close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 5 PM

1. వీవీప్యాట్లకు 9వేలకోట్లు ఖర్చుపెట్టి ఏంచేశారు? 

ఈవీఎంలలో లోపాలను సరిదిద్దడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోందని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. చాలా దేశాలు బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమికి ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి వెళ్లిన ఆయన.. ఈవీఎం లోపాలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారు. వీవీప్యాట్‌ల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారని ఈసీని చంద్రబాబు ప్రశ్నించారు. ఈవీఎంలోని ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోలాలన్నారు. ఈవీఎంల్లో లోపాలు వస్తే సరిచేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

2. మోదీపై పోటీకి నిజామాబాద్‌ రైతులు సై! 

సార్వత్రిక ఎన్నికల్లో మోదీ బరిలో నిలిచిన వారణాసి లోక్‌సభ స్థానం నుంచి  పోటీ చేయాలని నిజామాబాద్ పసుపు రైతులు నిర్ణయించారు. ఈ మేరకు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నాయకత్వంలో 50 మంది రైతులు ‘చలో వారణాసి’ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాలోని అర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి వారణాసి వెళ్తున్నామని రైతులు చెప్పారు. స్వతంత్ర అభ్యర్థులుగా వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్‌ వేస్తామన్నారు. పసుపు బోర్డుతోపాటు పంటకు మద్దతు ధర సాధించాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నామని, ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా తాము ప్రచారం నిర్వహించబోమని స్పష్టంచేశారు. 

3. టీఎస్‌లో 49మంది ఉన్నతాధికారులకు పదోన్నతి

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లు, 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు దక్కాయి. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం అనుమతితో 49 మంది ఉన్నతాధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 15 జీవోలను జారీ చేసింది. ముగ్గురు ఐఏఎస్‌లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించింది. అలాగే, కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురికీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

4. ఇంటర్‌ రీకౌంటింగ్‌ ఫీజు చెల్లింపు గడువు పెంపు

 ఇంటర్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై నిరసనలు హోరెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా సప్లిమెంటరీ పరీక్షలు, రీకౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు గడువు పెంచింది.  ఈ నెల 27 వరకు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌తో పాటు టీఎస్‌ ఆన్‌లైన్‌ సేవా కేంద్రాల్లో చెల్లించేందుకు ఏర్పాట్లు చేసినట్టు బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. 

5. రాహుల్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు

‘చౌకీదార్‌ చోర్‌ హై’ అనే పద ప్రయోగ విషయంలో సుప్రీంకోర్టు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి కోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. చౌకీదార్‌ చోర్‌ అనే పద ప్రయోగంపై సోమవారం రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఎక్కడా ఆయన క్షమాపణలు కోరలేదని, కేవలం చౌకీదార్‌ చోర్‌ అనే వ్యాఖ్యలను సుప్రీం తీర్పునకు ఆపాదించానని మాత్రమే ఒప్పుకున్నారని మీనాక్షి లేఖి తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ధర్మాసనానికి వివరించారు. రాహుల్‌ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్న పదాన్ని బ్రాకెట్‌లో పెట్టారని వివరించారు. రాహుల్‌ గాంధీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

6. శ్రీలంకలో 10కి చేరిన భారత మృతులు

 శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో భారత మృతుల సంఖ్య 10కి చేరుకున్నట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ మంగళవారం తెలిపారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి చేరినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనలో దాదాపు 500 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందున్నట్లు తెలిపింది. తీవ్ర గాయాల వల్లే మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వెల్లడించింది. అయితే ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న 40 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

7. ఏడాదిలో 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఒకే ఏడాదిలో 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. రాజస్థాన్‌లోని దుంగర్‌పూర్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. గత ఐదేళ్లలో అన్ని వర్గాల వారికి ప్రభుత్వం అన్యాయం చేసిందని, ముఖ్యంగా గిరిజనులకు ప్రభుత్వ ఫలాలు ఏమీ అందలేదని మండిపడ్డారు. రాబోయే ఐదేళ్లలో తాను అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మోదీ కేవలం 15-20 మందితో ప్రభుత్వం నడుపుతున్నారని మండిపడ్డారు. 

8. పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ: జగదీశ్‌రెడ్డి

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఫలితాల్లో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ ఉన్నాయని ఆయన మండిపడ్డారు.సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని కోరారు. ఫలితాలపై విచారణ కొనసాగుతోందన్న మంత్రి.. రెండు, మూడు రోజుల్లో నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

9. ఒక్క రోజులో పది లక్షల టికెట్లు..!

ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ భారత్‌లో చరిత్ర సృష్టించింది. ఏప్రిల్‌ 26న ఈ చిత్రం ఆంగ్లం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఒక్కరోజులో బుక్‌ మై షో యాప్‌లో పది లక్షల టికెట్లు అమ్ముడుపోయాయట. అంటే క్షణానికి 18 టికెట్లు అమ్ముడుపోయినట్లు బుక్‌ మై షో సీఓఓ ఆశిష్‌ సక్సేనా వెల్లడించారు. ‘అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.

10. వెంటాడిన ముడి చమురు భయాలు!

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ముడి చమురుపై అమెరికా ఆంక్షల ప్రభావంతో నిన్న భారీ నష్టాలను మూటగట్టుకున్న సూచీలు ఆ నష్టాల పరంపరను నేడూ కొనసాగించాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 80 పాయింట్లు  కోల్పోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,564 వద్ద ముగిసింది. నిఫ్టీ 18.50 పాయింట్ల నష్టంతో 11,575 వద్ద స్ధిరపడింది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.