close

తాజా వార్తలు

తెరాస ఏజెంట్‌గా సునీల్‌శర్మ: విపక్ష నేతలు

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె పరిష్కారంపై చొరవ చూపాలని కోరుతూ విపక్ష నేతలు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అఫిడవిట్‌ సమర్పించిన ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మపై చర్యలు తీసుకోవాలని నేతలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే దిల్లీ వెళ్లి రాష్ట్రపతి, కేంద్రమంత్రులను కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు. తెజస అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్‌ తరఫున మాజీ మంత్రి గీతారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, భాజపా నేత మోహన్‌రెడ్డి తదితరులు గవర్నర్‌తో సమావేశమయ్యారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని కోదండరాం విమర్శించారు. కార్మికులు ఎప్పుడు వచ్చినా విధుల్లోకి తీసుకోవాలని న్యాయస్థానం చెప్పిందన్నారు. ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ఎల్‌.రమణ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయబోమని సీఎం కేసీఆర్‌ గతంలో అన్నారని గుర్తు చేశారు. సునీల్‌శర్మ తెరాసకు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆయన్ను ఆర్టీసీ ఎండీ బాధ్యతల నుంచి తప్పించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. 48వేల మంది ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని రమణ డిమాండ్‌ చేశారు. గీతారెడ్డి మాట్లాడుతూ సమ్మె అంశంలో కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ సమర్పించిన అఫిడవిట్‌ అంశంలో కల్పించుకోవాల్సిందిగా గవర్నర్‌ను కోరామని చెప్పారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 28 మంది ఆర్టీసీ కార్మికులు గుండెపోటుతో పాటు ఆత్మహత్యలకు పాల్పడినా సీఎం కేసీఆర్‌కు కనికరం రావడం లేదన్నారు. రెండు నెలలుగా వేతనాలు లేకపోవడంతో చాలామంది కార్మికులు పస్తులుంటున్నారని చెప్పారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.