కొత్త కోణం.. గెలుపు బాణం
close

తాజా వార్తలు

Updated : 18/02/2019 03:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త కోణం.. గెలుపు బాణం

ఏపీపీఎస్‌సీ నుంచి ఏడు నోటిఫికేషన్లు, 590 పోస్టులు

వచ్చే మూడు నెలల్లో నియామక పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతున్న ఏపీపీఎస్‌సీ ఉద్యోగార్థులకు శుభవార్త! దాదాపు అదే సన్నద్ధతతో పోటీపడగలిగే ఏడు రకాల ప్రత్యేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. అన్నీ కలిపి 590 ఖాళీలు!  ఈ ప్రత్యేక పోస్టుల పరీక్షా సిలబస్‌లో నేరుగా ఉద్యోగ విధులతో సంబంధమున్న పేపర్లు ఉండటం విశేషం. ఈ కొత్త కోణానికి ప్రాధాన్యమిస్తూ  సన్నద్ధత సాగాలి!

గ్రూప్‌-2, పంచాయతీ సెక్రటరీ లేదా గ్రూప్‌-1, గ్రూప్‌-2 లేదా గ్రూప్‌-2 ఇతర కేటగిరీ పోస్టులకు తయారవుతున్న లక్షలమంది అభ్యర్థుల్లో ప్రస్తుతం ప్రకటించిన ఏడు కేటగిరీ పోస్టులకు తగిన విద్యార్హతగల వారు నిశ్చయంగా ఉంటారు. ఉదాహరణకు గ్రూప్‌-2కు శ్రద్ధగా సిద్ధమవుతున్న అభ్యర్థి విద్యార్హతలు ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుకు సరిపోవచ్చు. అలాంటప్పుడు ఇప్పటికే గ్రూప్‌-2 సన్నద్ధతలో ఉన్నందున ఇప్పుడీ ప్రత్యేక పోస్టులకు దరఖాస్తు చేస్తే ఏకాగ్రత చెదురుతుందన్న సంశయం ఉండనవసరం లేదు.

అసలు సంబంధిత పోస్టుకు దరఖాస్తు చేయాలన్న నిర్ణయం తీసుకుంటే - సగం సన్నద్ధత చేసినట్టే. ఎలాగంటే దాదాపు అన్ని రకాల ఎంపిక పరీక్షల్లో ఉన్న ఉమ్మడి పేపర్‌- జనరల్‌ స్టడీస్‌- మెంటల్‌ ఎబిలిటీ. ఇప్పటికే వేర్వేరు పరీక్షల సన్నద్ధతలో ఉన్న అభ్యర్థులు ఈ పేపర్‌ను పూర్తిచేసి ఉంటారు. కాబట్టి ప్రత్యేక పోస్టుల సన్నద్ధతలో సగభాగం పూర్తయినట్టే. మిగిలిన సగ భాగం ప్రత్యేక పోస్టులకు సంబంధించిన ప్రత్యేక పేపర్‌.

చర్చిస్తేనే పూర్తి అవగాహన

ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు పోటీ ప్రస్తుతం అత్యున్నత స్థాయికి చేరుకుంది. భర్తీ అయ్యే పోస్టులు స్వల్పంగా, దరఖాస్తు చేసే అభ్యర్థులు భారీగా ఉండటం ఫలితంగా నెలకొన్న తీవ్రమైన పోటీని తట్టుకొని విజయం సాధించాలంటే ప్రిపరేషన్‌ స్మార్ట్‌గా చేయాలి. సిలబస్‌పై పట్టు సాధించడానికి అన్నింటికన్నా చక్కటి మార్గం- స్నేహితులతో చర్చించడం!

జనరల్‌ స్టడీస్‌ అయినా లేదా ప్రత్యేకమైన సబ్జెక్టు అయినా ముందుగా ఒక అంశాన్ని ప్రాథమికంగా చదివి ఆ అంశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వార్తాపత్రికలు లేదా పుస్తకాల నుంచి చదివిన అంశానికి సంబంధించి ముఖ్యమైన పాయింట్లను నోట్‌బుక్‌లో రాసుకోవాలి. ఆ తర్వాత అదే అంశానికి సంబంధించి ఎలక్ట్రానిక్‌ మీడియాలో అవకాశముంటే వినడం/ చూడటం ద్వారా మరింత అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఒక అంశంపై పట్టుకు ఇవన్నీ దోహదపడినా, సంపూర్ణ అవగాహనకు మాత్రం చర్చలే చక్కటి మార్గం. పరీక్షకు శ్రద్ధగా తయారయ్యే ఇద్దరు, ముగ్గురు స్నేహతులతో కలిసి బృందంగా ఏర్పడి ప్రతిరోజు కొన్ని అంశాలను కూలంకషంగా చర్చించటం మేలు. ఇలా చేస్తే ఇతర మార్గాలకంటే ఎక్కువగా పరిజ్ఞానం పెరగడమే కాకుండా, తెలుసుకున్న విషయాలు మర్చిపోకుండా ఎక్కువ కాలం గుర్తుంటాయి.

