close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. మోదీ గద్దె దిగడం ఖాయం

ప్రధాని మోదీని గద్దె దించాలని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. కర్ణాటకలోని రాయచూరు, చిక్కోడిల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాంగ్రెస్‌ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ అధికారంలోకి వస్తుంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇతర రాష్ట్రాల్లో భాజపాపై పోరాడుతున్న పార్టీలన్నీ గెలుస్తాయి. గుజరాత్‌ ప్రజలదీ ఇలాంటి నిర్ణయమే. ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను బలపరుస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

2. టైటిల్‌తో భూరక్ష

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించిన అవినీతి రహిత పాలన కోసం నిపుణులు తగిన ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో భూమికి టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ తెరపైకొస్తోంది. దీన్ని ప్రవేశపెడితే రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, పురపాలక శాఖల్లో అవినీతిని చాలా వరకూ అరికట్టవచ్చని బలంగా చెబుతున్నారు. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ మూడు పద్ధతుల్లో ఉంది. మొదటిది మిర్రర్‌ పద్ధతి. అంటే క్షేత్రస్థాయిలో భూముల వివరాలు సేకరించడం, వాటి వాస్తవ యజమానులను గుర్తించడం. రెండోది కర్టెన్‌ పద్ధతి. ఇందులో ప్రస్తుత భూయజమాని ఎవరన్నది మాత్రమే నమోదు చేస్తారు. అంటే ఆ ప్లాటు లేదా భూమి గత చరిత్ర ఏమీ ఉండదు. మూడోది పరిహార విధానం. ఇది అన్నింటికన్నా కీలకమైంది. భూమి కొన్న వ్యక్తి మోసపోతే ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుంది.

3. కాకినాడ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వీహెచ్‌ నిరసన

హైదరాబాద్‌లోని పంజాగుట్ట వద్ద రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని ఇంద్రపాలెం వంతెన దరి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. హైదరాబాద్‌లో ఎన్నికల నిబంధనల నెపంతో పంజాగుట్టలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ముక్కలు చేసి డంపింగ్‌యార్డుకు తరలించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచినప్పుడు కోడ్‌ ఏమయ్యిందని, రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని నెలకొల్పితే కోడ్‌ అడ్డొచ్చిందా?అని ప్రశ్నించారు.

4. ఐటీ దాడులు రాజకీయ ప్రతీకారం కాదు: మోదీ

ఇటీవల కొందరు రాజకీయ నాయకులపై ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం దాడులు చట్టప్రకారమే జరిగాయని, రాజకీయ ప్రతీకారంతో ఎంతమాత్రం భాగం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఒక మతం మొత్తాన్ని ఉగ్రవాదంతో ముడిపెట్టిన వారికి ప్రజ్ఞా సింగ్‌ అభ్యర్థిత్వం దీటైన జవాబు అని అన్నారు. భోపాల్‌ నుంచి భాజపా తరఫున లోక్‌సభకు పోటీపడుతున్న ఆమె కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వగలదన్నారు. ‘‘టైమ్స్‌ నౌ’’ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఐటీ దాడుల తరువాత రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడ్డారనడానికి సాక్ష్యాలు లభించాయన్నారు.

5. గెలుపు మనదే: చంద్రబాబు

‘‘మళ్లీ అధికారం మనదే. ఈసారి రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలవబోతున్నాం. అన్ని జిల్లాల్లో తెదేపా సత్తా చాటబోతోందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన కడప, కర్నూలు జిల్లాల పర్యటనలో భాగంగా పార్టీ అభ్యర్థులతో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు బాగా పనిచేశాయని, నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చెప్పారు. గురువారం ఒంటిమిట్టలో కల్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం దంపతులు రాత్రి కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేశారు.

6. కుతంత్రాలు మానకపోతే తిరగబడతారు

‘నేను మళ్లీ అధికారంలోకి వస్తాను. మీతో పరిచయాలు ఉన్న వైకాపా నేతలతో సంబంధాలు కొనసాగించండి..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెదేపా నాయకులకు టెలికాన్ఫరెన్స్‌లో సూచించారని, ఇలాంటి కుతంత్రాలు మానకపోతే ఆయనపై ప్రజలు తిరగబడతారని మాజీ మంత్రి, వైకాపా సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పదవీ కాలం గడువు జూన్‌ 8 వరకు ఉందని ముఖ్యమంత్రి చెబుతున్నారని, దీన్ని తాము కాదనబోమని చెప్పారు.

