close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. పెను తుపానుగా ఫొని 

‘ఫొని’ మంగళవారం రాత్రికి పెను తుపానుగా మారింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు అతి సమీపంగా పయనిస్తూ ఈ నెల 3న ఒడిశాలో తీరం దాటనుంది. ఫొని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ నెల 2, 3 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు జిల్లాలతోపాటు విశాఖలోనూ అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. విశాఖపట్నం జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని, తీరప్రాంతంలో గంటకు 90 నుంచి 118 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్‌లు తెలిపాయి.

2. 40 వేల మంది మనవాళ్లే

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగినట్లు నిపుణుల అంచనా. దేశవ్యాప్తంగా 2.45 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత పొందగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి దాదాపు 40 వేల మంది ఉన్నట్లు చెబుతున్నారు. వారందరు జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ స్కోర్‌ను సాధించి మే 27న జరిగే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హత పొందారు. గత కొద్ది సంవత్సరాలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువేనని పేర్కొంటున్నారు.

3. విలీనం చట్టవిరుద్ధమైతే రద్దు చేస్తాం

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీని ప్రాంతీయ పార్టీ తెరాసలో విలీనం చేయడం చట్టవిరుద్ధమైతే ఆ విలీనాన్ని రద్దు చేస్తామని, ఆ అధికారం తమకుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు విచారించాల్సినంత అత్యవసరమేమీ ఇందులో లేదంటూ విచారణను జూన్‌ 11కి వాయిదా వేసింది. కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే.

4. భాగ్యనగరానికి బెంగ లేదిక!

 భాగ్యనగరంలో వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, రసాయన కాలుష్య కారకాలతో ఏర్పడే ప్రమాదాల నుంచి రక్షించేందుకు ప్రత్యేక ముసాయిదాను సిద్ధం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ విపత్తుల నిర్వహణ విభాగం (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) దీన్ని రూపకల్పన చేస్తోంది.  అన్ని కాలాల్లో పనిచేసేలా యూహెచ్‌ఎఫ్‌ (అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ) సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.  రూ.2 కోట్ల వరకు వ్యయమయ్యే అధునాతన సమాచార వ్యవస్థను 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా వినియోగించేందుకు పలు ప్రాంతాల్లో ప్రత్యేక టవర్లు జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేయనుంది. 

5. నందిపైపుల అధినేత ఎస్పీవైరెడ్డి ఇకలేరు

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్‌.పి.వై.రెడ్డి (69) మంగళవారం రాత్రి మృతి చెందారు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ఏప్రిల్‌ 3న హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆయన మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్పీవైరెడ్డి మూడు దఫాలుగా లోక్‌సభ సభ్యునిగా విశేష సేవలందించారు. నందిపైపుల అధినేతగా ఆయన ముద్ర వేసుకున్నారు. 

6. మసూద్ అంశంపై చైనా సానుకూల స్పందన

యూఎన్‌ సమావేశానికి ఒకరోజు ముందు జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనా నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. దీన్ని సరైన రీతిలో పరిష్కరించాలని బీజింగ్ సూచించింది. అయితే ఎప్పటిలోగా దీన్ని పరిష్కరించాలన్న విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమావేశమైన మరుసటి రోజునే  బీజింగ్‌ నుంచి ఈ సానుకూల స్పందన రావడం గమనార్హం.

7. 250 కళాశాలల్లో లోపాల పాపాలు

నిర్దేశిత ప్రమాణాల ప్రకారం లేని మొత్తం 250 వృత్తివిద్యా కళాశాలలకు జేఎన్‌టీయూహెచ్‌ నోటీసు జారీచేసింది. వీటిల్లో ఇంజినీరింగ్‌, ఫార్మసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ కళాశాలలున్నాయి. ఒకటీ అరా తప్ప ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలలన్నింటిలోనూ ఏదో ఒక లోపాన్ని గుర్తించిన విశ్వవిద్యాలయం..వివరణ కోరుతూ 10 రోజుల గడువు ఇచ్చింది. గత నెలలోనే నిజ నిర్ధరణ కమిటీలు (ఎఫ్‌ఎఫ్‌సీ) వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలనూ తనిఖీ చేశాయి. అధ్యాపకుల కొరత, ప్రయోగశాలల్లో పరికరాల లేమి, ఇతర లోపాలను గుర్తించి సోమవారం రాత్రి నోటీసులిచ్చారు.

8. కొలంబో దాడులు ప్రతీకారమే

తమ ఆధీనంలోని కొంత భూభాగాన్ని కోల్పోవాల్సి వచ్చినందుకు ప్రతీకారాన్ని తీర్చుకుంటామని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) అధినేత అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీ ప్రతిన చేస్తున్నట్లు చెబుతున్న వీడియోను ఐఎస్‌ గ్రూపు విడుదల చేసింది. 2014 తర్వాత అబూ బకర్‌ బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. సైనిక బలగాల దాడిలో బాగ్దాదీ ప్రాణాలు కోల్పోయినట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. వీటన్నిటినీ తోసిపుచ్చే రీతిలో 18 నిమిషాల నిడివి ఉన్న వీడియో వెలుగు చూసింది. దీనిని ఏప్రిల్‌లోనే తీసినట్లు ఐఎస్‌ చెబుతోంది.

9. శ్రీలంకలో మరిన్ని దాడులు జరగొచ్చు

శ్రీలంకకు ఉగ్రవాద ముప్పు ఇంకా తొలగిపోలేదని, మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించింది. ఈస్టర్‌ రోజున వరుస బాంబు దాడులకు పాల్పడ్డ ముఠా సభ్యులు ఇంకా చురుగ్గానే ఉన్నారని పేర్కొంది. తమ భద్రతా నిపుణులు శ్రీలంక వచ్చారని కొలంబోలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఇటీవలి ఉగ్రవాద దాడుల సూత్రాధారులను పట్టుకునేందుకు ఇక్కడి అధికారులతో కలసి పనిచేస్తున్నారని తెలిపారు. మరోవైపు శ్రీలంకలోని అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను వెనక్కి రప్పించాలని ఆ దేశ విదేశాంగ శాఖ ఆదేశించింది.

10. బెంగళూరు ఖేల్‌ఖతం 

పీఎల్‌-12లో చెత్త ప్రదర్శన చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టయింది. ఇప్పటికే అవకాశాలు సంక్లిష్టంగా మారగా.. రాయల్స్‌తో మ్యాచ్‌ రద్దవడంతో ఆ జట్టు కథ ముగిసింది. 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. అనంతరం రాయల్స్‌ 3.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసిన స్థితిలో మళ్లీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. 11 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉండగా శాంసన్‌ (28) ఔటయ్యాడు. లివింగ్‌స్టోన్‌ (11) నాటౌట్‌గా నిలిచాడు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.