close

తాజా వార్తలు

సుస్థిరంగా మార్కుల వృద్ధి

కల వరపడకుండా కొత్త అంశంపై పట్టు

సుస్థిరంగా మార్కుల వృద్ధి

ఏపీపీఎస్‌సీ గ్రూప్స్‌ పరీక్షల్లో కొత్తగా చేర్చిన అంశం- ‘సుస్థిరాభివృద్ధి- పర్యావరణ పరిరక్షణ’. దాదాపు 8 నుంచి 10 ప్రశ్నలు దీనిలో వస్తాయి. ‘నూతనాంశం కదా, ఎలా చదవాలో!’ అని ఆందోళన చెందనవసరం లేదు. ప్రశ్నలు కూడా మరీ కఠిన స్థాయిలో అడిగే అవకాశం లేదు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పోటీ పరీక్షల్లో ఎక్కువగా డిగ్రీ స్థాయి పుస్తకాల నుంచీ, అదే స్థాయికి చెందిన వర్తమాన సమాచారం నుంచీ ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. థియరీ కంటే ఆచరణాత్మక పద్ధతిలో ఇవి ఉంటున్నాయి.

జనరల్‌ స్టడీస్‌లో ప్రధానంగా 2016 నుంచి సుస్థిరాభివృద్ధినీ, 2018 నోటిఫికేషన్లు నుంచి ‘సుస్థిరాభివృద్ది-పర్యావరణ పరిరక్షణ’నీ సిలబస్‌లో ప్రవేశపెట్టారు. 2014 ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత గ్రూప్స్‌, ఇతర ఉద్యోగ నియామక పరీక్షల్లో ‘ఆంధ్రప్రదేశ్‌ విభజన-సమస్యలు’ అనే అంశాన్ని చేర్చారు. ఈ విధంగా నూతనంగా చేర్చిన అంశాల పాఠ్యాంశ పరిధి తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ రకమైన తక్కువ పరిధి అంశాలను విశ్లేషణాత్మక అవగాహన ద్వారా చదువుకోగల్గితే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
సుస్థిరాభివృద్ధి - పర్యావరణ పరిరక్షణలో సులభంగా మార్కులు పొందడానికి దీని మూలం, చరిత్రలపై స్థూల అవగాహన అవసరం. అందుకే దీని విశేషాలను పరిశీలిద్దాం.

మూలం ఎక్కడ?
18, 19వ శతాబ్దాల్లో ఐరోపాలోని అటవీ అధికారులు మొదట సుస్థ్థిరత్వం అనే భావనను ప్రవేశపెట్టారు. ఆనాడు అడవుల్లో చెట్లు తరిగిపోయినా, కొట్టివేసినా తిరిగి ఆ ప్రాంతాల్లో నాటి చెట్ల సంఖ్యను భర్తీ చేసేవారు. ఇలా భావితరాలవారికి కూడా అడవులు తరిగిపోకుండా ఉండాలనే సంకల్పంతో ఉద్భవించిన పదమే సుస్థిరత్వం.

1972 జూన్‌ 5న స్వీడన్‌ స్టాక్‌ హోం పర్యావరణ సదస్సులో ఐక్యరాజ్యసమితి ‘సుస్థిరాభివృద్ధి’ అనే పదాన్ని ఉపయోగించింది. తర్వాత 1980లో ఐరోపాకు చెందిన ‘ప్రకృతి, సహజ వనరుల అంతర్జాతీయ యూనియన్‌’ సంస్థ వారు ఈ భావనను వెలుగులోకి తెచ్చారు. 1987లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ‘బ్రంట్‌ లాండ్‌ కమీషన్‌’లో ‘అవర్‌ కామన్‌ ఫ్యూచర్‌’ అనే నివేదిక సుస్థిరాభివృద్ధి భావనను విస్తృతం చేసింది. ఈ నివేదికలో ‘ప్రస్తుత తరాలవారి అవసరాలు, ఆకాంక్షలను నెరవేరుస్తూ భవిష్యత్తు తరాల ప్రజల అవసరాలను తీర్చడంలో రాజీలేని మార్గం ద్వారా అభివృద్ధి సాధించడమే, కొనసాగించడమే సుస్థిరాభివృద్ధి’ అని నిర్వచించారు.

