
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠకు రాష్ట్రపతి పాలనతో తెరపడింది. భాజపా-శివసేన కూటమిగా పోటీచేసి మొత్తం 288 స్థానాల్లో భాజపా 105, శివసేన 56 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో ఈ కూటమికి మెజార్టీ లభించింది. అయితే సీఎం పీఠాన్ని చెరి రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలని శివసేన పట్టుబట్టడంతో ఇరు పక్షాల మధ్య దూరం పెరిగింది. ప్రభుత్వం ఏర్పాటుచేయలేనని భాజపా గవర్నర్‌కు తెలియజేసింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు రావాలని శివసేనకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు. సేనకు ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మద్దతిస్తామని ప్రకటించినా చివర్లో కాంగ్రెస్ ముఖం చాటేసింది. దీంతో సేనకు అవకాశం దక్కలేదు. ఇక ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం లేదు. భాజపా+శివసేన లేదా శివసేన+ఎన్సీపీ+కాంగ్రెస్‌ల కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు. భాజపా అధిష్ఠానం ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన ఒత్తిడిని అడ్డుకొంది. సుదీర్ఘకాలంగా ఈ రెండు పక్షాల మధ్య ఉన్న మైత్రి బంధం కూడా తెగిపోయింది.
భాజపాకు లాభమే..
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనతో అంతిమంగా లాభపడేది భాజపానే. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సేనతో జట్టుకట్టకుండా వేరుగా పోటీచేసి ఏకంగా 122 సీట్లను సాధించగా సేన కేవలం 63 సీట్లను మాత్రమే గెలిచింది. ఈ ఎన్నికల్లో సేనతో పాటు చిన్న చిన్న పక్షాలతో కూటమి కట్టినా.. ఏకంగా 17 సీట్లను నష్టపోయింది. ఒకరకంగా చూస్తే శివసేనతో పొత్తు ఆ పార్టీకి నష్టం చేసిందని తెలుస్తోంది. ఓట్ల శాతం 2014తో పోలిస్తే 2.06 శాతం తగ్గగా, సేనకు ఏకంగా 2.94 శాతం తగ్గిపోవడం గమనార్హం. శివసేన ముంబయి మహానగరం, థానే, కొంకణ్ ప్రాంతాల్లోనే బలంగా ఉంది. మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో భాజపా గణనీయశక్తిగా అవతరించింది. దేవేంద్ర ఫడణ్వీస్కు నిజాయితీపరుడిగా పేరుంది. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీతో పాటు రాష్ట్రంలో బలమైన నాయకత్వంఉంది. ఫడణవీస్ హయాంలో అధికారుల సూచనలు అనుసరించడం, ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడం, ఎన్నికల సమయంలో వచ్చిన వరదలు, ఎన్సీపీ నేత శరద్ పవార్‌కు ఈడీ నోటీసులు.. తదితర అంశాలు భాజపా విజయావకాశాలపై ప్రభావం చూపించాయి. రాష్ట్రపతి పాలనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కచ్చితంగా భాజపాకు అనుకూలంగా మారే అవకాశముంది. ఒకవేళ మరోసారి ఎన్నికలు వచ్చినా ప్రజాకోర్టులో దోషిగా శివసేనను నిలబెట్టవచ్చు. సేనకు మద్దతిచ్చిన ఎన్సీపీ, కాంగ్రెస్‌లను కూడా ప్రజా న్యాయస్థానంలో నిలబట్టే అవకాశం లభిస్తుంది.
శివసేనకు కష్టమే..?
భాజపాకు చిరకాల మిత్ర పక్షం శివసేన. ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ ఠాక్రేతో భాజపా అగ్రనేతలు వాజ్‌పేయి, అడ్వాణీలు తరచుగా సమావేశాలు నిర్వహించేవారు. 1995 ఎన్నికల్లో కూటమి విజయం సాధించి తొలిసారిగా రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. సేన నేతలు సీఎంగా ఉన్న సమయంలో భాజపా ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. ఆ ఎన్నికల్లో శివసేనకు 73, భాజపాకు 65 సీట్లు లభించాయి. అయినా సీఎం పీఠం కావాలని భాజపా కోరలేదు. ఒక విధంగా శివసేన ముంబయి నగరం నుంచి బయట ఎదగలేదు. సేన దుందుడుకు విధానాలతో రాష్ట్రంలోని ఉత్తర భారతీయులు కాంగ్రెస్‌కు మద్దతుగా మారకుండా భాజపా తన వైపునకు తిప్పుకుంది. ఇలా భాజపా పటిష్టంగా నిర్మితమైంది. శివసేన నుంచి రాజ్‌ఠాక్రే తప్పుకొని ఎంఎన్ఎస్ పేరుతో వేరుకుంపటి పెట్టడంతో ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు చీలిపోయింది. 1999,2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వరుసగా ఘనవిజయాలు సాధించడం గమనార్హం. దాదాపు 15 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్న కాషాయ కూటమి 2014 మోదీ ప్రభంజనం అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేశాయి. ఆ ఎన్నికల్లో సేనకు 63 సీట్లు మాత్రమే వచ్చాయి. భాజపాకూ పూర్తి మెజార్టీ రాకపోవడంతో పాటు సేన కూడా తిరిగి స్నేహహస్తం అందించడంతో ప్రభుత్వ ఏర్పాటు జరిగింది. ఈ ఐదేళ్ల కాలంలో సేన కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై అనేక సార్లు విరుచుకుపడింది. ఈ దఫా సైతం విడివిడిగా పోటీచేయడం వల్ల అధికారానికి దూరం అవుతామన్న భయం తిరిగి ఇరు పక్షాలను ఒక్క కూటమిగా చేసింది. అయితే భాజపా కు తగినన్ని సీట్లు రాకపోవడంతో సీఎం పీఠంపై శివసేన మెలికబెట్టింది. కానీ భాజపా అంగీకరించకపోవడంతో శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్ధతుకు యత్నించింది. చివరిక్షణంలో కాంగ్రెస్ ఒప్పుకోలేదు. దీంతో సేన వ్యూహం పారలేదు. తాజా రాజకీయ పరిణామాల్లో రాష్ట్రపతి పాలన విధించడంతో పరోక్షంగా అధికారం భాజపా చేతుల్లోనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. భవిష్యత్తులో సేన భాజపాతో పొత్తు పెట్టుకోలేదు. దీంతో పాటు వారికి అండగా ఉన్న అనేక వర్గాల మద్దతును కోల్పోనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు దక్కని అవకాశం
శివసేనకు మద్దతునిచ్చి చక్రం తిప్పాలని ఆశించిన ఎన్సీపీ వ్యూహం పారలేదు. అదే విధంగా చివరి క్షణం వరకు మద్దతిస్తామని చెప్పిన కాంగ్రెస్ చివర్లో తప్పుకోవడం నష్టం కలిగించే అంశమే. మొత్తంగా అవకాశవాద రాజకీయాలకు శివసేన+ఎన్సీపీ+కాంగ్రెస్ వేదికగా మారాయని భాజపా విమర్శిస్తోంది. శివసేన ఆవిర్భావంనుంచి కాంగ్రెస్‌తో పోరుచేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ సేనపై ఎన్సీపీ, కాంగ్రెస్‌లు విమర్శలు చేశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు కూడా కాకముందే ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించిన విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. రానున్న రోజుల్లో ఇవి వారికి ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి.