close

తాజా వార్తలు

మంగళగిరిని ఐటీ హబ్‌గా మారుస్తా : నారాలోకేష్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐదు కోట్ల మంది ప్రజలు సురక్షితంగా ఉంటున్న రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్‌ ఎందుకు అభద్రతా భావం ఎదుర్కొంటున్నారోనని గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేష్‌ నిలదీశారు. మంగళగిరిని రాష్ట్ర ఐటీ ముఖద్వారంగా మారుస్తానని హామీ ఇచ్చారు. 150పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.అభివృద్ధిని అడ్డుకునే నేతలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న నారా లోకేష్‌తో ఈటీవీ ముఖాముఖి నిర్వహించింది. 

 మీ తాతగారు  ఎన్టీఆర్‌ ఇక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. అదే ప్రాంగణంలో మీరు నామినేషన్‌ దాఖలు చేయడం జరిగింది. మీ స్పందన ఏమిటీ?

ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. గడిచిన ఆరు ఎన్నికల్లో కూడా మా కుటుంబం కుప్పం నుంచి గెలిచింది.  మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చిన మొదటి అవకాశం. గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రజలు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే సందేహం లేకుండా భారీ మెజారిటీతో నేను గెలుస్తా.

 1985 తర్వాత ఇక్కడ  తెదేపా  ప్రాతినిధ్యం లేదు.  పొత్తుల్లో భాగంగా వేరే వాళ్లకు ఇస్తూ వచ్చారు. 2014లో మాత్రమే పోటీ చేసినా ఓడిపోవడం జరిగింది. అలాంటి స్థానాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి?

కేవలం 12 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయాం. ఆలోచన ఒకటే. ఎవరైనా అమరావతికి వెళ్లాలంటే మంగళగిరి నుంచే వెళ్లాలి. మంగళగిరిని అద్భుతంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది.  ఒక్క పక్కన ఐటీ పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకువచ్చేందుకు, మరో పక్క చేనేత పరిశ్రమలను మెరుగుపరించేందుకు అవకాశం ఉంది. రైతులు పండించే అరకు కాఫీని మంచి బ్రాండ్‌గా చేసి దేశంలోనే కాదు ప్రపంచంలోకి తీసుకెళ్లవచ్చు. మంగళగిరి చేనేత వస్త్రాలు, దుగ్గిరాల పసుపును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.

మంగళగిరి చేనేత కార్మికులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు. వారిని పైకి తీసుకొచ్చేందుకు మీరు ఎలాంటి హామీలు ఇస్తారు?

ఆనాడు చేనేత సోదరులకు పింఛన్లు ప్రారంభించింది అన్న ఎన్టీఆర్‌ గారు. ఇప్పుడు పింఛన్లు దాదాపు రూ.2 వేలకు పెంచింది చంద్రబాబునాయుడు. మీతో ఎప్పుడు తెదేపా ఉంటుంది. చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకున్నాం.  దానికి అనుగుణంగా మంగళగిరి మేనిఫెస్టోను రూపొందిస్తున్నాం.  ప్రధానంగా చేనేత సోదరులను ఏవిధంగా ఆదుకోవాలి. చేనేతకు బ్రాండ్‌ను ఎలా క్రియేట్‌ చేయాలి. ఉత్పత్తులకు ధరలు ఎలా రావాలి అనే దానిపై విడుదల చేస్తున్నాం.

పల్లెల్లో తిరుగుతున్నారు. ప్రజల్లో స్పందన ఏవిధంగా ఉంది. వాళ్లు మీ నుంచి ఎలాంటి హామీలను ఆశిస్తున్నారు?

