close

తాజా వార్తలు

‘మహా’లో రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫారసు

ముంబయి‌: దాదాపు 20 రోజులుగా ఉత్కంఠగా సాగిన నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించినప్పటికీ భాజపా, శివసేన పార్టీలు అవసరమైన మద్దతు కూడగట్టలేకపోవడంతో రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫారసు చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో భేటీ అయిన కేంద్ర కేబినెట్‌ కూడా ఇందుకు ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనపై కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని ఆమోదం కోసం రాష్ట్రపతికి కూడా పంపినట్టు సమాచారం. భాజపా, శివసేన తర్వాత ఎన్సీపీకి అవకాశం కల్పించిన గవర్నర్‌.. ఆ గడువు ఇంకా ముగియకముందే రాష్ట్రపతి పాలనకు ఎలా సిఫారసు చేస్తారనే ప్రశ్నలు పలువురు నేతలు లేవనెత్తుతున్నారు. 

ఎన్నికల ఫలితాలు వెల్లడైన దగ్గరి నుంచి కొన్నాళ్ల పాటు భాజపా- శివసేన చుట్టూ తిరిగిన రాజకీయం.. మరో మలుపు తిరిగి సోమవారం రాత్రి ఎన్సీపీ - కాంగ్రెస్‌ కూటమి కోర్టుకు చేరింది. ఎన్నికల్లో కలిసి పోటీచేసి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన దానికంటే అధికంగా సీట్లు సాధించినా.. భాజపా- శివసేన కూటమి మధ్య అధికారం సగం సగం పంచుకోవడంపై నెలకొన్న విభేదాలతో ఉత్కంఠ రేపిన ‘మహా’ రాజకీయాలు గవర్నర్‌ తాజా నిర్ణయంతో మరింత హీటెక్కాయి. 

ఈ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన భాజపాను తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆహ్వానించగా తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పార్టీ తిరస్కరించింది. తర్వాత శివసేనను పిలవగా తమకు మరింత గడువు కావాలన్న ఆ పార్టీ విజ్ఞాపనను తిరస్కరించిన గవర్నర్‌.. నిన్న సాయంత్రం ఎన్సీపీని ఆహ్వానించారు. మంగళవారం రాత్రి 8.30 గంటల లోపు తెలపాలని డెడ్‌లైన్‌ కూడా విధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ సుముఖంగా లేకపోయినా శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపైనే ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ పవార్‌, దిల్లీ నుంచి ముంబయి చేరుకున్న కాంగ్రెస్‌ అధిష్ఠాన పెద్దలు అహ్మద్‌ పటేల్‌, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో చర్చల తర్వాత ఆ రెండు పార్టీల నిర్ణయంపై ఓ స్పష్టత రానుంది. 

288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన భాజపా 105 స్థానాల్లో, శివసేన 56 స్థానాల్లో విజయం సాధించాయి.  ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 145 సీట్ల కన్నా ఎక్కువ సీట్లే గెలుచుకున్నాయి. ఎన్నికల ఫలితాలు అక్టోబర్‌ 24న వెల్లడవ్వగా సీఎం పీఠం చెరిసగం కాలం ఉండాల్సిందేనని శివసేన పట్టుబట్టడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. తమ పార్టీ డిమాండ్లను భాజపా అంగీకరించకపోవడంతో ఎన్సీపీ (56 సీట్లు), కాంగ్రెస్‌ (44సీట్లు)లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన ప్రయత్నించిన విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.