close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. దస్త్రానికో ధర!

ప్రజలకు అన్ని అవసరాల్లో అనుసంధానమై ఉండే రెవెన్యూ శాఖ అవినీతి కూపంలా మారింది. క్షేత్రస్థాయి నుంచి పైవరకు అక్రమాలు వ్యవస్థీకృతంగా మారాయి. పహాణీకి రూ.వెయ్యి, ధ్రువపత్రాల జారీకి రూ.రెండు నుంచి రూ.మూడు వేలు, భూముల ధరలు బాగా ఉన్న చోట ఎకరానికి రూ.10 వేలు విదిలిస్తే తప్ప వారసత్వ బదిలీ పని పూర్తికావడం.. ఇదీ రెవెన్యూ శాఖలో నిరంతరాయంగా సాగుతున్న తంతు. అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడుతున్న అనేక ఉదంతాలే రుజువులు. కొందరు నిజాయితీపరులైన అధికారులున్నా వారి చుట్టూ వ్యవస్థ కలుషితమై ఉండడంతో అంతా ఇంతేలే అనుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన కూడా రెవెన్యూ సిబ్బందికి కాసుల పంట పండించింది.

2. సీఎం చంద్రబాబు సమీక్షపై వివరణ కోరతాం

ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో గురువారం నిర్వహించిన సీఆర్డీఏ సమీక్షపై వైకాపా ఫిర్యాదు నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (సీఎస్‌) వివరణ కోరనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఎన్నికల నియామావళి అమల్లో ఉన్నందున ముఖ్యమంత్రి, మంత్రులు కొన్నింటిపైనే సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నియామావళి పుస్తకాలను అధికారులందరికీ పంపిణీ చేశామని వెల్లడించారు. పోలింగ్‌ ముందు రోజున సీఎం చంద్రబాబు తనను కలిసిన సమయంలో మాట్లాడిన విషయాలను ఎన్నికల సంఘం (ఈసీ) సూచనల మేరకు ఆంగ్లంలోకి తర్జుమా చేసి పంపించామని చెప్పారు.

3. స్థానిక నిర్ణయం హైదరాబాద్‌లోనే

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను హైదరాబాద్‌లో ఎంపిక చేయాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల నుంచి అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించాలని, తుది నిర్ణయం ఇక్కడే తీసుకుంటామని వెల్లడించింది. ఆశావహులకు టికెట్లు ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వవద్దని, సభలు, సమావేశాల సందర్భంగా బహిరంగంగా ప్రకటించవద్దని నిర్దేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు ఆయనతో భేటీ అయ్యారు. కొందరితో ఫోన్‌లో మాట్లాడారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను సీఎం తొలుత ఎమ్మెల్యేలకు అప్పగించారు.

4. ఎన్నికల సంఘానికి ఏజెంటుగా జగన్‌

పోలింగ్‌ రోజున రాష్ట్రవ్యాప్తంగా 4 వేలకు పైగా ఈవీఎంలు మొరాయిస్తే ఎన్నికల సంఘం బ్రహ్మాండంగా పని చేసిందని వైకాపా అధ్యక్షుడు జగన్‌ ధ్రువీకరించడం ఏమిటని తెదేపా ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావు ప్రశ్నించారు. ఈసీకి ఏజెంట్‌గా జగన్‌ వ్యవహరించారని మండిపడ్డారు. మోదీకి మద్దతుగా ఈవీఎంలే కావాలంటున్నారని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 23 పార్టీలు 50శాతం వీవీప్యాట్లను లెక్కించాలని కోరుతుంటే జగన్‌ ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండు చేశారు. ఈ మేరకు విపక్ష నేతకు 18 ప్రశ్నలు సంధిస్తూ కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు.

5. ‘ఈవీఎం’లలో ఏదో తప్పుంది: శ్యామ్‌ పిట్రోడా

ఈవీఎంలలో ఏదో తప్పు ఉన్నట్లు తోస్తోందని, అదేమిటో తెలుసుకోవడానికి అధ్యయనం చేయాల్సి ఉందని కాంగ్రెస్‌ నాయకుడు శ్యామ్‌ పిట్రోడా పేర్కొన్నారు. ఒక ఇంజినీరుగా, సాంకేతిక నిపుణుడిగా ఈవీఎంల పనితీరుతో సంతృప్తిగా లేనని చెప్పారు. ‘‘ఈవీఎంలో తప్పు ఏమిటనేది కచ్చితంగా చెప్పలేను. అది తెలుసుకోవాలంటే ఎవరైనా ఈవీఎంను ఇస్తే, ఏడాది అధ్యయనం చేసి చెప్పగలను’’ అని పిట్రోడా వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు నిపుణులను సంప్రదించిన తరువాత, దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ‘న్యాయ్‌’ పథకాన్ని రాహుల్‌గాంధీ ప్రకటించారన్నారు.

