close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. దిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తా

దేశంలో గుణాత్మకమైన మార్పు తెచ్చేందుకు అవసరమైతే జాతీయ పార్టీని స్థాపిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. దిల్లీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తానన్నారు. మే 23 తర్వాత దేశంలో పరిపాలన చేపట్టేది ప్రాంతీయ పార్టీలేనన్నారు. ‘ఎప్పుడూ జపాన్‌, అమెరికా, చైనా, జర్మనీల అద్భుతాల గురించి మాట్లాడుకోవడమేనా? అక్కడ ఏమైనా బంగారం పండుతుందా? దద్దమ్మలు, చేతికానివాళ్ల పాలన వల్ల ఈ పరిస్థితి దాపురించింది. దేశంలో అపారమైన నీళ్లు ఉన్నాయి. యువత ఉంది. వనరులు ఉన్నాయి. ఎవరో ఒకరు నడుం బిగించాలి. పోరాటం జరగాలి’ అంటూ మహబూబ్‌నగర్‌లో కేసీఆర్‌ ఉద్వేగభరితంగా ప్రసగించారు.

2. మోదీ హఠావో: మమతా బెనర్జీ

దేశంలో అసలేం జరుగుతోందో బహిరంగంగా చర్చించడానికి ప్రధాని మోదీ సిద్ధం కావాలని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  సవాల్‌ చేశారు. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారని అన్నారు. ఆ పార్టీ పాలనలో కార్మికులు, రైతులు పస్తులున్నారని, కేవలం ధనికులదే రాజ్యమన్నట్లుగా సాగిందని అన్నారు. ఇకపై ఇలా కొనసాగకూడదని చెబుతూ ‘మోదీ హఠావో’ అని పిలుపునిచ్చారు. విశాఖ తెదేపా ప్రచార సభలో పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి విమర్శల వర్షం గుప్పించారు.

3. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిల్లీలో చాటాలి

దిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలంటే 16 ఎంపీ స్థానాల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ కవిత కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లిలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. గతంలో ఎంపీగా గెలిచిన నాయకులు ప్రజాసమస్యల్ని పట్టించుకోకుండా హైదరాబాద్‌, దిల్లీలకే పరిమితమయ్యారని విమర్శించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో అవకాశం వచ్చినప్పుడల్లా బీడీ, సింగరేణి కార్మికుల సమస్యలను, పసుపు బోర్డు గురించి ప్రస్తావించానని గుర్తుచేశారు. తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత తెరాసకే దక్కిందని చెప్పారు.

4. నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ45

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి సోమవారం ఉదయం పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ45 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. సంబంధిత ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. వాహక నౌక డీఆర్‌డీవోకు చెందిన ఎలక్ట్రానిక్‌ ఇంటిలిజెన్స్‌ శాటిలైట్‌ ఇమిశాట్‌తోపాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 6.27 గంటలకు మొదలైంది. 27 గంటలపాటు కొనసాగాక పీఎస్‌ఎల్‌వీ- సీ45 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది మూడు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది.

5. తెలంగాణ ఎంపీలతో కలిసి ప్రత్యేక హోదా సాధిస్తాం 

వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను ఒకే నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తామని పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తామని హామీనిచ్చారు. దేశంలో ఏ ఒక్క పార్టీకి అధికారం రాదని, వైకాపా 25 పార్లమెంటు స్థానాలు గెలిస్తే, తెలంగాణలో 17 మంది మద్దతు తీసుకుని ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారు. ప్రత్యేక హోదాపై సంతకం చేస్తేనే మద్దతు ఇస్తామని స్పష్టంగా చెబుతామని అన్నారు.

6. వివాహానికి రూ.లక్ష ఇస్తాం: పవన్‌ కల్యాణ్‌

ఆడబిడ్డంటే ఇంటికి వెలుగని, అటువంటి వారికి పూర్తి భరోసా ఇచ్చేలా మహాలక్ష్మి పథకాన్ని జనసేన ప్రభుత్వం అమల్లోకి తెస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు. పదో తరగతి విద్యార్హత కలిగిన వధువుకు వివాహ కానుకగా రూ.లక్ష నగదు సహాయం అందజేస్తానన్నారు. అందులో రూ.50వేలు వడ్డీలేని రుణమని పేర్కొన్నారు. పెళ్లయ్యాక సారె నిమిత్తం రూ.10,116 నగదు అందిస్తామన్నారు. 25 కేజీల బియ్యం, రూ.2000 భృతి కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే జనసేన అజెండా అన్నారు.