ఈ నిర్వచనంలో సుస్థిరాభివృద్ధి మూడు ముఖ్యాంశాల ద్వారా కొనసాగుతుంది. 1. అవసరాలు 2. అభివృద్ధి 3. భవిష్యత్తు తరాలు. 1990లో డాలీ అనే శాస్త్రజ్ఞుడు సుస్థిరాభివృద్ధి కొనసాగింపునకు మూడు నియమాలను సూచించాడు.

ప్రాధాన్యం పెరిగింది
1992 రియో-డి-జెనిరో సదస్సు ద్వారా ఎజెండా-21 అంశాన్ని ప్రవేశపెట్టడంతో సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యం పెరిగింది. తర్వాత 2000 సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధిని అంతర్జాతీయంగా విస్తరింపజేయడానికి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల తీర్మానం చేసి అమలుపరిచింది. ఈ మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌లో మొత్తం 8 లక్ష్యాలున్నాయి.

2002లో దక్షిణాఫ్రికా జోహెన్స్‌బర్గ్‌లో మొదటిసారి సుస్థిరాభివృద్ధి సదస్సును నిర్వహించారు. ఆర్థిక కార్యకలాపాలు, ప(ర్యావరణ విషయాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సదస్సు పిలుపునిచ్చింది. అందుకోసం ఐక్యరాజ్యసమితి 2005-2015 కాలాన్ని ‘సుస్థిరాభివృద్ధి కోసం విద్యా దశాబ్దం’గా ప్రకటించింది.
2015 సెప్టెంబరు 25-27 తేదీల మధ్య ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధుల సభలో ఆకలి, దారిద్య్రాలను నిర్మూలించటానికి ప్రపంచదేశాలన్నింటినీ ఏకంచేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. ఇందులో 17 లక్ష్యాలు, 169 ఉపలక్ష్యాలున్నాయి.

భిన్న కోణాల్లో..
ఈమధ్య ఏపీపీఎస్‌సీ పోటీపరీక్షల్లో యూపీఎస్‌సీ తరహాలో నూతన దృక్పథంతో విశ్లేషణాత్మకంగా ప్రశ్నలను అడుగుతున్నారు. ప్రతి అంశాన్నీ అభ్యర్థి విబిన్న కోణాల్లో ఆలోచించి జవాబు గుర్తించాల్సివుంటుంది.
ఎ) మొదటి దృక్పథÅంలో సబ్జెక్టును ప్రశ్నగా ఇస్తారు. * ప్రస్తుతం దేశంలో మొత్తం జాతీయ పార్కులు ఎన్ని? (104).
బి) రెండో దృక్పథంలో సబ్జెక్టుకు చెందిన తాజా అంశాలు అడుగుతున్నారు. * ఇటీవల మొత్తం ఎన్ని జాతీయ పార్కులు యునెస్కో గుర్తింపు పొందాయి? (8 పార్కులు).
సి) మూడో దృక్పథంలో సబ్జెక్టుకు చెందిన వర్తమాన అంశాలను అడుగుతున్నారు. * దేశంలో ఏ జాతీయ పార్కు మస్కట్‌ను ఏర్పాటు చేసుకున్నది? (మధ్యప్రదేశ్‌లోని కన్హా నేషనల్‌ పార్కు).
సిలబస్‌లోని ప్రతి సబ్జెక్టునూ ఇలా చదవగలిగితే విజయం వైపు ప్రయాణించవచ్చు.

ఉపయోగపడే పుస్తకాలు

‘సుస్థిరాభివృద్ది-పర్యావరణ పరిరక్షణ’పై సంపూర్ణ సమాచారం కోసం మార్కెట్లో ఉన్న పుస్తకాలన్నీ చదవాల్సిన అవసరం లేదు. ప్రామాణిక పుస్తకాలను సంప్రదిస్తే సరైన అవగాహన పెరిగి, గరిష్ఠంగా మార్కులు సాధించగలుగుతారు.
1. తెలుగు అకాడమీ: బీ ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరపు అర్థశాస్త్రం బీ పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా రాసిన ‘పర్యావరణం- ఆర్థికాభివృద్ధి’ బీ డిగ్రీ రెండో సంవత్సరం వారికి నిర్దేశించిన ‘ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌’
2. సీబీఎస్‌ఈ:  8వ తరగతి నుంచి 12 తరగతుల సోషల్‌ స్టడీస్‌
3. ద హిందూ: ‘సర్వే ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌’
4. ఇండియా ఎన్విరాన్‌మెంటల్‌ సొసైటీ, న్యూదిల్లీ: ‘బయో డైవర్సిటీ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌’

- కె. గోవర్థన్‌ రెడ్డి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.