close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. పునేఠను మార్చినప్పుడు ఎక్కడున్నారు?

ప్రభుత్వంపైనా, తనపైనా విమర్శలు చేస్తున్న, గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘మోదీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినప్పుడు, ఏ తప్పూ లేకుండానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠను ఈసీ బదిలీ చేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారు. మీ వ్యక్తిగత ఎజెండాలతో నాపై విమర్శలు చేస్తారా? అని ఆయన ప్రజావేదికలో విలేఖరుల సమావేశంలో మండిపడ్డారు.

2. ఎన్డీయేలో చేరాలని కేసీఆర్‌ తహతహ 

రాష్ట్రంలో తెరాసకు వచ్చే ఆరేడు సీట్లతో ఎన్డీయే ప్రభుత్వంలో చేరిపోవాలని కేసీఆర్‌ కలలు కంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ‘కేంద్రంలో రెండో, నాలుగో మంత్రి పదవులు వస్తాయని అనుకుంటున్నారు. కానీ అది జరగని పని. ఎన్డీయే 300 పైచిలుకు స్థానాలతో అధికారంలోకి వస్తుంది. తెరాస వంటి పార్టీల అవసరం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలను వాయిదా వేయాలని కోరామని.. ఒకవేళ జరిగితే మాత్రం ఎదుర్కోడానికి.. అన్నిచోట్లా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షులను కోరారు.

3. ఆధార్‌ చౌర్యం నిజం కాదు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని 7.82 కోట్ల మంది ఆధార్‌ కార్డుదారుల వివరాలను ఐటీ గ్రిడ్స్‌ (ఇండియా) అనే ప్రైవేటు సంస్థ సేకరించిందన్న ఆరోపణలపై భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) బుధవారం స్పందించింది. ఈ కేసుకు సంబంధించి తమ సర్వర్లలోకి అక్రమంగా చొరబడ్డారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వివరించింది. తమ ‘సెంట్రల్‌ ఐడెంటిటీస్‌ డేటా రిపాజిటరీ’ (సీఐడీఆర్‌), సర్వర్లు పూర్తి సురక్షితంగా ఉన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. సీఐడీఆర్‌లోకి అక్రమంగా ఎవరూ అనుసంధానం కాలేదని, సర్వర్ల నుంచి ఎలాంటి డేటా అపహరణకు గురికాలేదని పేర్కొంది.

4. నేటి సాయంత్రం ఇంటర్‌ ఫలితాలు

 తెలంగాణకు సంబంధించి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ ఫలితాలు గురువారం సాయంత్రం 5 గంటలకు వెల్లడవుతాయి. వీటిని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. tsbie services అనే మొబైల్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని ఫలితాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఫలితాలను ‌www.eenadu.net, www.pratibha.net తో పాటు tsbie.cgg.gov.in; bie.telangana.gov.in, తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

5. మెరుపు వర్షాల బీభత్సం 

పెనుగాలుల దుమారం.. ఉరుములు, మెరుపుల గర్జనలతో కురిసిన ఆకస్మిక వానలు మంగళవారం రాత్రి ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. 53 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర స్థాయిలో ఆస్తి, పంట నష్టాలు సంభవించాయి. అకాల వర్షాల తీవ్రత రాజస్థాన్‌పై అధికంగా ఉంది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా 25 మంది మృత్యువాతపడ్డారు. మధ్యప్రదేశ్‌లో 15 మంది, గుజరాత్‌లో 10 మంది, మహారాష్ట్రలో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం విపత్తు విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోది ట్విటర్‌లో స్పందించారు. ప్రాణ నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు.

6. కులసమీకరణాలతోనే రాష్ట్రపతిగా కోవింద్‌ 

గుజరాత్‌లో 2017లో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో కేవలం కులసమీకరణాల నేపథ్యంలోనే రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి అయ్యారంటూ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ బుధవారం వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోదీ 2017 గుజరాత్‌ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం కష్టమేమోననే కలత చెందినట్లు తాను చదివిన ఓ వ్యాసం విశ్లేషించినట్లు గెహ్లోత్‌ చెప్పారు. ఆ పరిస్థితుల్లో భాజపా సారథి అమిత్‌ షా బహుశా రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతి చేయడం వైపు మొగ్గు చూపి అదే విషయాన్ని మోదీకి సూచించి ఉండవచ్చని కూడా వ్యాసం పేర్కొన్నట్లు గెహ్లోత్‌ అన్నారు.

7. వైకాపా అద్దె మైకుల్లా మారిపోయారా?

ఐఏఎస్‌ అధికారి అహ్మద్‌ బాబు చొక్కాను వైకాపా అధ్యక్షుడు జగన్‌ పట్టుకున్నప్పుడు, విశాఖపట్నం పోలీస్‌ కమిషనరుపై బెదిరింపులకు దిగినప్పుడు విశ్రాంత ఐఏఎస్‌ అధికారులంతా ఎక్కడున్నారని ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆనాడు జగన్‌ తీరుపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అంతా కలిసి వైకాపా అద్దె మైకుల్లా మారిపోయారా? అని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు గవర్నరును కలవడంలో ఏ మాత్రం అర్థం లేదని వ్యాఖ్యానించారు.

8. తిరోగమన దిశలో చంద్రబాబు: భాజపా

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరోగమన దిశలో పయనిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో భాజపా సభ్యుడు సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చంద్రబాబు అవలంభిస్తున్న వైఖరే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్ని ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తుందో? కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో? అన్నదీ తెలియకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఐదేళ్లపాటు వివాదాలతోనే ఆయన కాలం గడిపారని, రాష్ట్రంలో అవినీతిని కింది స్థాయికి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు.

9. మళ్లీ ఓ విజయం 

ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (50; 25 బంతుల్లో 10×4), జానీ బెయిర్‌స్టో (61 నాటౌట్‌; 44 బంతుల్లో 3×4, 3×6) అర్ధ సెంచరీలతో చెలరేగిన వేళ.. సన్‌రైజర్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఏడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులే చేయగలిగింది. ధోని లేని చెన్నై జట్టుకి సన్‌రైజర్స్‌ బౌలర్లు సమర్థంగా అడ్డుకట్ట వేశారు. అనంతరం సన్‌రైజర్స్‌ మరో 19 బంతులు మిగిలివుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 8 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్‌కు ఇది నాలుగో విజయం కాగా.. తొమ్మిది మ్యాచ్‌ల్లో చెన్నైకిది రెండో ఓటమి మాత్రమే.

10. చివరి ప్రయాణం పూర్తయింది!

కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ అధికారికంగా ప్రకటించింది. నిధుల కొరతతో అల్లాడుతున్నా, రూ.400 కోట్ల మేర అత్యవసర నిధులు అందించేందుకు బ్యాంకులు నిరాకరించడమే, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణమైంది. బుధవారం రాత్రి అమృత్‌సర్‌ నుంచి దిల్లీకి నడుపుతున్న విమానమే ఆఖరిదని సంస్థ ప్రకటించింది. ‘అన్ని అంతర్జాతీయ, దేశీయ విమానాలను నిలిపి వేస్తున్నామని, బుధవారం రాత్రి విమానమే చివరిద’ని పాతికేళ్ల ప్రస్థానం కలిగిన జెట్‌ ఎయిర్‌వేస్‌ స్టాక్‌ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.