close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @  9 AM

1. పాలనను కేసీఆర్‌ గాలికొదిలేశారు 

దేశానికి దమ్మున్న కాపలాదారు కావాలో... వారసత్వ రాజకీయాలు, కుంభకోణాల్లో కూరుకుపోయి తప్పుడు ప్రచారాలు చేసేవారు కావాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సురక్షిత భారత్‌, తెలంగాణ భవిష్యత్తు కోసం భాజపాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వాన్ని నిజాయతీగా నడిపించానని, ప్రజలు సుఖంగా జీవించాలని, కష్టాలు దూరం కావాలన్న సంకల్పంతో పనిచేశానని వెల్లడించారు. పాలనను కేసీఆర్‌ గాలికొదిలేశారని, తెలంగాణవాసుల ఆశీస్సుల కోసం తాను వచ్చానన్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

2. ఎన్నికల తరువాత భాజపా దుకాణం బంద్‌ 

రానున్న ఎన్నికల్లో ఫెడరల్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే దేశానికున్న దరిద్రం తీరుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. దిల్లీలో కూర్చొని శాసించే పద్ధతి ఇక చెల్లదని.. సమాఖ్య ప్రభుత్వంతోనే రాష్ట్రాల ఆశలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. దేశంలో గుణాత్మక మార్పునకు ఎవరో ఒకరు శ్రీకారం చుట్టాలని.. తెలంగాణ సమాజం ఆశీర్వదిస్తే జాతీయ రాజకీయాల్లో పొలికేక పెడతానన్నారు. అవసరమైతే ఎన్నికల తర్వాత జాతీయ పార్టీని స్థాపిస్తానని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. తన లక్ష్యం ఓట్లు కాదని.. దేశ పురోగతి మాత్రమేనని వివరించారు. ప్రధాని మోదీ మాట్లాడేవన్నీ అసత్యాలేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత ప్రజలే భాజపా భరతం పడతారని జోస్యం చెప్పారు.

3. ‘ఉదయించే సూర్యుడి’లా ఏపీ 

 ‘ఆంధ్రప్రదేశ్‌ ఉదయించే సూర్యుడయితే, శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌ను సన్‌సెట్‌గా అభివర్ణించడం బాధాకరం అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.‘‘పిల్లలు లేని మీకు వాత్సల్యం ఏం తెలుసు? బంధుత్వాలు.. బాంధవ్యాలు, స్నేహాలు.. మానవత్వం ఏం  తెలుసు’’ అంటూ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాడు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, కృష్ణా జిల్లా గుడివాడలలో బహిరంగ సభలు, రాజమండ్రి రోడ్‌ షోల్లో ప్రసంగించారు. ‘‘ప్రధానిని అమరావతికి భూమి పూజకు పిలిచాం. ఆయన మట్టి నీరు తెచ్చి మన ముఖానికి కొట్టారు. అలాంటప్పుడు అమరావతి గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఎక్కడుంది’’ అని ప్రశ్నించారు.

4. సభ్యత్వాల రద్దుకు పోరాటం 

తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించిన పది మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దయ్యేలా పోరాటం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పూర్తి ఆధారాలతో శాసనసభ సభాపతిని కలసి అనర్హతవేటు వేయాలని పిటిషన్‌ అందజేస్తారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో శుక్రవారం ఇందుకోసం ప్రయత్నించగా సభాపతి అసెంబ్లీలో లేరు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులను కలిశారు. నిబంధనల మేరకు అనర్హత పిటిషన్‌ను సభాపతికే ఇవ్వాలి. త్వరలో ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకుని అనర్హత పిటిషన్‌ అందజేస్తారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై రాజకీయంగా, న్యాయపరంగా కూడా పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించింది.

5. పోటీలో ఉన్నది మా అభ్యర్థులు కాదు

ప్రజాశాంతి తరఫున నామపత్రాలు దాఖలు చేసి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో చాలా మంది తమ అభ్యర్థులు కారని పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. శుక్రవారమిక్కడ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా, వైకాపాకు చెందిన వారు సిబ్బందిపై దాడిచేసి ప్రజాశాంతి బీఫారాలు ఎత్తుకెళ్లి అభ్యర్థులను నిలిపారన్నారు. తెదేపా 38 మందిని వైకాపా 11 మందిని అభ్యర్థులను నిలిపిందని ఆయన ఆరోపించారు. పలుచోట్ల ప్రజాశాంతి అభ్యర్థుల బీఫారాలు తిరస్కరించిన అధికారులు వైకాపా, తెదేపా వారు నిలిపిన వారిని అనుమతించారన్నారు.