6. గృహ నిర్భంధం మానవ హక్కుల ఉల్లంఘనే

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగను గృహనిర్భంధం చేయడం మానవ, ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘించడమే అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పంజాగుట్టలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం సంఘటనతో దళిత సమాజం తీవ్ర ఆందోళనలో ఉందని పేర్కొన్నారు. గురువారం రాత్రి విద్యానగర్‌లోని డీడీ కాలనీలో గృహనిర్భంధంలో ఉన్న మందకృష్ణను ఆయన కలిసి సంఘీభావం తెలిపారు. మందకృష్ణ ఉద్యమానికి కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఉత్తమ్‌ చెప్పారు. ఉద్యమంలో భాగస్వాములు కావాలని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

7. ఈ ఏడాది విక్రయలక్ష్యం రూ.500 కోట్లు 

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100-150 కొత్త విక్రయశాలలు నెలకొల్పడం ద్వారా రూ.500 కోట్ల టర్నోవర్‌ సాధించాలనేది లక్ష్యమని మొబైల్‌ రిటైల్‌ సంస్థ హ్యాపీ మొబైల్స్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణపవన్‌ చెప్పారు. స్థాపించిన ఏడాది కాలంలో 46 విక్రయశాలలపై రూ.250 కోట్ల టర్నోవర్‌ సాధించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 4 శాతం మార్కెట్‌ వాటా సాధించామన్నారు. ఎంపిక చేసిన విక్రయశాలల్లో ఎల్‌ఈడీ టీవీలతోపాటు ఇతర గృహోపకరణాలను విక్రయిస్తామన్నారు. తొలి వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 29 వరకు హ్యాపీడేస్‌ పేరిట భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.

8. ధోని జట్టులో ఉండడం నా అదృష్టం: కోహ్లీ

క్రికెట్‌ను ధోని బాగా అర్థం చేసుకుంటాడని, అతడంటే తనకెంతో గౌరవముందని టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ‘‘ధోనీకి ఆటపై గొప్ప అవగాహన ఉంది. మైదానంలో తొలి బంతి నుంచి 300వ బంతి వరకు ఆటను అర్థం చేసుకుంటాడు. ‘అతడు జట్టులో ఉండడం నాకు చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పను. స్టంప్స్‌ వెనుక అతడి లాంటి తెలివైన వ్యక్తి ఉండడం నా అదృష్టమని చెబుతా. టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో వ్యూహరచనలో మహి భాయ్‌, రోహిత్‌ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటా’’ అని కోహ్లి చెప్పాడు.

9. కిడ్నీ రాకెట్‌లో మరొకరి అరెస్టు 

దిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న కిడ్నీ రాకెట్‌లో రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మరో నిందితుడు సందీప్‌కుమార్‌ను మంగళవారం దిల్లీలో అరెస్ట్‌ చేశారు. స్థానిక కోర్టులో అతడిని హాజరుపరిచి గురువారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మాలిక్‌, రితికలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కిడ్నీ రాకెట్‌కు సందీప్‌ సహకరిస్తున్నాడని రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదుతో మాలిక్‌, రితికలను గత నెలలో అరెస్ట్‌ చేశామని, నిందితులు తెలిపిన సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందం దిల్లీకి వెళ్లి సందీప్‌ను పట్టుకుందన్నారు.

10. తిప్పేసిన చాహర్‌

రాహుల్‌ చాహర్‌ (3/19) విజృంభించడంతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి 40 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై ఘనవిజయం సాధించింది. హార్దిక్‌ పాండ్య (32; 15 బంతుల్లో 2×4, 3×6), కృనాల్‌ పాండ్య (37 నాటౌట్‌; 26 బంతుల్లో 5×4), డికాక్‌ (35; 27 బంతుల్లో 2×4, 2×6) మెరవడంతో మొదట ముంబయి 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. బంతితో  చాహర్‌తో పాటు బుమ్రా (2/18) రాణించడంతో ఛేదనలో దిల్లీ చేతులెత్తేసింది. 9 వికెట్లకు 128 పరుగులే చేయగలిగింది. ధావన్‌ (35; 22 బంతుల్లో 5×4, 1×6) టాప్‌ స్కోరర్‌.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.