7. జగన్‌ అవినీతి గురించి అందరికీ తెలుసు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకొస్తే రెండు రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. కేంద్రంలో అధికారంలోకొచ్చిన వెంటనే... ప్రత్యేక హోదా సహా విభజన చట్టం ప్రకారం ఏపీకి చెందాల్సినవన్నీ ఇచ్చి తీరతామని వెల్లడించారు. విజయవాడలో, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన ప్రచార సభలలో పాల్గొన్నారు. ‘ఐదేళ్లుగా మోదీ అన్యాయం చేస్తున్నా.. తెదేపా, వైకాపా ప్రధానిని ప్రశ్నించడంలో విఫలమయ్యాయి. వైకాపా అధ్యక్షుడు జగన్‌ అవినీతి గురించి అందరికీ తెలుసు. జగన్‌పై చాలా కేసులు ఉండటమే ప్రధానిపై ఒత్తిడి తేలేకపోవడానికి అడ్డంకని భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.

8. ప్రధాని వ్యాఖ్యలతో దోష విముక్తుడినైనట్లే!

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే, తనపై మోపిన నేరారోపణ నుంచి విముక్తి లభించినట్లేనని మద్యంవ్యాపారి విజయ్‌మాల్యా అభిప్రాయపడ్డారు. ‘‘బ్యాంకులకు నేను బాకీ ఉన్నానంటున్న రుణాల కంటే ఎక్కువే వసూలు చేశామని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. భాజపా పోస్టర్‌ బాయ్‌ను భారతదేశ అత్యున్నత నాయకుడు దోషవిముక్తుణ్ని చేశారని వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను. 1992 నుంచి యూకేలో నివసిస్తున్నానని భాజపావారు మర్చిపోయినట్లున్నారు. అయినా భాజపా అధికార ప్రతినిధి ఇంకా ఎందుకు తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు?’’ అని మాల్యా తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు.

9. ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన 

ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సునామీలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కొట్టుకుపోయింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ 118 పరుగుల భారీ తేడాతో బెంగళూరుపై విజయ ఢంకా మోగించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెయిర్‌స్టో, వార్నర్‌ల సెంచరీల జోరుతో మొదట సన్‌రైజర్స్‌ 2 వికెట్లకు 231 పరుగులు సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు.. పోరాడకుండానే చేతులెత్తేసింది. మహ్మద్‌ నబి (4/11) స్పిన్‌ దెబ్బకు బెంగళూరు 19.5 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కు ఇది రెండో విజయం కాగా.. బెంగళూరుకు వరుసగా మూడో పరాజయం.

10. పద్నాలుగు లక్షల మంది ఆన్‌లైన్‌ వివరాలు తస్కరణ

ఆన్‌లైన్‌ కొనుగోలుదారులను రూ.200 కోట్ల వరకు మోసం చేసిన గ్యాంగ్‌ ప్రధాన సూత్రధారి నందన్‌రావ్‌ పటేల్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎస్టీఎఫ్‌) అరెస్టు చేసింది. 14 లక్షలమంది వినియోగదారుల వివరాలను ఇతడి గ్యాంగ్‌ అక్రమంగా, చట్టవిరుద్ధంగా సేకరించిందని ఎస్టీఎఫ్‌ డీఎస్పీ రాజ్‌కుమార్‌మిశ్ర తెలిపారు. ‘‘తెలిసినవారి ద్వారా ఆన్‌లైన్‌ ఇకామర్స్‌ వెబ్‌సైట్ల వినియోగదారుల వివరాలతో పాటు బీమా కంపెనీల నుంచి ఖాతాదారుల వివరాలు రూ.2-3కు చొప్పున కొనుగోలు చేసేవాడు. వాటిని రూ.5-6లకు నకిలీ కాల్‌సెంటర్లకు అమ్మేవాడు. కాల్‌సెంటర్లు లక్షలాదిమందిని రూ.కోట్లలో మోసం చేశాయి’’ అని మిశ్ర తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.