close

తాజా వార్తలు

21 నోటిఫికేషన్లు ఒకటే ప్రణాళిక

గ్రూప్స్‌ ప్రిపరేషన్‌ జనరల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

గ్రూప్‌-1, 2 సహా పలు రకాల నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వాటిలో 21 ప్రకటనలకు సంబంధించి జనరల్‌ సైన్స్‌, టెక్నాలజీ విభాగానికి ఒకే రకమైన సిలబస్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది అభ్యర్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పోటీని తట్టుకొని విలువైన ప్రతి మార్కును పొందాలంటే, విస్తృతంగా ఉన్న సబ్జెక్టును విభజించుకొని చదవాలి. అనవసరమైన లోతులకు పోకుండా అవసరమైన వాటిని గుర్తించి తెలివిగా అధ్యయనం చేయాలి. లేకపోతే తెలియకుండానే సమయం వృథా అయిపోతుంది.

21 నోటిఫికేషన్లు ఒకటే ప్రణాళిక

21 నోటిఫికేషన్లు ఒకటే ప్రణాళికఏపరీక్షకైనా సన్నద్ధత ప్రారంభించాలంటే ముందుగా సిలబస్‌ను విశ్లేషించుకోవడం ప్రధానం. ఏపీపీఎస్‌సీ సిలబస్‌ ప్రకారం.. జనరల్‌సైన్స్‌- నిత్యజీవితంలో దాని అనువర్తనాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో వర్తమాన అభివృద్ధి, సమాచార సాంకేతికత ఉన్నాయి. సులభంగా ప్రిపరేషన్‌ సాగించడానికి ఈ సిలబస్‌ను 3 భాగాలుగా విభజించుకోవాలి. కరెంట్‌ అఫైర్స్‌తో అనుసంధానం చేసుకొని దాని ప్రకారం సిలబస్‌ అంశాలను చదువుకోవాలి. ప్రతిదాన్ని లోతుగా అధ్యయనం చేయాలని ప్రయత్నించ వద్దు.

నిత్యజీవితంలో జనరల్‌ సైన్స్‌ అనువర్తనాలు

21 నోటిఫికేషన్లు ఒకటే ప్రణాళిక

దీన్ని తిరిగి మూడు ఉపవిభాగాలుగా విభజించుకోవచ్చు. అవి: 1) భౌతికశాస్త్రం 2) రసాయన శాస్త్రం 3) జీవశాస్త్రం. వీటికి సంబంధించిన అంశాలకు 7 నుంచి 10 తరగతుల పుస్తకాలను చదవాలి. వీటిలో పూర్తి సబ్జెక్టు సంబంధిత విషయాలకు తక్కువ, నిత్యజీవితంలో సైన్స్‌ సంబంధిత అంశాలు, దైనందిత జీవితంలో సైన్స్‌ అనువర్తనాలు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నలు ఎక్కువగా ఈ కోణంలోనే వస్తున్నాయని గమనించవచ్చు. ఈ విభాగంలో సిలబస్‌ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సన్నద్ధతను తేలిక చేసుకోవడానికి అభ్యర్థులు అన్ని పుస్తకాల్లోని ఒక పాఠ్యాంశాన్ని ఒకేసారి చదవాలి.
ఉదాహరణకు జీర్ణక్రియ వంటి వాటిని ఏడు నుంచి పది తరగతుల్లోని అన్ని పుస్తకాల్లో ఒకేసారి చదివి, ముఖ్యమైన అంశాలను నోట్‌ చేసుకోవాలి. సిలబస్‌కు సంబంధం లేని వాటిని వదిలివేయడం మంచిది లేదంటే అన్ని విషయాలను గుర్తుపెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. గత కొద్ది సంవత్సరాల నుంచి ప్రిపరేషన్‌ సాగిస్తున్నవారు ఇప్పటికే వీటిని చదివి ఉంటారు. కాబట్టి వీరు మిగతా 2 విభాగాలపై దృష్టిసారించాలి. ఈ విభాగంలోని అంశాలు పాత సిలబస్‌లోవి ఒకేరకంగా ఉండటం వారికి కలిసొచ్చే అంశం.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో...

ఈ విభాగంలో ఇటీవలి ప్రముఖ, వార్తల్లో ఉన్న అంశాలు ఉంటాయి. వీటిల్లో వైద్య, అణు, రక్షణ, అంతరిక్షం, రోబోటిక్స్‌, సూపర్‌ కంప్యూటర్స్‌, క్లోనింగ్‌, జన్యుపరివర్తన జీవులు, మూలకణ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అంశాలుంటాయి. వీటిలో ఆయా అంశాల మూల సూత్రాలు, ప్రాథమిక విషయాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వీటిపై అవగాహన ఉంటేనే వర్తమాన విషయాలు అర్థమై, తేలికగా గుర్తుంటాయి. ఈ విభాగంలో గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన అభివృద్ధికి చాలా ప్రాధాన్యమివ్వాలి. మొత్తంగా కరెంట్‌ అఫైర్స్‌ కోణంలో చదవడం ఉపయోగకరం.

