close

తాజా వార్తలు

స్మృతి ఇరానీ విద్యార్హతలపై మళ్లీ రగడ

ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన విద్యార్హతలకు సంబంధించి తప్పుడు సమాచారం సమర్పించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల కమిషన్‌కు ఇలా తప్పుడు సమాచారం అందించినందుకు గాను ఆమెను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హురాలిగా ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అంతేకాకుండా ఒక కేంద్ర మంత్రిగా ఉన్న ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి ప్రయాంక చతుర్వేది ఆరోపించారు. స్మృతి ఇరానీ డిగ్రీ కూడా పూర్తి చేయలేదని ప్రతిపక్షాలు ఇన్ని రోజులుగా ఆరోపిస్తున్నప్పటికీ ఆమె తిరస్కరిస్తూ వచ్చారన్నారు. కానీ దిల్లీ విశ్వవిద్యాలయంలో ఆమె అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో చేరినట్లు ఆమె అంగీకరించారని.. అది ఇంకా పూర్తి కాలేదంటూ తాజాగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు చతుర్వేది చెప్పుకొచ్చారు. వీటిని పరిగణనలోకి తీసుకొని ఆమెను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని చతుర్వేది కోరారు. ‘కేంద్ర మంత్రి అయిన స్మృతి ఇరానీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారా లేదా అనే విషయంతో మాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ ఆమె పదేపదే కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ వస్తున్నారు. ఇది అసలు సమస్య. ఆమె చెబుతోన్న అబద్ధాలను దేశ ప్రజలు గమనిస్తున్నారు. కచ్చితంగా ప్రజలు ఆమెకు తగిన బుద్ధి చెబుతారు’ అని చతుర్వేది ధ్వజమెత్తారు. కేవలం ఆమె విద్యార్హతలకు సంబంధించి తప్పుడు రికార్డులను సృష్టించడమే కాకుండా ఎన్నికల కమిషన్‌కు కూడా తప్పుడు అఫిడవిట్‌లను సమర్పించి మభ్యపెడుతున్నారని ఆరోపించారు. దీనికిగాను చట్టప్రకారం ఆమె శిక్షార్హురాలు అని చతుర్వేది అన్నారు. అయితే ఇప్పటివరకు అధికార భాజపా ఈ విషయంలో స్పందించలేదు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆమెఠి లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచిన స్మృతి ఇరానీ నామినేషన్‌ దాఖలు చేస్తున్న సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో దిల్లీ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయలేదంటూ వివరాలు సమర్పించారు. 1991లో సెకండరీ స్కూల్‌, 1993లో సీనియర్‌ సెకండరీ స్కూల్‌, 1994లో దిల్లీ విశ్వవిద్యాలయంలో ఓపెన్‌ స్కూల్‌ విధానంలో బ్యాచిలర్స్‌ ఆఫ్‌ కామర్స్‌లో చేరారని, కానీ అది పూర్తి చేయలేదంటూ స్మృతి తాజా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2004 ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో 1994లో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసినట్లు ఆమె వివరాలను సమర్పించారు. తాజా అఫిడవిట్‌లో పూర్తి చేయలేదంటూ వివరాలు సమర్పించడంతో మరోసారి స్మృతి విద్యార్హతల వివాదం తెరపైకి వచ్చింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.