close

తాజా వార్తలు

అధికార లెక్కల్లో తలమునకలు

కమలనాథుల ముందస్తు ఉత్సాహం

బెంగళూరు : సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటకలోని పార్టీలన్నీ దిక్కులు చూస్తున్నాయి. తీర్పు ఎవరికి అనుకూలం? ఎవరికి చేదు ఫలం? అనే కోణంలో విశ్లేషణలు మొదలవుతున్నాయి. నిర్ణయమేదైనా సంకీర్ణ ప్రభుత్వానికి దారి చూపే వాతావరణం కానరావడం లేదు. ఆ తీర్పు ఎమ్మెల్యేల రాజీనామాలు.. వారిపై అనర్హత వేటుకు సంబంధించిన వ్యవహారం. తేల్చేది ఏ అంశమైనా.. మిత్రపక్షాలకు ఎదురవుతున్న భారీ లోటు మాత్రం పూడ్చలేనిది. ఇప్పటికే చేయి దాటిపోయిన ఎమ్మెల్యేలు దారికి రారని తేలిపోవటంతో ఇక జరగాల్సిన చోద్యం చూడాల్సిన స్థితిలో మిత్రపక్షాలు మిగిలిపోయాయి.

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా వారికి సుదీర్ఘ కాల రాజకీయ జీవితానికి ముప్పు తప్పదు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన విప్‌లతో భయపడాల్సి న అవసరం ఎమ్మెల్యేలకు లేదని ఇప్పటికే తేలిపోయింది. ప్రస్తుతం మిత్రపక్షాలకు సభలో ఉన్న సభ్యుల సంఖ్య 101. భాజపాను అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌, జేడీఎస్‌లకు అవసరమైన ఎమ్మెల్యేలు మరో ఆరుగురు. ఈ ఆరుగురిని రాబట్టుకోవటం కత్తిమీద సాముగానే మిగిలింది. తన నిర్ణయాన్ని ప్రకటించని సీనియర్‌ నేత రామలింగారెడ్డి రాజీనామా వెనక్కు తీసుకున్నా ఆయన చెబితే వచ్చే వారు కనుచూపుమేరలో లేరు. నగరానికి చెందిన ఎస్‌.టి.సోమశేఖర్‌, భైరతి బసవరాజు, మునిరత్న నిర్ణయం మార్చుకోబోమని చెప్పటంతో కాంగ్రెస్‌ ఆశలన్నీ ఆవిరయ్యాయి. చివరి ప్రయత్నంగా ముంబయికి వెళ్లాలని అనుకున్న కీలక నేతలంతా తమ ఎమ్మెల్యేల పోలీసు ఫిర్యాదులతో ఆగిపోయారు. బలం సన్నగిల్లుతున్న క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలెవరూ రిసార్టుల్లో ఉండేందుకు ఇష్టపడలేదు. ఐదుగురు మహిళా ఎమ్మెల్యేలు, ఉత్తర కర్ణాటకకు చెందిన ఎనిమిది నేతలు రిసార్టుల్లో ఉండేందుకు ససేమిరా అంటున్నారు. జేడీఎస్‌ సైతం ఎప్పుడో ఆశలు వదలుకుని కాంగ్రెస్‌ ఏదైనా చేస్తుందా? అంటూ ఎదురు చూస్తూ కాలం గడుపుతోంది.

గురువారం ఎప్పుడొస్తుందా? ఎప్పుడు అధికారంలో కూర్చుందామా? అన్న సంతోషంలో భాజపా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం రోజు రోజుకీ సంక్లిష్టంగా మారటంతో భాజపాకు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆ పార్టీ సానుభూతిపరులు అంటున్నారు. సభలో అవసరమైన మెజార్జీ సంఖ్య(107)ను ఎప్పుడో సాధించుకున్న భాజపా సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ ధైర్యంతోనే ముఖ్యమంత్రి కోరిక మేరకే విశ్వాస పరీక్షకు సమ్మతించటం గమనార్హం. ఇప్పటికే రిసార్టుల్లో భాజపా ఎమ్మెల్యేలు ఎంతో విశ్వాసంతో కూడిన విశ్రాంతిని పొందుతూ కనిపిస్తున్నారు. అప్పుడే ఎవరెవరికి మంత్రి పదవులు, ఎవరిని స్పీకర్‌ చేద్దామన్న లెక్కల్లో నిమగ్నమవటం గమనార్హం.

యడ్యూరప్ప సొంతూరులో హోమం

మండ్య : భాజపా నేత యడ్యూరప్ప మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రార్థిస్తూ ఆయన పుట్టిన గ్రామం బూకనకెరెలో మంగళవారం ప్రత్యేక హోమాల్ని నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం సద్దుమణిగి తమ నాయకుడే ముఖ్యమంత్రి పదవిని పొందాలని ప్రార్థనలు జరిగాయి. సోమవారం రాత్రి నుంచే గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించి తోరణాలతో సింగారించారు. కాపనహళ్లి గవి మఠాధిపతి స్వతంత్ర సిద్ధలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. పూజలో యడ్యూరప్ప సోదరి ప్రేమమ్మ, ఆమె కుటుంబ సభ్యులు, స్థానిక భాజపా నాయకులు పాల్గొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.