవ తీసుకుని మాట్లాడా. లివ్ అండ్ లెట్ లివ్ తమ విధానమని చెప్పాను. వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకూ మేలని వివరించాను. దీంతో సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చింది. ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది మా విధానం. రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా వ్యవహరిద్దాం’’ అని జగన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 

‘‘గోదావరి నది నుంచి ఏటా 3,500 టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700-800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే వీలుంది. ప్రకాశం బ్యారేజీ ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్ రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు. గోదావరి నీళ్లను వాడుకుని ఆంధ్రప్రదేశ్ రైతులకు సాగునీరు ఇవ్వవచ్చు’’ అని కేసీఆర్ సూచించారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని ఇద్దరు నాయకులూ నిర్ణయించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.