close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. కేంద్ర ఎన్నికల సంఘానికి ఘాటైన లేఖ

ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయటంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటుగా స్పందించారు. ‘‘ఎన్నికల సంఘం తొందరపాటుతో, పక్షపాతంగా, అప్రజాస్వామికంగా, సహజన్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించింది. చట్టపరిధిలో, నీతినిజాయతీలతో సమర్ధంగా పనిచేసే అధికారుల నైతికస్థైర్యంపై ఈ బదిలీలు తీవ్రప్రభావం చూపాయి. నరేంద్రమోదీ, కేసీఆర్‌ల ప్రోద్బలంతో వైసీపీకి ప్రయోజనం చేకూర్చే విధంగా తీసుకున్న ఈ చర్యలు ఈసీ పాత్రను కూడా ప్రశ్నార్థకంగా మార్చాయి.’’ అని చంద్రబాబు అన్నారు.  ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర ఎన్నికలసంఘం ప్రధాన కమిషనర్‌కు ఏడుపేజీల ఘాటైన లేఖను సంధించారు.

2. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్ష్మణరావు గెలుపు

కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి కె.ఎస్‌.లక్ష్మణరావు గెలుపొందారు.  గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో 12 రౌండ్లపాటు సుదీర్ఘంగా లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఓట్ల లెక్కింపు అనంతరం 68,120 ఓట్ల మెజార్టీతో లక్ష్మణరావు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.  సమీప ప్రత్యర్థి నూతలపాటి అంజయ్య 12,550 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. మొత్తం పోలైన 1,49,319 ఓట్లలో లక్ష్మణరావుకు 80,670 ఓట్లు పోలయ్యాయి. లక్ష్మణరావు భారీ ఆధిక్యంతో గెలుపొందడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. లక్ష్మణరావు గతంలో రెండు సార్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా  ఎన్నికయ్యారు.

3. 1న రాహుల్‌ రాక

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఏప్రిల్‌ ఒకటో తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఇక్కడి కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మూడు లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఒకటిన జహీరాబాద్‌, నాగర్‌కర్నూలు, నల్గొండ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల సభల్లో పాల్గొననున్నట్లు పీసీసీ ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్‌ బహిరంగసభ, 2 గంటలకు నాగర్‌కర్నూలు సెగ్మెంట్‌ వనపర్తిలో, సాయంత్రం 4 గంటలకు నల్గొండ లోక్‌సభ స్థానం పరిధి హుజూర్‌నగర్‌ ఎన్నికల సభలలో రాహుల్‌ పాల్గొననున్నారు.

4. ఏపీ నిఘావిభాగాధిపతి బదిలీ రద్దు

ఆంధ్రప్రదేశ్‌ నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావు బదిలీలో బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయనను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వును 12 గంటలైనా గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. పోలీసుశాఖపరంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారిక హోదాలేవో వివరిస్తూ ఓ ఉత్తర్వును జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ జాబితాలో నిఘా విభాగాధిపతి పోస్టు ప్రస్తావన లేనందున ఆయన బదిలీని రద్దు చేసింది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకూ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

5. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా

పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంకా గాంధీ వెల్లడించారు. వ్యక్తిగతంగా మాత్రం పార్టీకి సేవలు అందించాలన్నదే తన అభిలాషని, సంస్థాపరంగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె అమేఠి, రాయబరేలీలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే రాహుల్‌ గాంధీయే ప్రధాని అవుతారని ప్రియాంకా గాంధీ వెల్లడించారు.

6. గోవాలో అర్ధరాత్రి అనూహ్య రాజకీయం

గోవాలో అర్ధరాత్రి అనూహ్యమైన రాజకీయాలు చోటుచేసుకున్నాయి. 2012 నుంచి మిత్రపక్షంగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు భాజపాలో విలీనం కావడం, దరిమిలా ఆ పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం చకాచకా జరిగిపోయాయి. ఈ చర్యతో మొత్తం 40 మంది సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీలో భాజపా బలం 12 నుంచి 14కు చేరింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 14 మంది ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం. ఎంజీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, అందులో సుదిన్‌ ధావలీకర్‌ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.

