close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. జీశాట్‌-31 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా మరో ఘనతను సాధించింది. ఏరియానా స్పేస్‌ రాకెట్‌ ద్వారా ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి భారత కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌ 31 విజయవంతంగా నింగిలోకి పంపింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 2.31 గంటలకు జీశాట్‌ -31 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకుపోయిన ఏరియానా రాకెట్‌ 42 నిమిషాల్లోనే కక్ష్యలోకి చేర్చింది. జీశాట్‌ -31తో పాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్‌ శాట్‌ -4 ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. 

2. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలైన సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. నేలకొండపల్లి శివారులోని ప్రభుత్వ రెండుపడకల ఇళ్ల కాలనీకి చెందిన పాలపాటి వెంకటేశ్వర్లు (40), అతని ఇద్దరు కుమారులు కొదండరాం (8), ప్రణయ్‌ (6), తల్లి పిచ్చమ్మ (60) ముదిగొండలో శుభకార్యానికి ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. 

3. కివీస్‌తో నేటి నుంచే మూడు టీ20ల సిరీస్‌ 
న్యూజిలాండ్‌తో ఇప్పటికే వన్డే సిరీస్‌లో ఘనవిజయం సాధించిన టీమ్‌ఇండియా.. ఇక టీ20లపై కన్నేసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు వెల్లింగ్టన్‌లో తొలి టీ 20 మొదలవుతుంది. ప్రపంచకప్‌ ముంగిట భారత్‌ ఆడబోయే చివరి విదేశీ సిరీస్‌ ఇదే. దీన్ని కూడా గెలిచేసి సగర్వంగా స్వదేశానికి చేరాలని భావిస్తోంది భారత్‌. రోహిత్‌.. పూర్తి స్థాయిలో జట్టును నడిపించనున్నాడు. కొంత విరామం తర్వాత ధోని మళ్లీ టీ20ల్లో ఆడబోతుండగా.. అతడి వారసుడిగా పరిగణిస్తున్న రిషబ్‌ పంత్‌ సైతం ఈ సిరీస్‌లో బరిలోకి దిగుతుండటం విశేషం. 

4. మనం ఎందుకు ఓడిపోయాం?

‘‘మీకు కావాల్సినంత సమయం ఉంది.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉంది.. బలమైన శ్రేణులున్నాయి.. మీ కోరిక మేరకు పొత్తులు పెట్టుకున్నాం.. అయినా ఎందుకు ఓడిపోయాం.. నాలుగున్నరేళ్లుగా ఏం చేశారు’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను సూటిగా ప్రశ్నించారు. శాసనసభ ఎన్నికల అనంతరం తొలిసారిగా దిల్లీలో ఆయన రాష్ట్రానికి చెందిన పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశమయ్యారు.

5. పోలవరం డీపీఆర్‌-2పై ముందడుగు 

పోలవరం పథకం డీపీఆర్‌-2ను ఆమోదించే ప్రక్రియలో ముందడుగు పడింది. రూ.57,940 కోట్ల అంచనాతో సమర్పించిన ప్రాజెక్టు నివేదికకు ‘సాంకేతిక సలహా కమిటీ’ (టీఏసీ) ఆమోదమే కీలకం. ఈ డీపీఆర్‌పై చర్చించేందుకు ఈ నెల 8న టీఏసీ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చారు. కేంద్ర జల సంఘం నుంచి ఇంకా నోట్‌ రావాల్సి ఉందని, ఒకటి రెండు రోజుల్లో అది అందుకుంటామని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. 

6. భాషా పండితులకు ‘పదోన్నతి’ గౌరవం

తెలంగాణలోని భాషా పండితుల దశాబ్ద కాల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్‌-2 హోదాలో పనిచేస్తున్న భాషా పండితులు ఇక స్కూల్‌ అసిస్టెంట్లు కానున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీ) ఫిజికల్‌ డైరెక్టర్‌(పీడీ)గా పదోన్నతులు పొందనున్నారు. వీరికి పదోన్నతి కల్పించేందుకు ఉద్దేశించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సంతకం చేశారు. దీని వల్ల 8,800 మంది భాషా పండితులు, 2 వేల మంది వ్యాయామ ఉపాధ్యాయుల (మొత్తం 10,800 మంది) హోదా పెరగనుంది. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి.

7. ఒకటడిగితే రెండిచ్చాం: గడ్కరీ

కేంద్రం నుంచి గత 50 సంవత్సరాల కాలంలో అందనంత సహాయాన్ని తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అందించిందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ‘ఒకటి’ అడిగితే ‘రెండు’ ఇచ్చామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజలు భాజపాకు రాజకీయంగా మద్దతు ప్రకటించకపోయినా, ఇరురాష్ట్రాల అభివృద్ధి విషయంలో కేంద్రం రాజీపడలేదన్నారు. అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు అయా వర్గాల్లోని వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకొని కల్పించినవే తప్ప.. కులప్రాతిపదికన ఇచ్చినవి కాదని స్పష్టం చేశారు. 

8. నేడు తిరుపతిలో వైకాపా సమర శంఖారావం సభ 

వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు. సమరశంఖారావం పేరుతో అన్ని జిల్లాల్లోనూ సభలు నిర్వహించనున్నారు. పార్టీకి చెందిన ప్రతినిధులతోనే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నా... ఎన్నికల ప్రచారంగానే ఇవి కొనసాగనున్నాయని వైకాపా వర్గాలు తెలిపాయి. బుధవారం తిరుపతిలో నిర్వహించనున్న చిత్తూరు జిల్లా సమావేశానికి సుమారు 40 వేల మంది హాజరవనున్నారని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

9.  టీ20లకు మిథాలీ గుడ్‌బై!

టీమ్‌ ఇండియా వన్డే సారథి, సీనియర్‌ క్రీడాకారిణి మిథాలీ రాజ్‌ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనుంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో సిరీస్‌ అనంతరం పొట్టి క్రికెట్‌ నుంచి మిథాలీ తప్పుకోనుంది. టీ20 క్రికెట్‌కు దూరమైనా.. 36 ఏళ్ల మిథాలీ వన్డేల్లో కొనసాగుతుంది. మరోవైపు బుధవారం వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభంకానుండగా.. తుదిజట్టులో మిథాలీ ఉంటుందా అన్నదానిపై స్పష్టత లేదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు మిథాలీని ఎంపిక చేసినా.. 3 మ్యాచ్‌ల్లో తను ఆడేదీ అనుమానమే!

10. రామోజీ ఫిలింసిటీలో అగ్రతారల డిష్యుం డిష్యుం

ప్రపంచ ప్రసిద్ధ రామోజీ ఫిలింసిటీ అగ్రతారల పోరాటాలకు వేదికైంది. రామ్‌చరణ్‌ ఓ పక్క విలన్లను రప్ఫాడిస్తున్నాడు. మరోపక్క ‘సాహో’ ప్రభాస్‌ రౌడీలతో వీరోచితంగా పోరాడుతున్నారు. వీళ్ల ఫైటింగుల మధ్యలో నందమూరి బాలకృష్ణ ‘మహానాయకుడు’ ర్యాలీ చేస్తున్నాడు. ఈ ఆసక్తికర సినిమాలకు సంబంధించిన సంగతులేంటో ఒక్కసారి చదివేద్దాం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.