close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. అనూహ్యంగా ఫలితాలు

శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ప్రస్తుత శాసనమండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లు ఓటమి పాలయ్యారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇవే జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ నియోజకవర్గంలో పాతూరి సుధాకర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ స్థానం నుంచి పీఆర్‌టీయూ టీఎస్‌ అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించారు. వరంగల్‌-నల్గొండ-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌ ఓడిపోయారు.

2. భాజపాలోకి జితేందర్‌రెడ్డి!

లోక్‌సభలో తెరాస పక్ష నేత, మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డితో భాజపా నేతలు మంతనాలు జరుపుతున్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో తెరాస టికెట్‌ దక్కకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఆయనతో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఫోన్‌లో చర్చలు జరిపారు. పార్టీలో చేరికపై సంప్రదించారు. 29న మహబూబ్‌నగర్‌లో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మంతనాల సందర్భంగా జితేందర్‌రెడ్డి కొన్ని డిమాండ్లు పెట్టినట్లు తెలిసింది.

3. పాలమూరు నుంచి మోదీ శంఖారావం

దక్షిణ భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 29న ఎన్నికల శంఖాన్ని పూరించనున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ వేదికగా తన ప్రచారాన్ని ఆయన ప్రారంభిస్తారు. ప్రస్తుత ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఇప్పటివరకు అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించలేదు. ఈ నెల 28 నుంచి ఆయన ప్రచారానికి శ్రీకారం చుడతారు. ఆ రోజు ఉత్తర భారతదేశంలోని హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. తర్వాతి రోజు 29న దక్షిణ భారతంలోని పాలమూరు నుంచి ప్రచారం ప్రారంభమవుతుంది.

4. వరవరరావు విడుదల కోరుతూ లేఖ

విరసం నేత వరవరరావు విడుదల కోరుతూ ఆయన సతీమణి హేమలత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాశారు. లేఖ ప్రతిని మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విద్యావేత్త చుక్కా రామయ్య, సీనియర్‌ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు తదితరులు విడుదల చేశారు. ఈ లేఖను ప్రొ.హరగోపాల్‌ దిల్లీలో సీజేకు అందజేయనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ.. వరవరరావుతో పాటు పలువురిని నిందితులుగా చూపిన భీమా కోరేగాం హింసాకాండ కేసును నేరపూరిత కుట్ర కేసుగా, అనంతరం చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కేసుగా మారుస్తూ వచ్చారని ఆరోపించారు.

5. టీఎస్‌ఆర్టీసీకి నాలుగు జాతీయ పురస్కారాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కు నాలుగు జాతీయ పురస్కారాలు వచ్చాయి. పలు విభాగాల్లో అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌ టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) ఏటా అందజేసే ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో టీఎస్‌ఆర్టీసీ సత్తాచాటింది. వాహన ఉత్పాదకత, ఇంధన పొదుపు విభాగాల్లో 2017-18 సంవత్సరానికిగానూ మొత్తం నాలుగు పురస్కారాలను టీఎస్‌ఆర్టీసి దక్కించుకుంది. మంగళవారం దిల్లీలో జరిగిన జరిగిన ఏఎస్‌ఆర్‌టీయూ 63వ వార్షిక సదస్సులో పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.

6. రాజ్‌నాథ్‌పై పోటీకి జితిన్‌ ప్రసాద్‌!

కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్‌ ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖ్‌నవూ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మార్చి 30 నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతారని, మొదట బూత్‌ స్థాయి కార్యకర్తలతో సమావేశమై, తరవాత బహిరంగ సభల్లో పాల్గొంటారని పేర్కొన్నాయి. ఆ స్థానంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో భాజపాకు గట్టి పట్టుండటం విశేషం.  గతంలో ఇదే స్థానం నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పోటీ చేసేవారు. జితిన్ ప్రసాద్ భాజపాలో చేరతారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఆ ఊహాగానాలను ఆయన తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

7. నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణం!

పెద్దనోట్ల రద్దు దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ ఆరోపించారు. ‘భాజపా ప్రాయోజిత నోట్లరద్దు కుంభకోణం’ అనే అంశంపై దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలోను, అనంతరం విలేకరులతోను ఆయన మాట్లాడారు. అప్పట్లో భాజపా నేతలు భారీగా నోట్లను మార్చుకుని ‘లబ్ధి’ పొందారని ఆరోపిస్తూ ఓ శూలశోధన వీడియోను ప్రదర్శించారు. ఉగ్రవాదం, నల్లధనం, అవినీతి అంతానికి తాము నోట్లు రద్దు చేశామని ప్రధాని మోదీ ప్రకటించారని, ఆయన చెప్పిన వాటిలో ఏ ఒక్కటీ అంతం కాలేదని సిబల్‌ దుయ్యబట్టారు. నోట్ల రద్దుతో పేదలు, సామాన్యులు దోపిడీకి గురై, అవస్థలు పడితే.. సంపన్నులు లాభపడ్డారన్నారు.

8. రాంపూర్‌ నుంచి జయప్రద..జోషికి దక్కని టికెట్

భాజపా మంగళవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని 29, పశ్చిమ్ బంగలోని 10 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ  జాబితాలో భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి నిరాశ ఎదురుకాగా..పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే సినీనటి జయప్రద రాంపూర్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. జోషి 2014లో పోటీ చేసిన స్థానం నుంచి ప్రస్తుతం సత్యదేవ్‌ పచౌరీ  బరిలోకి దిగనున్నారు. మిత్రుడి నుంచి శత్రువుగా మారిన ఎస్పీ సీనియర్ నేత అజం ఖాన్ మీద జయప్రద పోటీ పడనున్నారు. అలాగే కేంద్ర మంత్రి మేనకా గాంధీ స్థానాన్ని కుమారుడు వరుణ్‌ గాంధీకి, ఆయన స్థానాన్ని ఆమెకు కేటాయించారు.

9. 31న తెరిచే ఉంటాయి 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు రోజైన మార్చి 31న (ఆదివారం) ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే  శాఖలు తెరిచే ఉంచాలని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించింది. ప్రభుత్వ రశీదులు, చెల్లింపుల కార్యాలయాలు మార్చి 31న పని చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో, దీనికి అనుగుణంగా ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే ఏజెన్సీ బ్యాంకుల శాఖలు కూడా పని చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్‌ లావాదేవీలైన ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ లాంటివి కూడా ఈ నెల 30, 31 తేదీల్లోనూ పని చేస్తాయి.

10. రెండో విజయం సాధించిన చెన్నై

ఐపీఎల్‌-12లో చెన్నై రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ధోని జట్టు 6 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. డ్వేన్‌ బ్రావో (3/33)తో పాటు ఇతర బౌలర్లు రాణించడంతో మొదట దిల్లీ 147/6కే పరిమితమైంది. శిఖర్‌ ధావన్‌ (51; 47 బంతుల్లో 7×4), రిషబ్‌ పంత్‌ (25; 13 బంతుల్లో 2×4, 1×6) రాణించారు. తక్కువ స్కోరే అయినా ఛేదనలో చెన్నై కష్టపడింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వాట్సన్‌ (44; 26 బంతుల్లో 4×4, 3×6), రైనా (30; 16 బంతుల్లో 4×4, 1×6), ధోని (32 నాటౌట్‌; 35 బంతుల్లో 2×4, 1×6) రాణించడంతో చెన్నై 19.4    ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.