7. నేడు ప్రయోగ వేదికకు పీఎస్‌ఎల్‌వీ-సీ45

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఏప్రిల్‌ 1న పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ45 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ వాహక నౌక డీఆర్‌డీవోకు చెందిన ఎలక్ట్రానిక్‌ ఇంటిలిజెన్స్‌ శాటిలైట్‌ ఇమిశాట్‌తోపాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. షార్‌లోని వ్యాబ్‌లో పీఎస్‌ఎల్‌వీ-సీ45 అనుసంధానం పూర్తయింది. రెండు రోజుల కిందట రాకెట్‌లో ఉపగ్రహాలను అనుసంధానం చేసి, ఉష్ణకవచం అమర్చారు. గురువారం ఉదయం దీన్ని వ్యాబ్‌ నుంచి రెండో ప్రయోగ వేదికకు తీసుకురానున్నారు. 

8. అన్ని ప్రయాణాలకూ ఒకటే కార్డు

రోడ్డు రవాణా సంస్థ బస్సులు, మెట్రోరైలు, ఎంఎంటీఎస్‌, ఆటోలు, క్యాబ్‌లు... ఇలా అన్ని రకాలైన ప్రయాణాలు చేసేందుకు వీలుగా ఒకటే కార్డు (కామన్‌ మొబిలిటీ కార్డు) ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పేర్కొన్నారు. భవిష్యత్తు సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని కార్డును రూపొందించే బాధ్యతను సమర్థమైన ఏజెన్సీకి అప్పగించాలని సూచించారు. ప్రయాణికులకు కామన్‌ మొబిలిటీ కార్డు అందించే విషయమై వివిధ శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌, ఆటోలు, క్యాబ్‌ల ద్వారా రోజూ ఎంతమంది ప్రయాణిస్తున్నారనే వివరాలను సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

9. కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొన్న ఫేస్‌బుక్‌

కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొన్న ఫేస్‌బుక్‌.. తర్వాత పొరపాటును గుర్తించి క్షమాపణలు ప్రకటించింది. ఇరాన్‌ నెట్‌వర్క్‌లకు లక్ష్యంగా మారిన దేశాలను ప్రస్తావిస్తూ ఓ బ్లాగ్‌ పోస్టులో పెట్టిన జాబితాలో ఈ పొరపాటు తలెత్తింది. ఇరాన్‌కు సంబంధించిన బహుళ నెట్‌వర్క్‌లు అనధీకృత చర్యలకు పాల్పడిన కారణంగా 513 పుటలు, బృందాలు, ఖాతాలను తొలగించినట్లు ఫేస్‌బుక్‌ పేర్కొంది. ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియాలతోపాటు కశ్మీర్‌ను సదరు దేశాల జాబితాలో చేర్చింది. తప్పును గుర్తించడంతో ఓ ప్రకటన చేసింది.

10. 1 నుంచి షేర్ల బదిలీ డీమ్యాట్‌ రూపంలోనే: సెబీ

ఏప్రిల్‌ 1 నుంచి నమోదిత కంపెనీల షేర్ల బదిలీ తప్పనిసరిగా డీమ్యాట్‌ రూపంలోనే జరగాలని సెబీ వెల్లడించింది. అయితే మదుపర్లు కాగితం రూపంలో షేర్లు అట్టేపెట్టుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. ‘2019 ఏప్రిల్‌ 1 నుంచి ఎవరైతే షేర్లను బదిలీ చేయాలనుకుంటున్నారో.. ముందుగా డీమ్యాట్‌ రూపంలోకి మార్చుకోవాల్సి ఉంటుంద’ని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సెబీ తెలిపింది. అయితే వారసత్వంగా అందిన షేర్లు (ట్రాన్స్‌మిషన్‌), పేరు క్రమసంఖ్య మార్పు (ట్రాన్స్‌పోజిషన్‌) జరిగే షేర్ల విషయంలో ఈ నిబంధన వర్తించవని పేర్కొంది. కాగా.. షేర్ల బదిలీ డీమ్యాట్‌ రూపంలో మాత్రమే జరగాలని 2018 మార్చిలో సెబీ నిర్ణయం తీసుకుంది.  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.