close

తాజా వార్తలు

ఏపీతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తాం: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రివర్గం భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ మీడియాకు వెల్లడించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కొనసాగించాల్సిన సంబంధాలు.. రాబట్టాల్సిన ఫలితాలు.. తద్వారా రాష్ట్ర పురోగతికి దోహదపడే అంశాలపై కేబినెట్‌లో విస్తృతంగా చర్చించినట్టు సీఎం వెల్లడించారు. ఏపీతో చాలా స్నేహపూర్వకమైన, ప్రేమపూర్వకమైన, ఉల్లాసభరితమైన సంబంధాన్ని కొనసాగించాలని కేబినెట్‌ స్పష్టమైన అవగాహనతో కూడిన నిర్ణయానికి వచ్చిందన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలతో తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఏర్పడిందన్నారు.

గతంలో బస్తీమే సవాల్‌గా ఉండేది..
‘‘తెలంగాణ రాకముందు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో రోజూ బస్తీమే సవాల్‌ అనే పరిస్థితులు ఉండేవి. అనేక వివాదాలు ఉండేవి. కోర్టు వ్యాజ్యాలుఉండేవి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కర్ణాటకతో మంచి సత్సంబంధాల్ని కొనసాగిస్తున్నాం. ఇలా.. మూడుసార్లు నీటిని పరస్పరం పంపిణీ చేసుకున్నాం. లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల నినాదం. గత ప్రభుత్వం గత దశాబ్దాలుగా లోయర్‌ పెన్‌గంగను పెండింగ్‌లో పెట్టింది. లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టు చనాఖా కొరాటా రూపంలో త్వరలో పూర్తి కాబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకోబోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు 45లక్షల ఎకరాలకు రెండు విడతల్లో నీరిస్తుంది. పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు నీటిని అందించే పథకమిది. ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు’’ అన్నారు.

ఈ నెల 27న సచివాలయ భవన శంకుస్థాపన
‘‘ఈ నెల 27 లేదా 28 తేదీల్లో ఏపీ నీటిపారుదల శాఖ బృందం హైదరాబాద్‌ వస్తుంది. సమావేశం తర్వాత క్షేత్రస్థాయిలో సంయుక్త బృందాలు పరిశీలనకు వెళ్తాయి. ఆ తర్వాత విజయవాడలో ఇరు రాష్ట్రాల బృందాల సమావేశం ఉంటుంది. దాదాపు 5వేల టీఎంసీలు రెండు రాష్ట్రాల్లో ప్రతి అంగులానికీ తీసుకెళ్తాం. ఏపీ ప్రభుత్వం మారడంతో సచివాలయం, శాసనసభ, భవనాల అప్పగింత ప్రక్రియ జరుగుతోంది. సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపైనా చర్చించాం. వివిధ అంశాల్లో ఏపీ సర్కార్‌ చూపుతున్న చొరవ అభినందనీయం. సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపైనా చర్చించాం. రూ.400 కోట్లతో సచివాలయ భవన నిర్మాణాన్ని  5 నుంచి 6లక్షల చదరపు అడుగుల్లో నిర్మించాలనే ఆలోచన ఉంది. శాసనసభ భవనాన్ని రూ.100 కోట్లతో నిర్మిస్తాం. ఎర్రమంజిల్‌లో సెంట్రల్‌ హాల్‌, కౌన్సిల్‌ హాల్‌, అసెంబ్లీ నిర్మిస్తాం. కొత్త అసెంబ్లీ నిర్మాణం కూడా పాత విధానంలోనే ఉండాలని నిర్ణయించాం. ఈ నెల 27న సచివాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తాం.’’

పీఆర్సీపై త్వరలోనే సమావేశం
‘‘ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చాం. పీఆర్‌సీ, పదవివిరమణ వయసుపై ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం. నూతన పంచాయతీ రాజ్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించాం. పంచాయతీరాజ్‌ వ్యవస్థను క్రియాశీలం చేయాలని నిర్ణయించాం. పంచాయతీరాజ్‌ వ్యవస్థకు అధికారాల అప్పగింతను పరిశీలిస్తాం’’ అని కేసీఆర్‌ వెల్లడించారు.

జులైలో పురపాలక ఎన్నికలు!
* పురపాలక ఎన్నికలు వీలైనంత త్వరలో నిర్వహించాలని నిర్ణయించాం. నూతన పురపాలిక చట్టం తీసుకురావడంపై ఆలోచిస్తున్నాం. జులైలో ఎన్నికలు ముగించే ప్రయత్నం చేస్తాం. 
* సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌ స్టుడియో కట్టాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. శంకర్‌పల్లి సమీపంలో ఐదెకరాల స్థలం ఎకరాకు రూ.5లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించాం. ఆయన తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నారు.
* శారదా పీఠం ట్రస్ట్‌కు రెండెకరాల భూమి కేటాయించాం. సంస్కృత పాఠశాల, సాంఘిక కార్యకలాపాలకు భూమి కేటాయించాం.  
* తెరాస పార్టీ కార్యాలయాల కోసం 31 జిల్లాల్లో స్థలాలు కేటాయించాం. ఒక జిల్లా పెండింగ్‌లో పెట్టాం. వరంగల్‌ గ్రామీణ జిల్లా పెండింగ్‌లో ఉంది. ఖమ్మంలో ఇప్పటికే భవనం నిర్మించాం.

* కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నెల 21న ప్రారంభోత్సవం కానుంది. గవర్నర్‌ నరసింహన్‌ ఆధ్వర్యంలో నేను ఆ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నా. ఈ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ వస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన మంత్రులు కూడా వస్తున్నారు. మంత్రి ఈటల ఒకరోజు ముందే అక్కడ ఉండి కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. ఐదు పంపింగ్‌ స్టేషన్లలో మంత్రులు ప్రారంభోత్సవం చేస్తారు.  మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు హోమం నిర్వహిస్తాం. కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంలో మొత్తం ఐదు హెలీకాప్టర్లు వాడుతున్నాం. మా వద్ద నాలుగు హెలీకాప్టర్లతో పాటు ఏపీ సీఎం జగన్‌ ఓ హెలీకాప్టర్లో వస్తానన్నారు’’ అని కేసీఆర్‌ వివరించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.