close

తాజా వార్తలు

తేలని ‘కుమార’పరీక్ష: అసెంబ్లీ మళ్లీ వాయిదా

బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం క్షణానికో మలుపు తిరుగుతోంది. తమ ఆధిక్యాన్ని నిరూపించుకునేందుకు సీఎం కుమారస్వామి ఈ ఉదయం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దానిపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో హైడ్రామా నెలకొంది. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేశారంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తుంటే.. విశ్వాసపరీక్షను వాయిదా వేసేందుకు సంకీర్ణం ఎత్తులు వేస్తోందని భాజపా దుయ్యబట్టింది. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభను మళ్లీ వాయిదా వేశారు.  

ఈ ఉదయం కాంగ్రెస్‌ పక్ష నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ.. అసమ్మతి ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగా లేదని, ఇలాంటి సమయంలో విశ్వాసపరీక్ష పెట్టడం సరికాదని అన్నారు. ‘‘సుప్రీం వాదనల్లో న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎవరూ విప్‌ గురించి మాట్లాడనేలేదు. పార్టీ నాయకుడిగా విప్‌ జారీ చేసే అధికారం నాకుంది. విప్‌ జారీ చేసినా సుప్రీం తీర్పుకు అనుగుణంగా రెబల్స్‌ రాకపోతే సంకీర్ణానికి భారీ నష్టం జరుగుతుంది’ అని సిద్ధరామయ్య అన్నారు. కాంగ్రెస్‌ వ్యాఖ్యలను భాజపా వ్యతిరేకించడంతో సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గందరగోళం జరగడంతో స్పీకర్‌ రమేశ్ కుమార్‌ సభను వాయిదా వేశారు. తిరిగి 3 గంటలకు సభ ప్రారంభం కాగానే విశ్వాస తీర్మానంపై చర్చ మొదలుపెట్టారు. 

మా ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించండి..

సభ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌ శివకుమార్‌ మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా భాజపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ‘మా పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు కలిసే ప్రయాణం చేశారు. అందులో ఒకరైన శ్రీమంత్‌ పాటిల్‌ ఇలా హాస్పిటల్‌ స్ట్రెచర్‌పై కన్పించారు. మరి మిగతావారు ఏమయ్యారు. మా ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలి’ అని శివకుమార్‌ స్పీకర్‌ను కోరారు.  

స్పీకర్ ఆగ్రహం..

ఎమ్మెల్యేల కిడ్నాప్‌ వ్యవహారంపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎమ్మెల్యేలు కిడ్నాప్‌ అయ్యారంటూ సిద్ధరామయ్య నాకు లేఖ ద్వారా తెలిపారు. నాకు శ్రీమంత్‌ పాటిల్‌ పేరుతో ఓ లేఖ వచ్చింది. అందులో తాను తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్నానని, ఆసుపత్రిలో ఉన్నానని ఉంది. అందుకే అసెంబ్లీకి రాలేకపోతున్నట్లు ఆ లేఖలో ఉంది. అయితే ఆ లేఖపై నాకు అనుమానాలున్నాయి. దానిపై ఎలాంటి తేదీ గానీ, లెటర్ హెడ్‌గానీ లేదు. అలాంటి పత్రాన్ని నేను ఎలా నమ్మగలను? శ్రీమంత్‌ పాటిల్‌ గురించి వెంటనే ఆయన కుటుంబాన్ని సంప్రదించండి. రేపటిలోగా దీనిపై నాకు నివేదిక ఇవ్వండి’ అని స్పీకర్‌ రమేశ్‌ హోంమంత్రికి ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆయనకు హోంశాఖ రక్షణ కల్పించకపోతే తానే డీజీపీతో నేరుగా మాట్లాడతానని చెప్పారు.

గవర్నర్‌ను కలిసిన భాజపా నేతలు..

మరోవైపు విశ్వాస పరీక్షను కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ భాజపా ప్రతినిధులు నేడు రాష్ట్ర గవర్నర్‌ వాజూభాయ్‌ పటేల్‌ను కలిశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నేడే విశ్వాసపరీక్ష పెట్టేలా చూడాలని కోరారు. గవర్నర్‌ను కలిసి వచ్చిన అనంతరం భాజపా నేతలు సభలో ఆందోళనకు దిగారు. దీంతో అసహనానికి గురైన స్పీకర్‌ సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.