
తాజా వార్తలు
17వ లోక్‌సభలో అతిచిన్న వయసున్న ఎంపీ ఆమె. సాధారణ అమ్మాయిలానే పెరిగింది... బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంది... తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలనుకుంది...కానీ ప్రజాప్రతినిధి అవుతానని ఊహించలేకపోయింది.ఆమే ఒడిశాకు చెందిన చంద్రాణి ముర్ము. ఆ విశేషాలేంటంటే...
ఇటీవల వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో చంద్రాణి ముర్ము ఒడిశా లోని కియోంజర్ నియోజకవర్గం నుంచి గెలిచి అతి చిన్న ఎంపీగా చరిత్ర సృష్టించింది. 25 ఏళ్ల ఈ గిరిజన యువతి బిజూ జనతాదళ్ పార్టీ తరఫున లోక్‌సభ బరిలో నిలిచింది. రెండు సార్లు ఎంపీగా చేసిన బీజేపీ అభ్యర్థి అనంత్ నాయక్‌ను 66 వేల పైచిలుకు ఓట్లతో మట్టి కరిపించి ఈ ఘనత సాధించింది. చంద్రాణి... కేంఝర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించింది. తండ్రి సంజీవ్ ముర్ము ఓ ప్రభుత్వ ఉద్యోగి. తల్లి ఊర్వశి గతంలో ఐసీడీఎస్ విభాగంలో ప్రభుత్వ కార్యకర్తగా పని చేసేది. చంద్రాణి అందరిలాగే సాధారణ యువతిగా పెరిగింది. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న తపనతో ఉండేది. 2017లో భువనేశ్వర్‌లోని శిక్షా ఓ అనుసంధాన్ విశ్వవిద్యాలయంలో బీటెక్ పూర్తి చేసింది. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలవాలన్న లక్ష్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతోంది. ఆమెనందరూ ముద్దుగా హిరా, చందు అని పిలుస్తుంటారు.
రాజకీయాల్లోకి ఇలా...
చంద్రాణి బంధువు హర్మోహన్ సొరెన్ గత మార్చిలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు సామాజిక కార్యకర్తగా ఆ ప్రాంతంలో గుర్తింపు ఉంది. స్థానిక బిజద నాయకులతో మంచి పరిచయాలున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు కూడా తెలుసు. సొరెన్ చంద్రాణిని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కదా అని తరచూ అనేవారు. సరదాగా అంటున్నారని పెద్దగా చంద్రాణి ఆయన మాటల్ని పట్టించుకునేది కాదు.కేంఝర్ నియోజకవర్గం కూడా ఎస్టీలకు రిజర్వ్ అవడంతో ఆయన మాత్రం నిజంగానే బిజూ జనతాదళ్ టికెట్ మీద ఆమె పోటీ చేసేలా ప్రోత్సహించారు. బాగా చదువుకుంది. నేర్పుగా మాట్లాడగలుగుతుంది. అవన్నీ ఆమెను ప్రజలకు చేరువ చేశాయి. దీంతో ఈ నెల 23న వెలువడిన ఫలితాల్లో విజయం సాధించి 17వ లోక్‌సభలో అతిపిన్న సభ్యురాలిగా రికార్డు నెలకొల్పింది. ‘ఇది ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధం అవుతున్నా. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేశా. రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిసిన ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నేను ఒక ముఖ్యమంత్రి ముందు నిల్చున్నానంటే నాకప్పుడు నమ్మశక్యంగా అనిపించలేదు. ఆయన నాకు శుభాకాంక్షలు తెలిపి కష్టపడి పని చేయమని చెప్పారు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగా. ఇప్పుడు బాధ్యత మరింతగా పెరిగింది’ అని ఎంతో ఆనందంగా చెబుతోంది చంద్రాణి.
ఉపాధి కల్పించాలి...
ఖనిజసంపద ఎక్కువగా ఉన్న తన నియోజకవర్గంలో వచ్చే ఐదేళ్లలో ప్రజల అభ్యున్నతి కోసం ఏమేం చేయాలో ఇప్పటికే ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. గతంలో ఆమె తాత హరిహర్ సొరెన్ కేంఝర్ ఎంపీగా పని చేశారు. ఆయన వల్లే ఆమెలో ఎంతో కొంత రాజకీయ పరిజ్ఞానం వచ్చి ఉంటుందని చెబుతోంది. ‘వయసులో అందరికంటే చిన్నదాన్ని అయినా సీనియర్ల దగ్గర నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు నాకెలాంటి సవాళ్లు తెలియవు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఇప్పుడు నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. యువతకు ఉపాధి కల్పించాలి. ఈ ప్రాంత సమస్యలపై నాకు అవగాహన ఉంది. గిరిజన బిడ్డల అభ్యున్నతికి పాటుపడతా. ఇనుప ఖనిజం ఎక్కువగా ఉన్న జిల్లాలో నిరుద్యోగం ఎక్కువగా ఉండటం దురదృష్టం. ప్రజల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తానని’ చెబుతోంది చంద్రాణి.