close

తాజా వార్తలు

పీఠమా..గుణపాఠమా?

● అడకత్తెరలో అసమ్మతీయులు

● తీర్పుపై పెరుగుతున్న బెంగ

 

దాటించేస్తా బౌండరీ.. : అధికారం చేరువువుతోందనే ఆనందం కమలనాథులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బెంగళూరు సమీప రమడా రిసార్టు ప్రాంగణంలో మంగళవారం ఉత్సాహంగా క్రికెట్‌ బరిలోకి దిగిన పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప తదితరులు చిత్రంలో..

బెంగళూరు : కర్ణాటక శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన 16 మంది నేతల పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్న వాతావరణం తలెత్తింది. వాస్తవానికి వీరి రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు ఎలా ఉన్నా- ప్రస్తుతం ముంబయి చేరి, జాతీయ స్థాయిలో పెద్ద వార్తగా మిగిలారు. కర్ణాటకకు సంబంధించిన ఓ వ్యాజ్యాన్ని 2018లో ఇదే సుప్రీం కోర్టు ఒక్క రోజులో తేల్చింది. ఈ సారి ఎంతకీ తెగని రాజ్యాంగ చిక్కుముళ్లలాగా ఈ కేసు రూపాంతరం చెందింది. గత శుక్రవారమే ఏదో ఒక తీర్పు వస్తే చాలనుకున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు- రాన్రాను మరింత డోలాయమానంలో చిక్కుకున్నారు. ఇంతటి చర్చకు వేదికగా మారతామని ఏమాత్రం ఊహించని వారి భవితవ్యం తేలాలంటే మరో రోజు ఎదురు చూడాల్సిందే.

రాజీనామానా? అనర్హతనా?

సుప్రీంకోర్టు తేల్చాల్సిన అంశం ఒక్కటే.. వీరి రాజీనామాలు అంగీకరించటమా? అనర్హత వేటు వేయటమా? అది కూడా స్పీకర్‌కు ఏదైనా గడువు విధిస్తుందా? లేక ఆయనకే స్వేచ్ఛనిస్తుందా? ఈ ధర్మ సందేహాల నడుమ పార్టీల కంటే ఎమ్మెల్యేల భవితవ్యమే పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని రక్షించుకునే దిశగా చేతులెత్తేసినట్లు కనిపిస్తున్నాయి. ఏమవుతుందో చూద్దామన్న ధోరణిలో మిగిలిపోయాయి. బుధవారం వెలువడే తీర్పు 16 మంది ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తుందని మాత్రం అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వేళ ముందు రాజీనామాను అంగీకరించాలని తీర్పు వస్తే వీరంతా తమ పార్టీలకు కానివారై వెంటనే ఉప ఎన్నికలకు సిద్ధం కాక తప్పదు. ఒక వేళ అనర్హత వేటు పడితే ప్రస్తుత ఎన్నికల ఏడాది తర్వాత పోటీకి అర్హత సాధిస్తారు. వీరంతా ఎంత అడిగినా భాజపాలో చేరబోమనే చెబుతున్నారు. ఇదేదో రాష్ట్ర పరిధిలోనే చర్చకు వచ్చిన వ్యవహారమైతే పార్టీల ఫిరాయింపులు చేసినా ఫర్వాలేదు. జాతీయ స్థాయిలో అందులోనూ సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిన వ్యవహారం కావటంతో ఇప్పటికిప్పుడే భాజపాలో చేరినా వారికి తమ నియోజకవర్గాల నుంచి వ్యతిరేకత ఎదురు కాకతప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కారణాలు వేర్వేరు..

రాజీనామాలు చేసిన వారిలో అందరి కారణాలు ఒక్కటిగా లేవని ఇట్టే తెలుస్తోంది. మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి మొదటి నుంచి రాజకీయ ద్వేషంతోనే రగిలిపోతున్నారు. నగర ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాలకు నిధుల రాలేదని చెబుతున్నా వారంతా మంత్రి రేవణ్ణ ఆధిపత్యాన్ని ప్రశ్నించినవారే. హిరేకరూరు ఎమ్మెల్యే బి.సి.పాటిల్‌ సైతం కేవలం మంత్రి పదవి ఆశించి- చివరికి అది దక్కకే రాజీనామా చేశారన్నది బహిరంగ సత్యం. ఆయన నియోజకవర్గానికి ఏడాదిలో రూ.1,200కోట్లు విడుదల చేసినట్లు గతంలో ముఖ్యమంత్రి వెల్లడించారు కూడా. ఇక అన్నింటికీ మించి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు నాగేశ్‌, శంకర్‌ సైతం తమకు మంత్రి పదవులు దక్కిన కేవలం 15 రోజుల వ్యవధిలోనే రాజీనామాలు చేయటం కూడా వారి నియోజకవర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనేలా చేస్తోంది. తమపై వస్తున్న ఆరోపణల దృష్ట్యా శివరామ్‌ హెబ్బార్‌, ప్రతాప్‌గౌడ పాటిల్‌ వంటి వాళ్లు సామాజిక మాధ్యమాల ద్వారా తమ నియోజకవర్గాల ప్రజలకు తమ రాజీనామాలపై వివరణాత్మక సందేశాలు పంపుతున్నారు.

నేతలకు కునుకు కరవు

ఎమ్మెల్యేల రాజీనామాపై మంగళవారం సుప్రీంకోర్టు ఎట్టకేలకు తీర్పు వెల్లడిస్తుందని ఎదురు చూసిన పార్టీలు మరో రోజు దాకా వేచి చూడక తప్పని పరిస్థితి. నగరంలోని ఓ హోటల్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి నగర శివార్లలోని రిసార్టులకు తరలి వెళ్లారు. గురువారం ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షలో నెగ్గలేరన్న అభిప్రాయంలో ఉన్న పార్టీ తమ ఎమ్మెల్యేల కోసం ఏ ప్రయత్నం చేయకూడదని నిశ్చయించుకుంది. అధిష్ఠానం సూచన మేరకు చివరి నిమిషం వరకు ఎమ్మెల్యేల రాక కోసం ఎదురు చూడాలని తీర్మాచించింది. పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాత్రం కాంగ్రెస్‌ కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. మరో వైపు గురుపౌర్ణమి పురస్కరించుకుని ముఖ్యమంత్రి దేవాలయాల దర్శనాల్లో పాల్గొన్నారు. కొండంత విశ్వాసంలో ఉన్న భాజపా ఎమ్మెల్యేలు తమ అధ్యక్షుడు యడ్యూరప్ప నేతృత్వరంలో గురువారం దాకా రిసార్టుల్లోనే ఉండేందుకు నిర్ణయించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.