సమాచార సాంకేతికత (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)

21 నోటిఫికేషన్లు ఒకటే ప్రణాళిక

ఇది నూతనంగా చేర్చిన అంశం. అభ్యర్థులకు కొత్తగా అనిపించవచ్చు. ఈ విభాగంలో ఈ-గవర్నెన్స్‌, వైద్య- విద్య రంగాల్లో సమాచార సాంకేతిక వినియోగం వంటివాటిపై దృష్టిసారించాలి. మారుమూల ప్రాంతాల వారికి వైద్యసేవలు అందించడానికి ఉపయోగపడే టెలిమెడిసిన్‌ను దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇవే కాకుండా నూతనంగా అభివృద్ధి పరచిన సూపర్‌ కంప్యూటర్స్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌ డేటా అనాలిసిస్‌, ఈ-కామర్స్‌, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వినియోగం, వీటికి సంబంధించిన సేవల పేర్లు, డిజిటల్‌ ఇండియా, బ్రాడ్‌బ్యాండ్‌, 4జీ, 5జీ టెక్నాలజీ వంటి అంశాలను చదవాల్సి ఉంటుంది. అయితే పూర్తి అంశాన్ని కాకుండా దానిలోని మూలసూత్రం, వాటి ఉపయోగాలు మాత్రమే చదవాలి.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు ప్రత్యేకంగా

21 నోటిఫికేషన్లు ఒకటే ప్రణాళిక

ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న అన్ని పోటీపరీక్షల కంటే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ జనరల్‌ స్టడీస్‌లో ఇచ్చిన సిలబస్‌ వేరుగా ఉంది. ఇతర ఏ పోటీపరీక్షల్లో ఇవ్వని విధంగా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి అత్యధికంగా 30 మార్కులను కేటాయించారు. దీనికి ప్రత్యేకంగా సిలబస్‌ను కూడా ఇచ్చారు. సిలబస్‌ విస్తృతంగా ఉంది. కొత్తగా సన్నద్ధమయ్యేవారు దీన్ని చూసి కొంత ఆందోళనకు గురైనా సరైన ప్రణాళికతో ఈ సమస్యను అధిగమించవచ్చు. గ్రూప్‌-1 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సిలబస్‌ను 5 విభాగాలుగా చదువుకొని వర్తమానాంశాలతో కలిపి నోట్స్‌ రాసుకోవాలి.  అవి స్థూలంగా 1. నిత్య జీవితంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, దీని అభివృద్ధికి దేశం తీసుకొంటున్న చర్యలు, పాలసీలు 2. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంబంధిత అంశాలు 3. అంతరిక్షం, రక్షణ రంగం 4. శక్తిసంబంధిత టెక్నాలజీ అంశాలు 5. పర్యావరణ, బయోటెక్నాలజీకి సంబంధించినవి.
ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కూ ఉపయోగపడేలా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ మెయిన్స్‌ కోణంలో చదవాలి. రెండింటిలోనూ దాదాపుగా ఒకే సిలబస్‌ ఉంది కాబట్టి, శ్రమా తగ్గుతుంది. సిలబస్‌లోని అంశాల్లో వర్తమాన విషయాలకు సంబంధం ఉన్నవాటికి ప్రాధాన్యమిస్తే మరింత ప్రయోజనకరం. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలకు ప్రముఖ దినపత్రికలో వచ్చే వ్యాసాలు, వార్తలు, ఇయర్‌ బుక్‌, తెలుగు అకాడమీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పుస్తకాలు, పర్యావరణ శాస్త్రపుస్తకాలు, పరిశోధనా సంస్థలు వెబ్‌సైట్‌లు ఉపయోగపడతాయి.

సిలబస్‌ను దాటవద్దు!

21 నోటిఫికేషన్లు ఒకటే ప్రణాళిక

* సిలబస్‌ ఎక్కువగా ఉందని భయపడకూడదు. సరైన ప్రణాళికతో సిద్ధమైతే విజయం వరిస్తుంది. * సిలబస్‌ ప్రాథమిక అవగాహనను కల్పించడానికే గానీ ఆయా అంశాలపై లోతైన అవగాహనకు కాదనే విషయాన్ని గమనించాలి. ఏపీపీఎస్సీ పోటీపరీక్షల్లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై వస్తున్న ప్రశ్నలు సబ్జెక్టు సంబంధిత అంశాలపై దాదాపుగా ఉండవు. వివిధ విషయాలను స్పృశించాలి. ఒకే అంశాన్ని సబ్జెక్టు కోణంలో విస్తృతంగా చదవాల్సిన పనిలేదు. * ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్‌ చేసుకుంటూ, పాయింట్స్‌ రూపంలో రాసుకుంటే సగం సన్నద్ధత పూర్తయినట్లే. * మాదిరి ప్రశ్నాపత్రాలను తరచూ సాధన చేయడం ద్వారా సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. * సిలబస్‌ను దాటి   చదివితే ఎక్కువ శ్రమకు గురవుతారు. గమనించుకోవాలి.

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.