 పల్లెలన్నీ బాగా అభివృద్ధి చేశాం. రోడ్లు, డ్రైనేజీలు, చాలా వరకు అయ్యింది. ప్రధానంగా తాగునీటికి శాశ్వత పరిష్కారం కోసం జలధార కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకెళ్తున్నాం. పక్కా ఇళ్లు, పట్టాలు కావాలని కోరుతున్నారు.  తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా లక్షల మందికి పట్టాలు ఇచ్చింది. కానీ ఇక్కడ ఎమ్మెల్యే వైకాపాకు చెందిన వ్యక్తి ఇబ్బంది పెట్టడం జరిగింది. పట్టాలు ఇవ్వాలంటే కేసులు పెట్టేవాళ్లు. అందువల్ల మేము ఇవ్వలేక పోయాం. తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తుంది.   శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను. మీ సమస్యలు నేను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను.

మంగళగిరిని మినీ ఐటీ హబ్‌గా తీర్చి దిద్దడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు?

మంగళగిరి మినీ ఐటీ హబ్‌గా  కాదు.  ఒక పెద్ద ఐటీ హబ్‌గా చేయాలి. ఆంధ్రా చాలా పొడవైన రాష్ట్రం. విశాఖ, తిరుపతి, అమరావతి, అనంతపురం. వీటిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే అవకాశం ఉంది. విశాఖకు ఇప్పటికే పరిశ్రమలను తీసుకువచ్చాం. అమరావతికి హెచ్‌సీఎల్‌ను తీసుకువచ్చాం. ఒకవేళ చంద్రబాబు నన్ను ఐటీ మంత్రిని చేస్తే నేను ఈ నాలుగు జోన్లను అభివృద్ది చేస్తాను. ఎన్నికల కోడ్‌ వచ్చేముందు అనేక కంపెనీలతో మాట్లాడాను. ఖాళీగా ఉన్న ఆర్కే టవర్‌, బిల్డింగ్‌లను చూపించాం.  వారందరూ సానుకూలంగా స్పందించారు.  ఐటీ రంగంలో ఎలాంటి ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారు.

 అభివృద్ధిని గురించి మీరు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో.. ప్రతిపక్షం కూడా అంతే స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై మీరేమంటారు?

ప్రతిపక్షానికి వేరే పనే లేదు. సంక్షేమం, అభివృద్ధితో పోటీ పడేది లేదు. జగన్‌ ఆయన ఏమి చేస్తారో చెప్పుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడ్ని విమర్శిస్తున్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ రూ.2 వేల పింఛను, రూ.2 వేలు నిరుద్యోగభృతి లేదు.  ఏ రాష్ట్రంలో పసుపుకుంకుమ ఇవ్వట్లేదు. ఒక్క ఆంధ్రరాష్ట్రంలోనే జరుగుతోంది. ఇక్కడ 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్నాం. తెలంగాణలోని హైదరాబాద్‌లో చూస్తే 4 గంటల విద్యుత్‌ కోత ఉంది.  ప్రతిపక్షం చేయడానికి పాత్ర లేదు. ప్రతిపక్షం ఎప్పుడూ అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షంగా మేమే పనిచేశాం. మా శాసన సభ్యులే ప్రజల సమస్యలపై మమల్ని నిలదీశారు. 175కి కచ్చితంగా 150పైగా సీట్లు తెదేపా గెలవబోతున్నాం.

ప్రధాన ప్రతిపక్షం వైకాపాను వదిలేసి కేసీఆర్‌కు మాకు మధ్యే పోటీ అని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు?  

కేటీఆర్‌, జగన్‌ పక్కపక్కన కూర్చుని కాఫీలు తాగుతున్నారు. కలిసికట్టుగా ముందుకెళ్తున్నారు.  ఆంధ్రులను కేసీఆర్‌ అనేక సార్లు తిట్టారు. రాక్షసులు, ద్రోహులన్నారు. తిండిమీద కూడా ఎగతాళిగా మాట్లాడారు. అసలు అలాంటి వ్యక్తిని ఇంటికి తీసుకువస్తారా. క్షమాపణలు చెప్పిన తర్వాత తీసుకురావచ్చు. పొత్తుల కోసం ఇద్దరు కూర్చుని కాఫీలు, టీలు తాగుతుంటే ఆంధ్రులకు బాధ కలగదా. ఆంధ్రులను ఎందుకు తిట్టారో ముందు చెప్పి రండి. మా మనోభావాలను దెబ్బతినే విధంగా చేస్తే ఎంతవరకు న్యాయం వాళ్లు కూడా ఆలోచించాలి.

