close

తాజా వార్తలు

‘తెలంగాణ ఇక ఒక్క క్షణం కూడా నిన్ను భరించదు’

సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ నిర్వహించిన మీడియా సమావేశంపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ కేబినెట్ సమావేశ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పత్రికా సమావేశంలో ఏకపాత్రాభియనం చూశాను. ఆయన మాటల్లో అడుగడుగునా అహంకారం కొట్టొచ్చినట్టు కనిపించింది. 16 మంది కార్మికులు చనిపోతే కనీస మానవత్వం లేకుండా కేసీఆర్ మాట్లాడారు. సదరు కార్మిక కుటుంబాలను ఆదుకుంటామని కానీ, కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం కానీ, సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కానీ ఆయన మాటల్లో కనిపించలేదు. నేనింతే... నేను నియంతను, నా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు చేస్తాను. బతికితే బతకండి.. చస్తే చావండి అన్నట్టుగా కేసీఆర్ తీరు కనిపించింది. రాచరికం రోజుల్లో కూడా ఇంతటి నియంతను ప్రజలు చూసి ఉండరు. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ మొత్తం విన్న తర్వాత నాకు ఒక్క విషయం స్పష్టంగా అర్థమైంది. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. దాని కోసం ఎన్ని ప్రాణాలనైనా బలిపెట్టడానికి సిద్ధపడ్డారు. కోర్టులపై కేసీఆర్‌కు కనీస గౌరవం లేదు. కోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకునే ఉద్దేశం కనిపించ లేదు. 

కార్మికులు అంటే అంటరాని వారు అన్నట్టుగా సీఎం కేసీఆర్‌ తీరు కనిపించింది. సంఘం ఆయన పార్టీకి అనుబంధంగా ఉన్నప్పుడు, దానికి ఆయన అల్లుడు హరీష్‌రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మంచివాళ్లుగా కనిపించిన కార్మిక సంఘం నాయకులు ఇప్పుడు చెడ్డవాళ్లుగా కనిపించడంలో ఆంతర్యం ఏమిటి? కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించడమే వాళ్లు మీకు చెడ్డవాళ్లుగా కనిపించడానికి కారణమా? సమస్యలు ఉన్నప్పుడు పిలిచి మాట్లాడి, పరిష్కారం కనుగొనడం ప్రజాస్వామ్యంలో సహజ ప్రక్రియ. కానీ, కేసీఆర్ మాత్రం నియంతలా నా నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. ప్రజా సంఘాలు, బుద్ధి జీవులు, కోర్టులు చేసిన సూచనలు పెడచెవిన పెడుతున్నారు. కార్మికులు పిట్టల్లా రాలిపోతుంటే కనికరం చూపలేని రాతి హృదయం కలిగిన వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టం. కొందరు బడాబాబులకు ఆర్టీసీని అమ్మివేయడానికి కేసీఆర్‌ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెపాన్ని ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలపై నెట్టి చేతికి మట్టి అంటకుండా ఆర్టీసీని హత్య చేసేందుకు పన్నాగం పన్నారు. అందుకే ఎవరెన్ని సూచనలు చేసినా.. ఆయన చెవికి ఎక్కడం లేదు.

 ఉద్యమ సమయంలో బంగారు ముద్దలుగా కనిపించిన కార్మిక సంఘాలు ఇప్పుడు అంటరానివిగా, ప్రగతి నిరోధకాలుగా కేసీఆర్‌కు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రక్రియలో ప్రధాన అడ్డంకి కార్మిక సంఘాలే. అందుకే వాటిని అంతమొందించేందుకు సంఘాలపై ప్రజల్లో విషం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. తాను అనుకున్న తంతు పూర్తి చేసేందుకు కోర్టులకు సైతం అధికారుల చేత తప్పుడు నివేదికలు ఇప్పించిన ఘనుడు కేసీఆర్. సమ్మె మొదలై నెల రోజులు కావస్తున్నా.. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా కేసీఆర్‌కు మాత్రం చీమకుట్టినట్టైనా లేదు. ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడే కేసీఆర్ పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అక్కడి ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అదే పని తెలంగాణలో చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? కోర్టులు ఏం చేయగలవన్నట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇలాగే అడ్డగోలుగా, అనుయాయులకు ఆస్తులు దోచిపెట్టి, అవినీతికి పాల్పడిన చాలా మంది ముఖ్యమంత్రులు జైళ్లలో ఊచలు లెక్కబెట్టిన ఉదంతాలు ఉన్నాయి. కేసీఆర్‌కు కూడా ఆ ఆగతి పట్టడం ఖాయం. 
 

ఓ వైపు కార్మికులు రెండు నెలలుగా పస్తులు ఉంటే మానవత్వంతో వారి స్థితిని అర్థం చేసుకోవాల్సింది పోయి... చిరు కార్మికులపై బ్లాక్ మెయిల్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఐదో తేదీ లోపు విధుల్లో చేరకుంటే డిస్మిస్ అంటూ హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ లాంటి అహంకారిని తెలంగాణ సమాజం ఎక్కువ కాలం భరించలేదు. ఇప్పటికే హద్దుదాటి కేసీఆర్ దుర్మార్గాన్ని సమాజం భరించింది. ఇక ఒక్క క్షణం కూడా కేసీఆర్‌ను భరించే స్థితిలో ప్రజలు లేరు. తెలంగాణలో కేసీఆర్ పోకడలకు వ్యతిరేకంగా మరో ఉద్యమం తీవ్ర రూపంలో మొదలు కావాల్సిన తరుణం ఆసన్నమైంది’’ అని రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.