
తాజా వార్తలు
అమరావతి: శాసనసభ సభాపతి స్థానాన్ని కించపరిచేలా విమర్శలు చేసిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్, మాజీ విప్ కూన రవికుమార్‌కు నోటీసులు పంపిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ... అసభ్య పదజాలంతో సభాపతి తమ్మినేని సీతారామ్‌ను ప్రతిపక్ష నాయకులు దూషించారన్నారు. ఎమ్మెల్సీ లోకేశ్.. లేఖల రూపంలో స్పీకర్ స్థానాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారన్నారు. సభాపతి గౌరవాన్ని భంగపర్చేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు.
ప్రతి బుధవారం నిర్వహించే ప్రభుత్వ, వైకాపా పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో సభాపతిపై అనుచిత వ్యాఖ్యల అంశం ప్రధానంగా చర్చకు వచ్చిందన్నారు. వారిపై క్రిమినల్ చర్యలపైనా పరిశీలన జరుగుతోందన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా 25 మంది వైకాపా ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం, సెర్ప్ కార్యక్రమాల అమలుపై చర్చించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అస్తవ్యస్తంగా అమలుచేశారన్నారు. మహిళా సంఘాలను రాజకీయ సభలకు వినియోగించకుండా వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రచారం కోసం తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఇసుక కొరత మానవ తప్పిదమంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.