close

తాజా వార్తలు

విదేశాలకెళ్లినా మన వంటకాలవైపే చూపు!

ముంబయి: సెలవుల్ని ఎంజాయ్‌ చేసేందుకు ఎవరైనా విదేశాలకు వెళ్తే అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు, ఆయా దేశాల్లో రకరకాల వంటకాలను రుచి చూసి వస్తారని మనం అనుకుంటుంటాం. మనకు కూడా అలాంటి అవకాశం రావాలని ఆశపడుతుంటాం కూడా. విదేశీ పర్యటన ముగించుకొని తిరిగొచ్చిన మన మిత్రుల్నో, బంధువుల్నో అక్కడి విశేషాల్ని అడిగి తెలుసుకుంటుంటాం. అలాగే, అక్కడ వారు ఎలాంటి విభిన్న వంటకాలను రుచిచూశారో అడిగేందుకు ఆసక్తి కనబరుస్తుంటాం.. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఇతర దేశాలకు విహార యాత్రలకు వెళ్లే భారతీయుల్లో దాదాపు 60 శాతం మంది ఇండియన్‌ ఫుడ్‌ తినడానికే మొగ్గు చూపుతున్నారట! భారతీయ వంటకాలు అందుబాటులో లేకపోవడం వల్ల సుమారు 83 శాతం మంది యాత్రికులు భోజనం చేయడానికి కూడా విముఖత చూపుతున్నారట!  అవునండీ.. వినడానికిది ఆశ్చర్యంగా ఉన్నా.. ఎక్కువ మంది భారతీయులు మన వంటకాలను ఆరగించడానికే ఇష్టపడుతున్నారని ప్రముఖ రవాణా సంస్థ ‘మేక్‌ మై ట్రిప్‌ అవుట్‌ బాండ్‌ ట్రావెల్‌ సర్వే 2019’లో వెల్లడైంది. ఇంకా విదేశీ యాత్రలకు వెళ్లే భారత యాత్రికుల గురించి మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఈ సర్వేలో వెల్లడయ్యాయి. అవేంటో చూద్దాం..!
భారతీయ యాత్రికుల్లో 30 శాతం మంది మాత్రం అన్ని రకాల విదేశీ వంటకాలను రుచి చూస్తున్నారని ఈ సర్వేలో తేలింది. దీంతో పాటు సగటున ఒక భారతీయ పర్యాటకుడు తన విదేశీ యాత్రలో సుమారు రూ.25,000 వరకు షాపింగ్‌ కోసం ఖర్చు చేస్తున్నారని, అందులో 17 శాతం మంది దీని కోసం రూ.50,000 వరకు ఖర్చు చేస్తుండగా, 27 శాతం మంది రూ.10,000 వరకు మాత్రమే వెచ్చిస్తున్నట్లు మేక్‌ మై ట్రిప్ సర్వే వెల్లడించింది. సుమారు 49 శాతం మంది భారతీయ యాత్రికులు తమ పర్యటనలో చాక్లెట్‌లు ఎక్కువుగా కొంటున్నారట!  17శాతం మంది ప్రయాణికులు మాత్రం తమ విదేశీ యాత్రలో ఫ్యాషన్‌ దుస్తులు, ఉపకరణాలు (యాక్సెరీస్‌) కొనేందుకే ఆసక్తి కనబరుస్తున్నారని తేలింది. ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన 1200 మంది ప్రయాణికులతో మేక్‌ మై ట్రిప్‌ ఆన్‌లైన్‌ సంస్థ సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. 
ఇదిలా ఉండగా.. మరో ఆసక్తికరమైన విషయం ఈ సర్వేలో వెల్లడైంది. చిన్నపిల్లలతో పాటు విదేశాలకు హాలీడే ట్రిప్‌లకు వెళ్లేందుకు తల్లిదండ్రులు సుముఖత వ్యక్తంచేయడంలేదట. ఐదేళ్ల లోపు వయసు పిల్లలు ఉన్న 32 శాతం మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలను స్వదేశంలోనే తమ బంధువుల వద్దే ఉంచి విదేశాలకు వెళ్తున్నట్టు వెల్లడైంది. సుమారు 71 శాతం మంది భారతీయ యాత్రికులు విదేశాల్లోని బీచ్‌లను చూసేందుకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారని సర్వేలో తేలింది. ఇంకా సుమారు 69 శాతం మంది పర్యాటకులు విహార యాత్రకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారని వెల్లడైంది. ‘ఆదాయంలో పెరుగుదలతో పాటు, సులభంగా ఆన్‌లైన్‌లో ప్రయాణ ఏర్పాట్లు చేసుకునేందుకు వెసులుబాటు ఉండటంతో విదేశీ యాత్రలకు వెళ్లే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది.’ అని మేక్‌ మై ట్రిప్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి విపుల్ ప్రకాశ్‌ తెలిపారు. 
తమ విదేశీ పర్యటనలో దాదాపు 1/3వ వంతు పర్యాటకులు 4 స్టార్‌-5 స్టార్ హోటల్‌లో ఉండడానికి ఇష్టపడుతున్నారని, 44 శాతం మంది యాత్రికులు మధ్యస్థాయి హోటళ్లలో ఉండడానికే మొగ్గు చూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. ఇంకా 70 శాతం మంది విదేశీ యాత్రికులు వివిధ దేశాల్లో కుళాయి నీరు తాగడానికి బాగా ఇబ్బంది పడుతున్నారని తేలింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... 52 శాతం మంది భారతీయ పర్యాటకులు తమ విదేశీ పర్యటనలో టాయిలెట్‌లో నీరుకు బదులుగా టాయిలెట్‌ పేపర్‌ను ఉపయోగించడానికి తెగ చిరాకు పడుతున్నారట!


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.