
తాజా వార్తలు
ముంబయి: పార్టీ వ్యవస్థాపకుడు బాల్ సాహెబ్ ఠాక్రే ఆశయం మేరకు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శివసేన నుంచే అవుతారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. బాల్ ఠాక్రే ఏడో వర్థంతి సందర్భంగా ఆయనకు సంజయ్ రౌత్ ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బాల్ ఠాక్రే కోసం మేం ఏమైనా చేస్తాం. త్వరలోనే ఆయన కోరిక మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. బాల్ ఠాక్రేకు ఉద్ధవ్ ఇచ్చిన మాట త్వరలోనే నెరవేరనుంది.’’ అని అన్నారు.
శనివారం కూడా భాజపాపై సంజయ్ రౌత్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమికి భాజపా నేతృత్వం వహిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. గతంలోని కూటమికి, ప్రస్తుత ఎన్డీఏకు చాలా తేడా ఉందని విమర్శించారు. తొలుత ఎన్డీఏ కూటమి ఏర్పాటులో బాల్ ఠాక్రే, అటల్ బిహారీ వాజ్పేయీ, ఎల్కే అడ్వాణీ, ప్రకాశ్ సింగ్ బాదల్ ముఖ్య పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇప్పటివరకూ శివసేన ఎన్డీఏలో భాగంగా ఉందని, ఇకనుంచి తమ ఎంపీలు పార్లమెంటులో ప్రతిపక్షాల స్థానంలో కూర్చోనున్నారని స్పష్టం చేశారు. అధికార పత్రిక సామ్నాలో శివసేన పార్టీ భాజపాపై విమర్శలు చేస్తూనే ఉంది. భాజపా నాయకులు తాము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోనందునే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిందని విమర్శించింది.