
తాజా వార్తలు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడుసార్లు డెడ్‌లైన్ విధించినా 300లకు మించి కార్మికులు విధుల్లో చేరలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ బెదిరింపులను తిరస్కరించిన కార్మికులు నైతికంగా విజయం సాధించారన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. 48 వేల మంది కార్మికుల తిరస్కరణకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన మిలియన్ మార్చ్‌తో పాటు భవిష్యత్ పోరాటాల్లోనూ భాజపా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. కేసీఆర్‌కు ఆర్టీసీ అస్తుల మీద ఉన్న ప్రేమ కార్మికుల మీద లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్మికుడి కాలుకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కేసీఆర్ గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నాడని దుయ్యబట్టారు.