close

తాజా వార్తలు

జగన్‌కు డబ్బుపై వ్యామోహం: చంద్రబాబు

విజయవాడ: రాష్ట్రంలో ఇసుక కొరత కృత్రిమమేనని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రతి పనిలోనూ జే ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని.. మద్యం నియంత్రించాల్సిన శాఖతోనే మద్యం అమ్మకాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో చేపట్టిన ఇసుక దీక్షను చంద్రబాబు విరమించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయన ఈ దీక్షను కొనసాగించారు. ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దీక్ష ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్‌కు డబ్బుపై వ్యామోహం ఎక్కువని.. బలవంతంగా ప్రజల ఆస్తులను రాయించుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదని వ్యాఖ్యానించారు. పేదవాడి ప్రాణాలు పోయినా.. వారి బతుకులు చితికిపోయినా సీఎం జగన్‌కు పట్టదని మండిపడ్డారు. ఇసుక కొరతపై పోరాడుతున్న రాజకీయ పార్టీలపై అధికారపక్షం ఎదురుదాడి చేస్తోందని ఆరోపించారు. రాజకీయం అంటే తమాషా అనుకుంటున్నారా? అని చంద్రబాబు దుయ్యబట్టారు.

మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే అలాగే అంటారా?

ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కాలంతీరి చనిపోయారంటూ ఓ మంత్రి వ్యాఖ్యానించడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల ఇంట్లో ఎవరైనా మృతిచెందితే అలాగే అంటారా అని ప్రశ్నించారు. పేదలు నాశనమైనా ఫర్వాలేదని.. తన అనుకునే వాళ్లు డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే పేదల్ని బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. 35లక్షల మంది కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాడికి భోజనం పెట్టే ‘అన్న క్యాంటీన్‌’ను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. జగన్‌లాంటి కుటిల రాజకీయాలు చేసే వారిని కొన్ని వేలమందిని చూశానన్నారు. ఆయన కుట్రలు సాగవని హెచ్చరించారు. ఇద్దర్ని పార్టీ నుంచి తీసుకెళ్లి తనపై ఆరోపణలు చేయిస్తున్నారని.. ఒకరు వెళ్తే వందమంది నాయకులను తయారుచేస్తానన్నారు. కోడెల శివప్రసాదరావుపై బలమైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్ని చట్టాలు వచ్చినా.. వీళ్లకు చుట్టాలేనని వ్యాఖ్యానించారు. ప్రజల ముందు వైకాపా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని హెచ్చరించారు.

అమరావతిపై కక్ష ఎందుకో?

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా మార్చాలని అనుకున్నామని.. దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. బంగారు గుడ్లు పెట్టే బాతును వైకాపా ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. అమరావతిపై కక్ష ఎందుకో తనకు అర్థం కావడం లేదని.. వైకాపా పాలన చూసి ప్రముఖ సంస్థలు వెనక్కి వెళ్తున్నాయని చెప్పారు. ఒక విజన్‌ పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటే నాకేమీ అర్థం కావడం లేదని.. తప్పులు చేసినవాళ్లకే అలాంటివి బాగా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయతీగా బతికామని.. తప్పు చేయకుండా పాలన చేశామని చెప్పారు. ఎంతో బతిమాలి విశాఖకు లులు కంపెనీని తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. పెట్టుబడులు తేవడం కష్టమని..భయపెట్టి పారదోలడం సులువని ఆయన వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాల కంటే రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమన్నారు. తిరుపతిలో అన్యమత ప్రచారం ఎప్పుడైనా జరిగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీశైలం, అన్నవరంలో ఏం జరుగుతున్నాయని మండిపడ్డారు. సామాజిక న్యాయమే తన కులమని.. తనపై కులముద్ర వేస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.