close

తాజా వార్తలు

పట్టణాల్లో వసతుల కల్పనకు పెద్దపీట: కేటీఆర్‌

శాసనసభలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి

హైదరాబాద్‌: తెలంగాణలో 42.6 శాతం జనాభా పట్టణాల్లోనే ఉంటోందని మరో ఐదు నుంచి ఏడేళ్లలో ఈ సంఖ్య 50 శాతానికి చేరుకుంటుందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. దేశంలో పట్టణీకరణలో తెలంగాణ 5వ స్థానంలో ఉందని వివరించారు. రాష్ట్రంలో వేగంగా పట్టణీకరణ జరుగుతున్నందున అందుకు తగ్గట్లు మౌలిక వసతుల కల్పన కొంత సవాలుతో కూడుకున్నదని అభిప్రాయపడ్డారు. అయినా దశలవారీగా అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నామని చెప్పారు. శాసనసభలో మంగళవారం విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు. ‘‘పట్టణ ప్రాంతాల్లో వేగంగా మౌలిక వసతుల ఏర్పాటుకు టీయూఎఫ్‌ఐటీసీ ద్వారా నిధులు సమకూర్చుతున్నాం. అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగా 68 మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఇటీవలే కొత్త మున్సిపల్‌ చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. పారదర్శకత కోసం పాలక సంస్థల్లోని కౌన్సిలర్‌, ఛైర్‌ పర్సన్‌ వంటివారిని జవాబుదారీ చేశాం. పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేసుకున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నాలుగు మున్సిపాలిటీలు జాతీయ అవార్డులు అందుకున్నాయి. హెచ్‌ఎండీఏతో సహా సత్వరం భవన నిర్మాణ అనుమతులను మంజూరు చేస్తున్నాం’’

‘‘ఘన, ద్రవ వ్యర్థ నిర్వహణలో ఇప్పుడిప్పుడే కొంత పురోగతి సాధిస్తున్నాం. ద్రవ వ్యర్థ నిర్వహణ మిషన్‌ భగీరథతో లింక్‌ అయి ఉన్నందున ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక వ్యర్థ నిర్వహణపై పూర్తి దృష్టి సారిస్తాం. భూగర్భ డ్రైనేజీపై కూడా దృష్టిపెడతాం. జవహార్‌ డంప్‌ యార్డ్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తికీ సన్నాహాలు చేస్తున్నాం. చెత్త రీసైక్లింగ్ కోసం రెండు ప్లాంట్‌లను ఏర్పాటు చేశాం. బస్తీప్రజల కోసం ఆరోగ్యసేవలకు బస్తీ దవాఖానాలనూ ఏర్పాటు చేశాం.

రహదారుల అభివృద్ధికి పెద్ద పీట
‘‘హైదరాబాద్‌లో సంభవించే విపత్తుల సమయంలో డిజాస్టర్‌ నిర్వహణ విభాగాన్ని, విజిలెన్స్‌ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లో 2018-19 ఏడాదికి సంబంధించి రోడ్లపై రూ.1,542 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఏడాది రూ.2,819 లక్షలు రోడ్ల మెరుగుదల కోసం ఖర్చు చేస్తున్నాం. హైదరాబాద్‌లో రహదారుల అభివృద్ధికి మున్సిపల్‌ బాండ్ల విధానాన్ని తీసుకొచ్చాం. దీనికింద ఇప్పటికే రూ.495 కోట్లు సేకరించాం. ఈ విధానాన్ని కేంద్రం కూడా అభినందించి రూ.39 కోట్లు విడుదల చేసింది. మరోవైపు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూ.వెయ్యి కోట్లు హైదరాబాద్‌లో రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేశాం. దాదాపు రూ.2,400 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని వేగంగా పూర్తి చేస్తున్నాం.’’ అని కేటీఆర్‌ సమాదానమిచ్చారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.