close

తాజా వార్తలు

ఈ-చెత్త పడేయొద్దు...మాకివ్వండి!

ఫోను, టీవీ, కంప్యూటర్‌, ఇయర్‌ఫోన్స్‌, ఛార్జర్‌... ఇలా ఎలక్ట్రానిక్‌ వస్తువులెన్నో తరచూ కొంటూంటాం! పాడైపోగానే పక్కన పడేస్తాం. అలాంటివాటిని ఈ సంస్థకు ఇస్తే... డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటుంది. వీళ్లకేం లాభం అంటారా! వాటిని తిరిగి ఉపయోగించేలా రీసైక్లింగ్‌ చేయిస్తారు. పర్యావరణానికి పరోక్షంగా మేలు చేస్తున్నారు. ఆ వివరాలే చెబుతున్నారు సంస్థ సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ శాలినీ శర్మ.

టెక్నాలజీ మన జీవితంలో ఇప్పుడో భాగం. ఫోను మొదలు ఎన్నో ఎలక్ట్రానిక్‌ పరికరాలు నిత్యావసరం అయిపోయాయి. ఏటేటా వాటి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు. దాంతో వాటి వృథా కూడా పెరుగుతోంది. అలా పాడైన వాటి నిర్వహణ మాత్రం సరిగా ఉండటం లేదు. సరైన పద్ధతిలో వాటిని తొలగించకపోతే భూమి, నీరు, గాలి అన్నీ ప్రమాదకర రసాయనాలతో కలుషితం అవుతాయి. ప్రస్తుతం భారత్‌ ఏటా 17లక్షల టన్నుల ఈ-వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోందని అంచనా. ఇలా అధిక మొత్తంలో ఈ - చెత్తను ఉత్పత్తి చేసే టాప్‌ 5 దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరగనుందట. ఇక, మన ఇళ్లల్లో... అలాంటి ఈ - వృథాను ఓ సంచిలో వేసి కట్టి మూలన పెడతాం. చివరకు తీసుకెళ్లి పారేయడమో లేదా దగ్గర్లోని పాత సామాన్లు కొనే వ్యక్తికి నామమాత్రపు డబ్బుకు అమ్మేయడమో చేస్తాం. అక్కడితో మన పని అయిపోతుంది. కానీ దాన్ని వాళ్లు సరైన దిశలో రీసైకిల్‌ చేయరు. అది పర్యావరణ హానికి కారణం అవుతుంది. వాస్తవానికి ఈ-చెత్తను అనేక రకాలుగా ఉపయోగించొచ్చు. రీసైకిల్‌ చేసి ఉత్పత్తులుగా మలచొచ్చు. ఇవన్నీ ఆలోచించే ఈ - వేస్ట్‌ ఎక్స్‌ఛేంజ్‌ అనే సంస్థను అందుబాటులోకి తెచ్చాం.

మేమేం చేస్తామంటే...
జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ప్రకారం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద ఎలక్ట్రానిక్‌ వస్తువులు తయారుచేసే సంస్థలు తమ పేర్లు నమోదు చేసుకోవాలి.  ఉపకరణాల కాలపరిమితి దాటాక ఆ సంస్థ వాటిని వెనక్కి తీసుకుని పర్యావరణానికి ముప్పు కలగకుండా నాశనం చేయాలి. అలానే ప్రతి సంస్థ ఏ ఎలక్ట్రానిక్‌ వస్తువుల్ని ఎంత మొత్తంలో విక్రయించింది, పనిచేయని స్థితికి చేరుకుంటే వాటిని ఎక్కడ అప్పగించాలనేది కాలుష్య నియంత్రణ మండలికి తెలియచేయాలి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి పర్యావరణ పరిరక్షణ చట్టంలోనే ఈ-వ్యర్థాల నిబంధనల్ని ఎవరూ పాటించడం లేదు. ఫలితంగా ఎన్నో అనర్థాలు. ఇవన్నీ గుర్తించాకే మేం సామాన్య ప్రజలు, సంస్థల నుంచి ఈ వృథాను సేకరిస్తున్నాం. అయితే ఉచితంగా కాకుండా కొంత డబ్బు చెల్లిస్తాం. అలా సేకరించిన వాటిని ప్రభుత్వ అనుమతులు ఉన్న సంస్థలకు రీసైక్లింగ్‌కి పంపిస్తాం. ఆ సంస్థలు మాకు  కొంత డబ్బు తిరిగి చెల్లిస్తాయి. వీటితో పాటు ప్యాకేజింగ్‌లో థర్మాకోల్‌ని ఇప్పుడు విరివిగా వినియోగిస్తున్నారు. ఇది కూడా పర్యావరణానికి హానికరమే. దానికి ప్రత్యామ్నాయాన్ని మేం అందించబోతున్నాం.

