close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. రెవెన్యూ, పురపాలక శాఖల సమూల ప్రక్షాళన

ప్రభుత్వం బాగా పనిచేస్తోందని.. ఉద్యోగులు నీతినిజాయతీతో పనిచేస్తున్నారని, ప్రజాప్రతినిధులు నిస్వార్థ సేవలందిస్తున్నారని ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందితేనే పాలనకు సార్థకత చేకూరుతుందని ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ముందున్న తెలంగాణ అవినీతి లేని రాష్ట్రంగా మారాలని ఆకాంక్షించారు. లంచాలతో రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారి కష్టాలను పూర్తిగా తొలగించేందుకే రెవెన్యూ, పురపాలక శాఖలను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని, కొత్త చట్టాలు తెస్తున్నామని చెప్పారు.

2. మోదీకి కోడ్‌ లేదా?

‘ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లోనే డబ్బు తీసుకెళ్తుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి కనిపించదా? ప్రధానికి ఎన్నికల నియమావళి వర్తించదా? భాజపాకు ఎర్ర తివాచీ పరుస్తూ..విపక్ష పార్టీలపై ఈసీ ఒంటికాలి మీద ఎందుకు లేస్తోంది? అధికార పార్టీ ‘నమో టీవీ’ పేరుతో సొంత టీవీ ఛానల్‌ పెట్టుకుంటే ఏం చర్యలు తీసుకుంది. సాక్షి పత్రిక, ఛానల్‌పై మేం ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోగా.. వాటిలో ప్రచురించిన, ప్రసారమైన కథనాలు ఆధారంగా మాపై చర్యలు తీసుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని వ్యవస్థలతో ఎడాపెడా ఆడుకున్న ఈసీకి... కేంద్రంలోని ఐబీ, ఐటీ, ఈడీ వంటి సంస్థలు చేస్తున్న నిర్వాకాలు కనిపించలేదా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.

3. అన్నదాతకు హర్ష సూచన

కొన్నేళ్లుగా సరైన వర్షాల్లేక అవస్థలు పడుతున్న అన్నదాతలకు తీపి కబురు.. తెలుగురాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు బాగానే పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. వర్షపాతం సాధారణానికి సమీపంలో నమోదు కావచ్చని సోమవారం పేర్కొంది. దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ)లో 96% వర్షపాతం ఈ ఏడాది నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 1951 నుంచి 2000వ సంవత్సరం వరకు నైరుతి రుతుపవనాల్లో దీర్ఘకాల సగటు వర్షపాతం (ఎల్‌పీఏ) 89 సెం.మీ. ఈ ఏడాది ఇందులో 96% వరకు వానలు పడొచ్చని ఐఎండీ అంచనా.

4. విద్వేష ప్రసంగాలపై నిషేధాస్త్రం

అదుపు తప్పిన రాజకీయ నాయకుల ప్రసంగాలకు కళ్లెం వేసే దిశగా ఎట్టకేలకు ఎన్నికల సంఘం గట్టి చర్యలకు ఉపక్రమించింది. విద్వేష పూరిత, నిందాపూర్వక ఉపన్యాసాలు చేసేవారిపై దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా నిషేధాస్త్రం సంధించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత అజంఖాన్‌లు 72 గంటల పాటు, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, కేంద్ర మంత్రి మేనకా గాంధీలు 48 గంటలపాటు ప్రచారంలో పాల్గొనకుండా ఆంక్షలు విధించింది. విద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులపై సత్వర చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారంటూ ఎన్నికల సంఘం (ఈసీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

5. ‘తెలుగు తప్పనిసరి’ పుస్తకాలు వచ్చాయ్‌

తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చదవాలన్న చట్టం నేపథ్యంలో వచ్చే ఏడాదికి పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ చట్టం గత విద్యా సంవత్సరం నుంచి అమలవుతోంది. తెలుగు అమలు ప్రతి ఏటా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో ఒక్కో తరగతి పెరుగుతూ వస్తుంది. గత విద్యా సంవత్సరం 1, 6వ తరగతి పుస్తకాలను రూపొందించగా.. ఈసారి 2, 7వ తరగతి పాఠ్య పుస్తకాలను ముద్రించారు. రెండో తరగతికి తేనె పలుకులు, 7వ తరగతికి వెన్నెల పేరిట పుస్తకాలను తయారు చేశారు. వీటిని ఇతర మాధ్యమాల విద్యార్థులు చదువుకోవాల్సి ఉంటుంది.

6. రక్త పరీక్షకు ఒక్క నమూనా సరిపోదా!

