
తాజా వార్తలు
కటక్(ఒడిశా): ఆగకుండా ఏడుస్తున్నాడని ఆరేళ్ల చిన్నారిని ఓ తండ్రి బండకేసి కొట్టి హతమార్చాడు. ఈ విషాద ఘటన ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లా శరత్ ఠాణా పరిధిలోని లావణ్యదెయపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..లావణ్యదెయపూర్ గ్రామానికి చెందిన మధుసింగ్కు ఇద్దరు కుమారులు. కొన్నాళ్ల కిందట మధుతో గొడవపడిన భార్య పెద్ద కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి మధుసింగ్ ఆరేళ్ల చిన్న కుమారుడు సర్దార్‌సింగ్‌తో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. మంగళవారం మధుసింగ్ పొలం నుంచి ఇంటికి వచ్చాడు. ఇంట్లో సర్దార్‌సింగ్ ఏడుస్తూ కనిపించాడు. ఏడవద్దన్నా మానలేదు. ఆగ్రహం చెందిన అతను బాలుడిని పైకెత్తి నేలకు కొట్టాడు. గాయపడిన సర్దార్ మరింతగా ఏడవడంతో గ్రామశివారులోని చెరువు వద్దకు తీసుకెళ్లి రాతిబండకేసి కొట్టాడు. అడ్డుకున్న గ్రామస్థులపైనా దాడిచేశాడు. దీంతో గ్రామస్థులు మధును తాళ్లతో కట్టి బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు మధును అరెస్టు చేశారు.