కేసీఆర్‌, కేటీఆర్‌ రిటర్న్‌ గిఫ్టులు ఇస్తామని చెప్పి సవాలు చేయడం జరిగింది. దానిని ఎలా స్వీకరిస్తారు?

మూడు గిఫ్టులు ఇప్పటికే వచ్చాయి. మొదటి గిఫ్టు దాదాపు రూ.1000 కోట్లు వైకాపా ప్రచారానికి పంపించడం జరిగింది. తెరాస ప్రచార రథాలు రంగులు మార్చి పంపించారు. కానీ కేసీఆర్‌ ఒక విషయం మర్చిపోయారు. సీటు కవర్లు మార్చలేదు.  అంబాసిడర్‌ కారు ముద్ర కూడా ఉంది. ఇదే రెండో రిటర్న్‌ గిఫ్టు అని అర్థమైంది. మూడోది తెదేపా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో.. వాళ్లందరికి ఫోన్లు చేసి  ఇబ్బంది పెట్టారు. స్వయంగా కేటీఆరే మాట్లాడారు. మీరు అభ్యర్థిగా నిలబడొద్దు. మీరు జగన్‌పార్టీలోకి వెళ్లండి. జగన్‌ ప్రచారంలోకనపడ్డారా.. హైదరాబాద్‌లో ఉన్నారు.

జగన్‌ ఆంధ్రా పోలీసులు, ఇక్కడి ప్రభుత్వం మీద నమ్మకం లేదని గట్టిగా చెబుతున్నారు?

జగన్‌ ఎందుకు ఆంధ్ర పోలీసుల సెక్యూరిటీ వాడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనాలు వాడుతున్నారు. మీకు ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేకపోతే వాటన్నింటిని రిటర్న్‌ చేయండి. ఇక్కడ ఐదు కోట్ల ఆంధ్రులు ఉంటున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు.  హత్యా రాజకీయాలు మేము చేయడంలేదు. జగన్‌ హైదరాబాద్‌లోనే ఉండండి.

రాజధాని ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని మీరు చెబుతున్నారు. కానీ ఇదే సమయంలో భారీ అవినీతి జరిగిందని స్థానిక ఎమ్మెల్యే  కోర్టులో కేసులు వేశారు. దీనిపై మీరేమంటారు?

స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యల కన్నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసులు ఎక్కువగా వేస్తుంటారు. కేసులు వేసేందుకు రైతుల వద్ద రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేశారు. రైతులు నా వద్దకు వచ్చి వారి డబ్బులే తీసుకుని కేసులు వేశారని చెప్పారు. ఎమ్మెల్యే 275 కేసులు వేశారు. అంటే 365 రోజుల్లో 275 రోజులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన వ్యక్తి ఆయన. ఆయన ఏమీ అభివృద్ధి చేస్తారు. ప్రజలకు ఏమీ అందుబాటులో ఉంటారు అని ప్రశ్నించారు.

మంగళగిరిలో మీ గెలుపు అవకాశాలు ఏవిధంగా ఉన్నాయి. ఎంత మెజారిటీ ఆశిస్తున్నారు. అలాగే ప్రజలు ఏమి చూసి ఓటు వేస్తారని అనుకుంటున్నారు?

ప్రజలందరిని నేను కోరేది ఒక్కటే.. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న లక్ష్యంతో నేను మంగళగిరిలో పోటీ చేస్తున్నా.  ఆశీర్వదించి.భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించండి. అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటాను. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యతను నేను తీసుకుంటాను. ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే అడ్డుపడి చేయని పనులను వడ్డీతో సహా రాబోయే ఐదు సంవత్సరాల్లో నేను చేస్తానని హామీ ఇస్తున్నా.  

 

 

 

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.