6. నాలోనూ సీమ పౌరుషం

 ‘రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడిని కానప్పటికీ నాకూ సీమ పౌరుషం ఉంది. ఆ పౌరుషాన్ని రెచ్చగొట్టవద్దు. మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడు’ అని జగన్‌కు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాల, ఆదోని, నందికొట్కూరు పట్టణాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందికొట్కూరు చుట్టూ నీరున్నా సాగునీరు అందడం లేదన్నారు. రాయలసీమలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారన్నారు. అలాంటి వారికి భయం లేకుండా పాలన తీసుకొస్తామని తెలిపారు.

7. బాబుకు ఓటమి భయం

‘ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎవరికి భద్రత ఇచ్చారు? ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా అధికారిని జుట్టు పట్టి ఈడ్చుకెళితే అధికారికి మద్దతిచ్చారా? లేదా ఆ ఎమ్మెల్యేపై కేసులు లేకుండా మద్దతిచ్చారా? విజయవాడ కాల్‌మనీ వ్యవహారంలో బాధితురాళ్లకు మద్దతిచ్చారా? తెదేపా వారికా? ప్రతివారు భద్రంగా దాచుకునే ఆధార్‌, బ్యాంకు ఖాతాలను సేవామిత్ర యాప్‌ పేరుతో ప్రైవేటు కంపెనీలు, జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు.. చివరకు రాష్ట్ర ప్రజలకు భద్రత ఇచ్చారా? లేదా కొడుకు లోకేశ్‌కా?’ అని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు.

8. ఆ 3 లక్షల కంపెనీలపై దర్యాప్తు చేపట్టండి

నమోదు ఉపసంహరణకు గురైన 3 లక్షలకు పైగా కంపెనీలపై దర్యాప్తు చేపట్టాలని  దేశవ్యాప్తంగా ఉన్న ఆదాయపు పన్ను కార్యాలయాలకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో పన్ను ఎగవేత, మనీ లాండరింగ్‌, తప్పుడు ఆర్థిక లావాదేవీలు చేసిన కారణంగా ప్రభుత్వం గతంలో ఆ మూడు లక్షల కంపెనీలకు సంబంధించి నమోదు ఉపసంహరణ (డీ రిజిస్టర్‌) చేసిన సంగతి తెలిసిందే. కార్పొరేట్‌ కార్యలాపాల మంత్రిత్వ శాఖ రికార్డుల నుంచి తొలగింపునకు గురైన ఈ కంపెనీలపై దర్యాప్తు చేపట్టాలని పన్ను కార్యాలయాలను బోర్డు కోరింది.

9. అందులోనూ ఓ కిక్‌ ఉంది!

‘సినిమా వాళ్ల జీవితాలకేం... వాళ్లు ఏం ముట్టుకున్నా బంగారమే’ అనుకోవడానికి వీల్లేదు. ఎవరి కష్టాలు వాళ్లకుంటాయి. సెలబ్రెటీ హోదా వచ్చేశాక సామాన్యుల్లా బయట తిరగలేరు. చిన్న చిన్న కోరికల్నీ పణంగా పెట్టాల్సి వస్తుంది. వాళ్లేం చేసినా అందులో తప్పుల్ని పట్టుకోవడానికి భూతద్దం పట్టుకుని మరీ పరుగులు తీస్తుంటుంది సమాజం. ‘‘నేనేం నా కోరికల్ని వదులుకోలేదు. షాపింగులకు ఇది వరకటిలానే తిరిగేస్తున్నా. జనం తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే అందులోనూ ఓ కిక్‌ ఉంటుంది. సినిమా తార అనే హోదా నాకెప్పుడూ బరువు అనిపించలేదు’’ అంటోంది కీర్తి సురేష్‌.

10. చేధనాధన్‌ 

డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌స్టో.. తర్వాత విజయ్‌ శంకర్‌ల వీర విధ్వంసంతో 199 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం ఉఫ్‌ అని ఊదేసిన సన్‌రైజర్స్‌.. ఐపీఎల్‌-12లో బోణీ కొట్టింది. యువ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌ సూపర్‌ శతకం సాధించినా రాజస్థాన్‌ రాయల్స్‌కు ఓటమి తప్పలేదు. వార్నర్‌ (69; 37 బంతుల్లో 9×4, 2×6) అదరగొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడు బౌండరీల మోత మోగిస్తూ పరుగుల వరద పారించిన వేళ.. సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ కొట్టింది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.