close

తాజా వార్తలు

ఇంత దుర్మార్గ పాలన చూడలేదు:చంద్రబాబు

అమరావతి: తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత అరాచక, దుర్మార్గ, రాక్షస పాలన చూడలేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. తెదేపా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. తెదేపా నేతలు, కార్యకర్తలపై వైకాపా నేతలు దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారన్నారు. నాన్‌బెయిల్‌బుల్‌ కేసులతో కార్యకర్తలను హింసిస్తున్నారని దుయ్యబట్టారు. 

అక్రమ కేసులతో కార్యకర్తలను వేధిస్తున్నారు

‘వైకాపా కార్యకర్తలపై బెయిల్‌బుల్‌.. తెదేపా కార్యకర్తలపై నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద కేసులు పెడుతున్నారు. వైకాపా కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టడం లేదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వైకాపా నేతల దౌర్జన్యాలపై సోషల్‌ మీడియాలో తమ బాధను వెళ్లగక్కేవారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడి చేసిన ఘటనలు 565 జరిగాయి. వీటిలో దాడులు 201, వేధింపులు 136, అక్రమ కేసులు 52, ఉద్యోగాల తొలగింపు 21, భూకబ్జా 15, ఆస్తుల అన్యాక్రాంతం 66, హత్యలు 10, వ్యక్తిగత దాడులు 28, సోషల్‌ మీడియా అరెస్టులు 28 కేసులు నమోదయ్యాయి. వైకాపా నేతల వేధింపులతో 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీటిలో ఎక్కువగా గుంటూరు (131), అనంతపురం (112) జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతల దాడులతో 545 కుటుంబాలు గ్రామాలు వదిలిపెట్టి వెళ్లాయి. అత్యధికంగా గురజాల నియోజకవర్గంలోని పిన్నెళ్లిలో 164, మాచర్ల నియోజకవర్గం ఆత్మకూరులో 127, జంగమేశ్వరపాడులో 74 కుటుంబాలు గ్రామాలను వదిలి వెళ్లాయి’’ అని చంద్రబాబు వివరించారు.

పెయిడ్‌ ఆర్టిస్టులంటూ ఎగతాళి చేస్తారా?

‘‘వైకాపా బాధితులను హోంమంత్రి పెయిడ్‌ ఆర్టిస్టులంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు. బాధితులను అవమానించినందున హోంమంత్రి సుచరిత క్షమాపణ చెప్పాలి. ఎవరు పెయిడ్‌ ఆర్టిస్టులు? ఎవరు మొసలి కన్నీరు కారుస్తున్నారు?అధికారం ఉందని ఇష్టానుసారం చేస్తారా? ఈ అంశంపై సీఎం జగన్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సమాధానం చెప్పాలి. నేనేమీ ఆరోపణలు చేయడం లేదు. బాధితుల సమాచారంతో సవివరంగా పుస్తకాలు వేశాం. కేసుల వారీగా వివరాలు ఇచ్చాం. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాలి. ఏకపక్ష నిర్ణయాలతో అణగదొక్కే చర్యలు వద్దు. ఎంత అణగదొక్కాలని చూస్తే అంతగా రెచ్చిపోయే ప్రమాదముంటుంది. బుధవారం చేపట్టే ఆందోళన 100 రోజుల వైకాపా పాలనకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇక మీ ఆటలు సాగవ్‌. తెదేపా కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా ఉంటుంది’’ అని చెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.