7. శీతల పానీయాలవినియోగం రెట్టింపు

భారత శీతల పానీయాల విపణి దూసుకెళ్తోంది. 2021 నాటికి తలసరి వినియోగం రెట్టింపై దాదాపు 84 సీసాలకు చేరొచ్చని పెప్సికో ఇండియా బాట్లింగ్‌ భాగస్వామి వరుణ్‌ బెవరేజెస్‌ అంచనా వేస్తోంది. పళ్ల రసాలు, బాటిల్డ్‌ నీరు ఇందుకు దన్నుగా నిలుస్తున్నాయని 2018 వార్షిక నివేదికలో సంస్థ పేర్కొంది. మధ్యతరగతి వృద్ధి చెందడం, స్థోమత పెరగడం, పట్టణీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సేవలు, ఉత్పత్తుల ప్యాకేజింగ్‌లో వినూత్నత వంటి ఆంశాలు శీతల పానీయాల అమ్మకాల వృద్ధికి దోహదపడుతున్నాయని వెల్లడించింది.  కార్బొనేట్లు, కోలాయేతర కార్బొనేట్లు, ముఖ్యంగా నిమ్మ ఆధారిత ఉత్పత్తులు వేగంగా వృద్ధి చెందుతున్నాయని చెప్పుకొచ్చింది.

8. రసెల్‌ బాదినా.. బెంగళూరే నవ్వింది 

విరాట్‌ (100; 58 బంతుల్లో 9×4, 4×6) చెలరేగాడు... అతను మెరుపు శతకం చేసి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనితో పాటు మొయిన్‌ అలీ (66; 28 బంతుల్లో 5×4, 6×6) విరుచుకుపడడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో నరైన్‌ (1/32), రసెల్‌ (1/17) మాత్రమే పొదుపుగా బౌలింగ్‌ చేశారు. ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. నితీష్‌ రాణా (85 నాటౌట్‌; 46 బంతుల్లో 9×4, 5×6), ఆండ్రి రసెల్‌ (65; 25 బంతుల్లో 2×4, 9×6) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడినా బెంగళూరు స్కోరు సమీపంగా మాత్రమే తీసుకొచ్చారు కానీ కోల్‌కతాను గెలిపించలేకపోయారు.

9. చైనీస్‌ చిత్రంలో నటించాలనుంది

ఎప్పటికైనా ఓ చైనీస్‌ చిత్రంలో నటించాలని  ఉందంటున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు షారుఖ్‌ఖాన్‌. ఆయన నటించిన ‘జీరో’ చిత్రం బీజింగ్‌  చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికైంది. షారుఖ్‌ ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికి చైనా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఇండియా- చైనాల్లోని సూపర్‌ హీరోల కథాంశంతో ఓ సినిమా చేయాలనేది నా కల. అది నెరవేరే సమయం వస్తే  మాండరిన్‌ భాషను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎవరో ఒకరు నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నటించడమే కాదు అవకాశం ఉంటే చైనీస్‌ చిత్ర నిర్మాతలతో కలసి నిర్మించడానికీ సిద్ధమే’’ అని చెప్పారు.

10. వాయిదా వేస్తారా...రూ.10 కోట్లు కట్టండి 

 జాతీయ క్రీడల నిర్వహణను వాయిదా వేస్తున్నందుకు గోవాపై జరిమానా పడింది. ఇప్పటికే మూడు సార్లు క్రీడలను వాయిదా వేసినందుకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) గోవాపై రూ.10 కోట్లు జరిమానా విధించింది. ‘‘తొందర్లోనే ఐఓఏ ప్రతినిధి గోవాకు వెళ్లి క్రీడల నిర్వహణకు సంబంధించిన తేదీలను ఖరారు చేయనున్నాడు. ఇప్పటికే మూడు సార్లు క్రీడలను వాయిదా వేసిన గోవా రూ.10 కోట్లు జరిమానాగా చెల్లించాల్సిందే. గోవా జరిమానా చెల్లించకుండా క్రీడలను నిర్వహించాలి అని ప్రయత్నిస్తే ఐఓఏ వాటిని రద్దు చేస్తుంది’’ అని అని ఐఓఏ నియమించిన క్రీడల సాంకేతిక కమిటీ ఛైర్మన్‌ ముఖేశ్‌ కుమార్‌ తెలిపాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.