
తాజా వార్తలు
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై హైకోర్టులో జరిగిన విచారణపై కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆర్టీసీ వ్యవహారంపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయనీ.. ఐదుగురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారని తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించిన లెక్కలపై సమర్పించిన నివేదికలను న్యాయస్థానం తీవ్రంగా పరిగణించిందన్నారు. హైకోర్టును కూడా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిందనీ.. ఐఏఎస్ అధికారులు కూడా ఇలా చెబుతారని భావించలేదని కోర్టు వ్యాఖ్యానించినట్లు వివరించారు. ఈ నెల 11లోపు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించిందన్నారు. సీఎం కేసీఆర్ అధికారులతో 9గంటల పాటు సుదీర్ఘ సమీక్షలు జరిపే కంటే ఆర్టీసీ ఐకాస నేతలతో 90 నిమిషాలు చర్చిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
మిలియన్ మార్చ్‌కు తరలిరండి
దయచేసి తమను ఈ నెల 11 లోపు సీఎం చర్చలకు పిలవాలని అశ్వత్థామరెడ్డి కోరారు. మరోవైపు, తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు. ఈ నెల 9న మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నామనీ.. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులంతా పట్టు సడలకుండా మరింత ధైర్యంతో ముందుకు సాగాలని కోరారు.