close

తాజా వార్తలు

హైదరాబాద్‌లో రహదారులపై హాహాకారాలు..!

ఈదురు గాలులు.. కుండపోత వర్షం
ఎగిరి పడిన హోర్డింగులు.. కూలిన చెట్లు
గంటన్నరపాటు ట్రాఫిక్‌ జాం..

ప్రకృతి ధాటికి కకావికలమైన మహా నగరం

నల్గొండ క్రాస్‌రోడ్స్‌ నుంచి చాదర్‌ఘాట్‌ వంతెన వరకూ రెండువైపులా వాహనాలు ఆగిపోవడంతో రెండు కిలోమీటర్లను దాటేందుకు 30 నిముషాలు పట్టింది. చాదర్‌ఘాట్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకూ ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో బస్టాండ్‌కు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: ఉన్నట్టుండి ఉరుములు... మెరుపులు... బలమైన ఈదురుగాలులు... రాళ్లలా కురుస్తున్న వర్షం... ఫెళ్లుమంటూ విరిగిపడుతున్న చెట్ల కొమ్మలు... చిత్తుకాగితాల్లా ఎగురుతున్న ఫ్లెక్సీలు... సోమవారం సాయంత్రం హైదరాబాదీయులు ఎదుర్కొన్న అనుభవాలు.. నగరమంతా ఒక్కసారిగా పెనుగాలులు వీయడం, భారీ వర్షం కురవడంతో ఆ సమయంలో రహదారులపై ఉన్న వాహనదారులు.. పాదచారులు చిగురుటాకుల్లా వణికిపోయారు... గాలికి కొట్టుకుపోతామేమోనన్న భయంతో ద్విచక్రవాహనచోదకులకు సురక్షితస్థానాలకు వెళ్లగా... కార్లు, ఇతర వాహనచోదకులు రోడ్డుపై ఎక్కడికక్కడే ఆగిపోయారు. వర్షంనీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాదచారులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులు ఇంటికి ఎప్పుడు వెళ్తామో అంటూ ఆందోళన చెందారు. ఇలా రాత్రి 7గంటల నుంచి రాత్రి 8.30గంటల వరకూ నగరం, శివారు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు రహదారులపై పడిన చెట్ల కొమ్మలను తొలగించారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌లకు అతికష్టమ్మీద దారి చూపించగలిగారు. రాత్రి తొమ్మిదిగంటలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కాస్త తగ్గడంతో ట్రాఫిక్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను పంపించారు.

రహదారులపై నరకం..
* వర్షం ప్రారంభమైన కొద్దిసేపటికే.. గ్రీన్‌ల్యాండ్స్‌ ఫ్లైఓవర్‌ నుంచి బేగంపేట, సీటీవో జంక్షన్‌ వరకూ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. రెండువైపులా వాహనాలు 1.5కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
* మెహిదీపట్నం నుంచి మాసాబ్‌ట్యాంక్‌ ఫ్లైఓవర్‌ మీదుగా లక్డీకాపూల్‌ వరకూ రెండు వైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మాసాబ్‌ట్యాంక్‌ సమీపంలో ఓ హోర్డింగ్‌ కూలిపోవడంతో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1, 10 మార్గాల్లో రెండువైపులా వాహనాలు ఆగిపోయాయి.

* ఆబిడ్స్‌ నాంపల్లి, ఖైరతాబాద్‌మీదుగా పంజాగుట్ట వరకూ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్‌.ఎఫ్‌.సి.ఎల్‌ సర్కిల్‌ నుంచి శ్రీనగర్‌ కాలనీ టీ-జంక్షన్‌ వరకూ ఆర్టీసీబస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు కిలోమీటర్‌ వరకూ ఆగిపోయాయి.
* సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌ సర్కిల్‌, వైఎంసీఏ క్రాస్‌రోడ్స్‌, ప్యాట్నీ జంక్షన్‌మీదుగా ఘాస్‌మండి, బైబిల్‌హౌస్‌ వరకూ రెండువైపులా వాహనాలు ఆగిపోయాయి. ఒక్కో కూడలి దాటేందుకు 20నిముషాల సమయం అవసరమయ్యింది.

అర్ధరాత్రి వరకు అంధకారం.. తిరుమలగిరి ఆర్టీసీ కాలనీ, హబ్సిగూడ స్ట్రీట్‌ నంబర్‌ 8, సైదాబాద్‌, ముషీరాబాద్‌ రాజాడీలక్స్‌, ఇందిరానగర్‌, వెస్ట్‌ మారేడ్‌పల్లి గణేష్‌నగర్‌, చంపాపేట నాగార్జున కాలనీ, నేరెడ్‌మెట్‌ సీతారాంనగర్‌, ఎల్బీనగర్‌ మున్సిపల్‌ కార్యాలయం, బహదూర్‌పురా, తాడ్‌బంద్‌, విద్యానగర్‌, పికెట్‌, శివం, రామంతపూర్‌, కొత్తపేట, తదితర ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలపై చెట్లు విరిగిపడటంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వెస్ట్‌మారేడ్‌పల్లి, కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా అధికారులు 33కేవీ సబ్‌స్టేషన్‌ పరిధిలో విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. అర్థరాత్రి వరకు సరఫరా పునరుద్ధరించలేదు. జీహెచ్‌ఎంసీకి చెందిన 8 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఒక్కో బృందంలో 25 మంది ఉన్నారు. కూలిన చెట్లను వెంటనే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.