భిన్న కోణాల్లో...

ఇప్పుడు విడుదలైన 7 నోటిఫికేషన్లలోని కామన్‌ పేపర్‌- జనరల్‌ స్టడీస్‌ తీసుకుంటే అందులోని అనేక అంశాలను చర్చించడం ద్వారా బాగా గుర్తు పెట్టుకోవచ్చు. ఉదాహరణకు ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో ముఖ్యంగా అసోంలో పౌరసత్వ అంశానికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఇటీవల పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పౌరసత్వ (సవరణ) బిల్లు 2019కి లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీనికి నిరసనగా  ఈశాన్య రాష్ట్రాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి అసలు అసోం నేషనల్‌ రిజిష్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ అంటే ఏమిటి? దానివల్ల అసోం ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇటీవల లోక్‌సభ ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారు? ఈ బిల్లు ఎవరికి వర్తిస్తుంది? దీనికీ అసోంకూ సంబంధమేమిటి? ఇవన్నీ గ్రహించాలి. రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన అధికరణలు, ఇత్యాది విషయాలు అన్నీ ఒకేచోట దొరకవు. ఇటువంటి అంశాలను స్నేహితులతో చర్చిస్తే ఒక్కొక్కరు ఒక్కో కోణంలో సమాచారం ఇవ్వడం వల్ల సందేహాలు తీరి అవగాహన ఏర్పడుతుంది. పరీక్షలో ప్రశ్న ఎలా అడిగినా సమాధానం గుర్తించే సామర్థ్యం ఏర్పడుతుంది.

మూస పంథా వదలాలి

సాధారణంగా ఉద్యోగార్థులు ఏ పరీక్షకయినా ఒకే పంథాలో చదువుతారు. అయితే ఇటీవలి సర్వీస్‌ కమిషన్‌ గమనాన్ని పరిశీలించినట్లయితే, సిలబస్‌లన్నీ ఉద్యోగ బాధ్యతలకు సన్నిహితంగా రూపాంతరం చెందుతున్నాయి. అందునా ఈ ప్రత్యేక పోస్టుల పరీక్షా సిలబస్‌లలో ఏకంగా ఒక పేపర్‌నే ప్రవేశపెట్టడాన్ని గమనించవచ్చు. ఈ ధోరణిని అర్థం చేసుకొని సిలబస్‌ను ప్రత్యేక కోణంలో చూడాలి. అందుకు తగ్గ పంథానే సన్నద్ధతకు నిర్దేశించుకోవాలి.
ఉదాహరణకు మూడు కేటగిరీల అటవీ పోస్టులకు ఒక పేపర్‌ కింద జనరల్‌ స్టడీస్‌తోపాటు, రెండో పేపర్‌ కింద జనరల్‌ సైన్స్‌ పేపర్‌ ఇచ్చారు. అయితే జనరల్‌ సైన్స్‌ అని ఇచ్చినప్పటికీ సిలబస్‌ అంతా జీవశాస్త్రాలు- పర్యావరణ పరిరక్షణ అంశాలే సింహభాగం ఉండటాన్ని గమనించవచ్చు. అంటే ఈ అంశాల్లో సమగ్ర పరిజ్ఞానమున్నవారినే  ఎంపిక చేస్తారని అవగతమవుతోంది. ఈ దృష్టితోనే జనరల్‌ స్టడీస్‌లోని శ్రీ జనరల్‌ సైన్స్‌ శ్రీ కరెంట్‌ ఈవెంట్స్‌ శ్రీ వరల్డ్‌, ఇండియా, ఆంధ్రప్రదేశ్‌ జాగ్రఫీ శ్రీ సుస్థిర అభివృద్ధి - పర్యావరణ పరిరక్షణ శ్రీ విపత్తు నిర్వహణ విభాగాలను చదవాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అటవీ పరిరక్షణ, పర్యవేక్షణలో ఇమిడి ఉన్న సబ్జెక్టులపై మంచి అవగాహన ఏర్పర్చుకోవాలి. వీటి తాజా విషయాలను ఒడిసి పట్టుకోవాలి. జనరల్‌ స్టడీస్‌ను ఈ విధమైన కొత్త కోణంలో చదవాలి. ఎంపిక ఆశిస్తున్న పోస్టు స్ఫూర్తితో అధ్యయనం కొనసాగాలి. దీనివల్ల ప్రిపరేషన్‌-  లక్ష్యం దిశగా ముందుకు వెళుతుంది!

- యస్‌.వి. సురేష్‌, ఎడిటర్‌, ఉద్యోగ సోపానం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని