close

తాజా వార్తలు

డీకే శివకుమార్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు

దిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌కు ఈడీ కస్టడీని దిల్లీ కోర్టు పొడిగించింది.  ఈ కేసులో ఆయనకు మరో ఐదు రోజుల పాటు (ఈ నెల 17వరకు) కస్టడీని పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్‌కుమార్‌ కుహర్‌ ఆదేశాలు జారీ చేశారు. మనీలాండరింగ్‌ కేసులో విచారణకు పిలిచిన ఈడీ అధికారులు డీకేఎస్‌ను ఈ నెల 3న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల కస్డడీ నేటితో ముగియడంతో శుక్రవారం ఆయనను దిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. 

దర్యాప్తుకు సహకరించట్లేదు: ఈడీ 
ఈడీ విచారణ సమయంలో అధికారులు అడుగుతున్న ప్రశ్నలను దాటవేయడం.. పొంతన లేని సమాధానాలు చెబుతూ దర్యాప్తును తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారంటూ ఈడీ కోర్టుకు తెలిపింది. బినామీ ఆస్తులు రూ.800 కోట్లతో పాటు ఆయన నగదు రూపంలో చేసిన రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలపైనా దర్యాప్తు చేసినట్టు తెలిపింది. శివకుమార్‌ అక్రమ లావాదేవీలకు సంబంధించి అనేక దస్త్రాలను సంపాదించినట్టు ఈడీ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటారా వాదించారు. డీకేఎస్‌ తనకు తెలిసిన వాటిని కూడా చెప్పడంలేదన్నారు. మనీలాండరింగ్‌కు పాల్పడేందుకు అలవాటు పడ్డారని.. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పుగా పరిణమించే విషమయన్నారు. ఈ కేసులో పురోగతి కోసం మరికొన్ని రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించాలని కోరారు.

డీకేఎస్‌ ఆరోగ్యం క్షీణిస్తోంది: అభిషేక్‌ మను సింఘ్వీ
డీకేఎస్‌ తరఫున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు విన్పించారు. శివకుమార్‌ ఆరోగ్యం బాగా లేదని.. ఆయనను ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. సెప్టెంబర్‌ 3న అరెస్టు చేసినప్పటి నుంచి రోజుకు 10గంటల పాటు విచారిస్తున్నారని తెలిపారు. 100 గంటలకు పైగా ఆయనను విచారించడంతో ఆరోగ్యం క్షీణించిందని కోర్టుకు తెలిపారు. బీపీ స్థాయి పెరిగిందన్నారు. అత్యంత ప్రమాదకరమైన నేరస్థులకు కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకొనే అర్హత ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో డీకేఎస్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. డీకేఎస్‌ ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ మరో ఐదు రోజుల పాటు ఆయన్ను ఈడీ కస్టడీకి అప్పగించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.