
తాజా వార్తలు
దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు భారత్కు బంగారు బాతుల్లాంటివని, అవి దేశానికే గర్వకారణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థలను విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ ఆమె బుధవారం ట్వీట్ చేశారు. ‘‘నవ భారతాన్ని నిర్మిస్తామని భాజపా హామీ ఇచ్చింది. కానీ వాళ్లు భారత ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారు. ఇది దురదృష్టకరం.’’ అని హిందీలో ట్వీట్ చేశారు.
ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థల విక్రయాన్ని వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేయనున్నట్లు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా సంస్థకు రూ.58 వేల కోట్ల రుణాలు ఉన్నాయని, దీనిని సొంతం చేసుకొనేందుకు పెట్టుబడి దారులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. మరోవైపు భారత్ పెట్రోలియంలో ప్రభుత్వానికున్న 53.29 శాతం వాటాను అమ్మేందుకు సంస్థ సెక్రటరీల గ్రూపు అక్టోబరులోనే అంగీకరించింది.