close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 9 AM

1. నేడే జాబితా 

తెరాస లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. గురువారం మధ్యాహ్నం తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాబితాను విడుదల చేయనున్నారు. ఎంపీ అభ్యర్థులపై దాదాపుగా నెలరోజుల ఆయన కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఆయన మంత్రులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులతో భేటీ అయ్యారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కూడా పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, స్థానాలపై చర్చించారు. మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌ ఎంపీలు జితేందర్‌రెడ్డి, అజ్మీరా సీతారాంనాయక్‌లపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నామని వెల్లడించారు. 

2. షోకాజ్‌ నోటీసులు ఇస్తాం: ఉత్తమ్‌

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చి అనర్హత వేటుకు చర్యలు తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల ముఖ్యనేతల సమావేశం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రా? లేదంటే తెరాస ఎమ్మెల్యేలకు మాత్రమేనా అనేది స్పష్టం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నట్లు ఇటీవల ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ప్రకటించారని అంటే తెరాసలో ఉంటేనే అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు.

3. జనసేన ఐదో జాబితా విడుదల

లోక్‌సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఐదో జాబితాను జనసేన విడుదల చేసింది. నాలుగు లోక్‌సభ, 16 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. అలాగే తెలంగాణలోని మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసింది. 

4. డేటా చౌర్యం కేసులో ప్రతివాదిగా ఎన్నికల సంఘం

ఓటర్లకు సంబంధించిన కీలక సమాచారం చోరీకి గురైందో లేదో చెప్పడానికి ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా చేర్చేందుకు హైకోర్టు.. పిటిషనర్‌ అయిన ఐటీ గ్రిడ్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ డి.అశోక్‌కు అనుమతి మంజూరు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఓటర్ల సమాచారం చోరీకి గురైందని తెలంగాణ పోలీసులు చెబుతుండగా అసలు జరిగిందో లేదో ఎవరు చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సింది ఎన్నికల సంఘమేనని, దాన్ని ప్రతివాదిగా చేరుస్తామనడంతో హైకోర్టు అనుమతించింది. 

5. గీత దాటితే మీరే కేసు పెట్టండి

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఎన్నికల సంఘమే సుమోటోగా కేసులు నమోదు చేయాలని రాజకీయ పార్టీలు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ను కోరాయి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో రాజకీయ పార్టీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, శాంతిభద్రతలు మొదలైన అంశాలపై సీఈవో రజత్‌కుమార్‌ వివరించారు. అనంతరం కాంగ్రెస్‌, తెదేపా నాయకులు విలేకరులతో మాట్లాడారు.

6. బహిరంగ సభలు, ఎగ్జిబిషన్ల అనుమతులకు ఏక దరఖాస్తు విధానం

బహిరంగ సభలు, ఎగ్జిబిషన్లు, ఇతర వేడుకల నిర్వహణకు వివిధ శాఖలు అనుమతులిచ్చేందుకు ఏక దరఖాస్తు విధానం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అధికారులకు సూచించారు. ముసాయిదా రూపొందించాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో సచివాలయంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌, పోలీసు కమిషనర్లు అంజనీకుమార్‌, మహేశ్‌ భగవత్‌ పాల్గొన్నారు.

7. వైకాపాకు 120-130 సీట్లు వస్తాయి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర మొత్తం తన వద్ద ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. అవసరమైనప్పుడు దానిని బయటపెడతానని చెప్పారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఓటమి భయంతో చంద్రబాబు.. కేసీఆర్‌ మీద ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన చరిత్ర నా దగ్గర ఉంది. ఓటుకు నోటు కేసులో ఆయన పాత్రేమిటో అందరికీ తెలుసు. బాబు ప్రసంగాలతో ప్రజలు విసుగెత్తిపోయారు. ఏపీలో వైకాపా 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు గెలవబోతోంది. లోక్‌సభలో 22 నుంచి 23 స్థానాలు రావడం ఖాయం ’’ అని అన్నారు. 

8. బెదిరిస్తే భయపడను 

తనను భయపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే తాను బెదిరిపోయే ప్రసక్తే లేదనీ కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకాగాంధీ బుధవారం స్పష్టం చేశారు. తమను ఎవరైనా వేధించే పరిస్థితి తలెత్తినా సరే జంకే ప్రసక్తేలేదని, ఎంతగా తీవ్రంగా వేధిస్తే అంతగా రాటుదేలి, అదేస్థాయిలో ప్రతిఘటిస్తామని చెప్పారు. ప్రజలను తెలివితక్కువ వారిగా పరిగణించే వైఖరిని ప్రధాని నరేంద్రమోదీ మానుకోవాలని సూచించారు. ప్రజలు మోదీ అనుకున్నంత అజ్ఞానులు కాదని...వారికి అన్నీ అర్థమవుతాయని అన్నారు. 

9. ఆనందదాయక దేశాల్లో 140వ స్థానంలో భారత్‌!

ఆనందదాయక దేశాల జాబితాలో ఈ ఏడాది (2019) భారతదేశం 140వ స్థానంలో నిలిచింది. 2018లో భారత్‌ 133వ స్థానంలో నిలిచిన విషయం గమనార్హం. అంటే..ఈ సంవత్సరంలో ఏడుపాయింట్లు కిందకు దిగజారింది. ఈ ఏడాది కూడా ఫిన్లాండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం నాడిక్కడ విడుదలైన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. మార్చి 20వ తేదీని ఐరాస సర్వప్రతినిధి సభ ‘ప్రపంచ ఆనంద దినోత్సవం’గా ప్రకటించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఆదాయం, స్వేచ్ఛ, విశ్వాసం, ఆరోగ్యకర జీవన విధానం-ఆయుష్షు, సామాజిక మద్దతు, వితరణ తదితర అంశాలను ఆనందం మదింపునకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.

10. ఉగ్రవాదం అంటే ఏమిటి?

ఉగ్రవాదం అంటే ఏమిటో నిర్వచించాలని పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇందుకోసం ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అసిఫ్‌ సయీద్‌ ఖోసా నిర్ణయం తీసుకున్నారు. జైష్‌ ఎ మహ్మద్‌ వంటి ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాలని అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి వస్తుండడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఉగ్రవాదానికి సరయిన నిర్వచనం లేకపోవడంతో ఏ కేసులు ఉగ్రవాదం పరిధిలోకి వస్తాయి, ఏవి రావన్నదానిపై స్పష్టత లేదు. దాంతో ప్రత్యర్థుల కార్యకలాపాలన్నింటినీ ఉగ్రవాద చర్యలని ముద్రవేసేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.