ఎన్నికల ఫలితాల్లో పారదర్శకత కోసం 50% వీవీప్యాట్‌లు లెక్కించాలన్న ప్రతిపక్షాల వాదనను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా తోసిపుచ్చారు. ‘రోగ నిర్ధరణకు రక్త పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు రక్త నమూనాలు ఒక చోట తీసుకుంటామా లేదంటే 20 చోట్ల నుంచి సేకరిస్తామా’ అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 45 ఈవీఎంల్లోనే సమస్య వచ్చినట్లు తెలిపారు. తొలి దశ ఎన్నికల నిర్వహణ తీరుపై సోమవారం ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

7. అవి ఎన్నికల ప్రచారాంశాలే..

అన్నదాతల ఆత్మహత్యల అంశంలాగే....జాతీయతావాదం, అమర జవాన్ల త్యాగం కూడా ఎన్నికల్లో ప్రచారాంశమేనంటూ ప్రధాని నరేంద్రమోదీ సోమవారం స్పష్టం చేశారు. గత నలభై ఏళ్లుగా దేశం ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరవుతోందని, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకుండా మిన్నకుండాల్సినంత అగత్యమేమీ లేదని దూరదర్శన్‌ కిచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ఘాటించారు. ‘‘జాతీయతావాదం, అమర జవాన్ల త్యాగాలపై మన అభిప్రాయాలను చెప్పకుండా ఉంటే ఎలా? అసలు జాతీయతావాదం అనే భావన లేకుండా ఏ దేశమైనా ముందడుగు వేయగలుగుతుందా?’’ అని ప్రశ్నించారు.

8. విధుల్లోకి తీర గస్తీనౌక ఐసీజీఎస్‌ వీర

దేశానికి సమర్థవంతమైన తీర భద్రత ఉన్నప్పుడే జాతీయ భద్రత సంపూర్ణంగా ఉన్నట్లని భారత సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేర్కొన్నారు. సోమవారం విశాఖలోని నావల్‌ డాక్‌యార్డ్‌లో భారత తీర రక్షక దళానికి చెందిన ‘ఐసీజీఎస్‌ వీర’ అధునాతన తీర గస్తీ నౌకను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద తీర భద్రతా దళంగా భారత్‌ ఆవిర్భవించిందని చెప్పారు. భారత సైన్యం, తీర రక్షక దళాలు సంయుక్తంగా విన్యాసాలు చేయాల్సిన అవసరం ఉందని, ఇరు విభాగాలు సంయుక్తంగా శిక్షణ పొందితే శత్రువులపై ఉమ్మడిగా పోరాడటానికి అవకాశముంటుందని పేర్కొన్నారు.

9. జెర్సీ... జీవితానికి పాఠం నేర్పుతుంది 

‘‘తొలి చిత్రం ‘అష్టాచమ్మా’ నుంచి నానిని గమనిస్తున్నా. ఒక అద్భుతమైన... సహజమైన  నటుడిగా తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా ఎదిగాడు’’అన్నారు ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌. ఆయన హైదరాబాద్‌లో జరిగిన ‘జెర్సీ’ విడుదల ముందస్తు వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. గౌతమ్‌   తిన్ననూరి దర్శకత్వం వహించారు. అనిరుధ్‌ స్వరకర్త. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పకులు.

10. ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపిక

2019 వన్డే ప్రపంచకప్‌ వేటకు వెళ్లే భారత జట్టు ఏదో తేలిపోయింది. సోమవారం ముంబయిలో సమావేశమైన సెలక్షన్‌ కమిటీ.. విరాట్‌ కోహ్లి నేతృత్వంలో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.  ఈ జట్టులోని ఆటగాళ్లందరూ గత కొన్ని నెలల్లో భారత జట్టుకు ఆడిన వాళ్లే. కొత్త ముఖాలు, అనూహ్యంగా జట్టులోకి వచ్చిన వాళ్లెవ్వరూ లేరు. ఐతే కొన్ని నెలల కిందటి వరకు చోటు ఖాయంగా కనిపించిన అంబటి రాయుడికి, రెండో వికెట్‌ కీపర్‌ స్థానానికి చక్కగా సరిపోతాడనుకున్న రిషబ్‌ పంత్‌కు సెలక్టర్లు మొండి చేయి చూపడం చర్చనీయాంశంగా మారింది. ఫామ్‌ కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ విజయ్‌ శంకర్‌, దినేశ్‌ కార్తీక్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజాలకు అవకాశమిచ్చారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.