ప్రముఖ సంస్థలతో...
ప్రస్తుతం మా సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో కలిసి పనిచేస్తోంది. మేం ఈ-వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనలు- 2016కి అనుగుణంగా పనిచేస్తాం. ఆ సంస్థలతో, పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్‌ వస్తువులను వినియోగించే వినియోగదారులతో సమావేశాలు నిర్వహిస్తాం. వారు ఈపీఆర్‌ టార్గెట్‌ చేరుకునేలా చూస్తాం. మేం ప్రస్తుతం కేంద్ర ఎలక్ట్రానిక్‌ - ఐటీ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లో మా సేవలు అందుబాటులో ఉన్నాయి. సుమారు 21 ప్రముఖ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాం. వాటిల్లో ఎస్‌బ్యాంక్‌ కూడా ఒకటి. కేవలం సాఫ్ట్‌వేర్‌ సంస్థలే కాదు, విద్యాలయాలు, ఆసుపత్రులు, కొన్ని ప్రభుత్వ సంస్థలు, పోర్టులు మా వినియోగదారుల జాబితాలో ఉన్నాయి.

ఈ - వృథాను సరైన విధంగా రీసైకిల్‌ చేయలేకపోతే వాటిలోని పాదరసం, లెడ్‌, కాడ్మియం వంటి హానికారక పదార్థాలు పర్యావరణానికి హాని చేస్తాయి. 

వినియోగదారులు చేయాల్సిందల్లా...

మా సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వారు ఏ వ్యర్థాలను అందివ్వాలని అనుకుంటున్నారో నమోదు చేసుకోవాలి. వాళ్లు ఇవ్వాలనుకున్న వస్తువులకు ఎంత మొత్తం వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. మా ప్రతినిధి వచ్చి తూకం వేసుకుని సంబంధిత డబ్బును అందిస్తారు. ఇందుకోసం మా వెబ్‌సైట్‌లో సుమారు ఆరు సెగ్మెంట్లతో ఓ ఫ్లాట్‌ఫామ్‌ని సిద్ధం చేశాం. అలానే ముందుగా నిర్దేశించిన ప్రాంతాల్లో ఈవేస్ట్‌ ఎక్స్ఛేంజ్‌ కలెక్షన్‌ డ్రైవ్‌ని కూడా నిర్వహిస్తాం.

చదువైపోయాక ఇలా...

నేను ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్వాలిటీలో డాక్టరేట్‌ చేశా. కొన్నాళ్లు వాతావరణ మార్పుల మీద పని చేశా. మరికొన్ని సంస్థల్లోనూ పనిచేశా. 2014లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేసుకుని భారత్‌కు వచ్చాక ఈ  ఆలోచనను అమలు చేశా. దానికి ఆర్థిక వేత్త అయిన దేవి, సోషల్‌ డెవలప్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్‌  సందీప్‌ తోడయ్యారు. అలా రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా దీన్ని ప్రారంభించాం. 

అవార్డులెన్నో...

ఇప్పుడు మా స్టార్టప్‌ ప్రపంచంలోని పర్యావరణ హితం కోసం పనిచేస్తున్న పది ప్రధాన సంస్థల్లో ఒకటి. 
* 2019లో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక 
సదస్సుకి ఆహ్వానం అందడంతో పాటు సర్క్యులర్‌ ఎకానమీ మోడల్‌ ఫర్‌ ఈ-వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డుని అందుకున్నాం. 
* జర్మన్‌ ఫెడరల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ జీఐజెడ్‌ అవార్డుని అందించింది. 
* ఇంటర్నేషనల్‌ క్లైమెట్‌ కో-అలెయన్స్‌- 2019 గుర్తింపు మేం సొంతం చేసుకున్నాం.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.