close

తాజా వార్తలు

వారిద్దరూ కలిస్తే.. ఎలుక పిల్లి కలిసినట్టే..!

అన్నాడీఎంకే విమర్శలు

చెన్నై: తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైతే తామిద్దరం కలిసి పనిచేస్తామంటూ తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే తీవ్రస్థాయిలో స్పందించింది. 2021లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ కలుస్తామనడం ఎలుక, పిల్లి కలిసి నివసించినట్టే ఉంటుందని ఎద్దేవా చేసింది. కమల్‌, రజనీ కలిస్తే సమస్యలు ఎదుర్కోక తప్పదని అన్నాడీఎంకే పార్టీ అధికారిక పత్రిక ‘నమదు అమ్మ’లో పేర్కొంది. కమల్‌ హాసన్‌ హేతువాదం, కమ్యూనిజం గురించి మాట్లాడుతుండగా.. రజనీ మాత్రం ఆధ్యాత్మిక రాజకీయాలు అంటున్నారని గుర్తుచేసింది. ‘‘ఆధ్యాత్మిక రాజకీయాల గురించి మాట్లాడే రజనీకాంత్‌.. హేతువాదం, కమ్యూనిజం గురించి నిరంతరం మాట్లాడే కమల్‌ హాసన్‌తో కలిసి పనిచేస్తామనడం పిల్లి ఎలుక కలిసి జీవించడంలా ఉంటుంది. కమల్‌తో కలిసి పనిచేయడం రజనీకాంత్‌కు రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో రజనీకి కాలమే పాఠం నేర్పుతుంది’’ అంటూ ఆర్టికల్‌లో కమల్‌నే ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు కమల్‌ హాజన్‌ మక్కల్ నీది మయ్యం పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, 2017 డిసెంబర్‌లో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీకాంత్‌.. ఇప్పటివరకు పార్టీ ఏర్పాటు చేయలేదు. 2021 ఎన్నికలకు ముందు ఆయన పార్టీ ఏర్పాటు చేస్తానని ఇటీవల ప్రకటించారు. అయితే, తమిళనాడు అభివృద్ధి కోసం అవసరమైతే తామిద్దరం కలిసి పనిచేస్తామని కమల్‌, రజనీ వేర్వేరు చోట్ల ప్రకటించారు. 

‘తమిళనాడు అభివృద్ధి కోసం అవసరమైతే రజనీ, నేను కలిసి పనిచేస్తాం. మేం 43 ఏళ్ల పాటు కలిసే ఉన్నాం. మా ఇద్దరం కలవడం అద్భుతమేమీ కాదు’

- కమల్‌ హాసన్‌ 

కమల్‌ మాట్లాడిన గంట వ్యవధిలోనే స్పందించిన రజనీ.. ‘తమిళనాడు ప్రజల అభ్యున్నతి కోసం అవసరమైతే కమల్‌తో చేతులు కలుపుతా’ అని అన్నారు. తాను భాజపాకు చెందిన వ్యక్తిని కాదనీ.. తనకు కొందరు కాషాయ రంగు పులిమేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఇటీవల రజనీకాంత్‌ స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ప్రముఖ సినీ నటులు రాజకీయాల్లో ఎంతో ఘన విజయం సాధించిన చరిత్ర తమిళనాట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కమల్‌, రజనీ కలిసి కూటమిగా ఏర్పడితే మరింత బలంగా మారే అవకాశం ఉండటంతో అన్నాడీఎంకే ఆందోళనకు గురవుతోందంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.