close

తాజా వార్తలు

ఎన్నికల ప్రణాళికపై ఫిబ్రవరిలో చర్చిస్తాం: పవన్‌

విశాఖ: ఎన్నికల ప్రణాళికపై ఫిబ్రవరిలో చర్చిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విశాఖపట్నంలోని రిషికొండలో జనసేన, వామపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలతో పాటు ఎన్నికల పొత్తులు, ఎన్నికల ప్రణాళిక అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్‌ మాట్లాడుతూ.. ఈవీఎంలు లోపభూయిష్ఠంగా ఉన్నాయన్నారు. ప్రజాసమస్యలపై వామపక్షాలు, జనసేన గత రెండేళ్లుగా కలిసి పనిచేస్తున్నాయని, భావజాలమే తమను కలిపిందన్నారు. ఈ రోజు వామపక్షాల నేతలతో జరిగిన సమావేశంలో ఆరేడు అంశాలపై కీలకంగా చర్చించినట్టు చెప్పారు. పర్యావరణ కాలుష్యం, భూసేకరణ విధానం, మైనింగ్‌ పాలసీ, గతంలో జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీ నివేదిక అంశాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించినట్టు చెప్పారు.

ఆ బాధ్యత ఈసీదే: సురవరం
దేశంలో ఈవీఎంలపై వస్తోన్న ఆరోపణల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిదేనని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. ప్రధాన సమస్యలపై రాబోయే కాలంలో ఎలా వెళ్లాలనే అంశంపై ఈ రోజు సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. ప్రజల్ని చైతన్యమంతం చేసి నిర్వహించాల్సిన పోరాటాలపై అవగాహనకు వచ్చే ప్రయత్నం చేశామన్నారు. పర్యావరణ కాలుష్యంతో జరుగుతున్న పరిణామాలపై తమ మూడు పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు. కాలుష్యం బారినపడి దేశంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హేతుబద్ధతలేని మైనింగ్‌ తవ్వకాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. తాము మైనింగ్‌కు వ్యతిరేకం కాదన్నారు. అయితే, చట్టబద్ధమైన పద్ధతుల్లో మైనింగ్‌ జరగాల్సి ఉందన్నారు. ప్రజలకు తగిన పరిహారం ఇవ్వాలని, అక్రమ మైనింగ్‌ చేపట్టరాదన్నారు. 2013భూ సేకరణ చట్టాన్ని తూ.చ. తప్పకుండా అమలుచేయాలని, బలవంతపు భూసేకరణ తగదన్నారు.

జనసేన, వామపక్షాల కలయికతో రాష్ట్రానికి కొత్త డైరెక్షన్: రాఘవులు‌
పవన్‌ కల్యాణ్‌ చొరవతో ఈ రోజు మూడు పార్టీలు సమావేశమయ్యాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ప్రజల్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలపై తాము ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెప్పారు. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో మూడు పార్టీల పాత్రపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం పచ్చిగా మోసం చేసిందని మండిపడ్డారు. మిగతా వాగ్ధానాల అమలులోనూ కేంద్రం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికే తమ మూడు పార్టీలు కలిసొచ్చే శక్తులతో పోరాడుతున్నాయని చెప్పారు. దీనిపై రాబోయే కాలంలో రాజకీయ పోరాటానికి సన్నద్ధం కావాల్సి ఉందన్నారు.  ఒకరు ఓడిపోతే ఇంకొకరు అని కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో నిజమైన ప్రత్యామ్నాయంగా జనసేన ముందుకొచ్చిందన్నారు. జనసేన, కమ్యూనిస్టులు కలిస్తే రాష్ట్రాన్ని ఓ కొత్త డైరక్షన్‌లో తీసుకెళ్లే అవకాశం ఉంటుందని రాఘవులు అన్నారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు పి. మధు, వై.వెంకటేశ్వరరావు, సీహెచ్‌. నర్సింగరావు, సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నేతలు మనోహర్‌, బాలరాజు, మాదాసు తదితరులు పాల్గొన్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.