close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. 23 తర్వాత కొత్త ప్రధాని

ప్రధాని నరేంద్రమోదీ స్థానంలో ఈ నెల 23వ తేదీ తర్వాత  వేరే ప్రధాన మంత్రి రానున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటివరకూ బెంగాల్‌ టైగర్‌గానే పేరుపొందారని, రాబోయే భాజపాయేతర ప్రభుత్వంలో ఆమె కీలక పాత్ర పోషించి దేశానికే బెబ్బులి అవుతారని వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్‌లోని జార్‌గ్రామ్‌, హాల్దియాల్లో జరిగిన బహిరంగ సభల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

2. పాలమూరు పరుగు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తాజా అంచనా వ్యయం రూ.52,056.13 కోట్లుగా ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనా ముసాయిదా నివేదిక పేర్కొంది. ఇందులో రెండవదశలో ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు రూ.8,069 కోట్లు ఖర్చవుతుంది.ఈ ఎత్తిపోతల పథకానికి తుది పర్యావరణ అనుమతి కోసం జూన్‌ 4 నుంచి 17 వరకు ఆరు జిల్లాల్లో ఆరు చోట్ల ప్రజాభిప్రాయసేకరణ జరగనుంది.

3. అణు ఒప్పందం రద్దు చేసుకుంటాం

అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు రద్దయ్యేలా ఇరాన్‌ ప్రయత్నాలను ప్రారంభించింది. ఆంక్షల ప్రభావం పడకుండా రెండు నెలల్లోగా ప్రత్యామ్నాయ మార్గానికి కృషి చేయాలని, లేకుంటే ఇప్పుడున్న అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ఇతర అగ్రరాజ్యాలను హెచ్చరించింది. పరిస్థితిని గమనించిన అమెరికా ఆ ప్రాంతానికి యుద్ధ వాహన నౌకను, బాంబులు ప్రయోగించే దళాలను పంపించనుంది. పర్షియన్‌ గల్ఫ్‌ సముద్ర జలాల్లోకి యుద్ధ విమానాల వాహక నౌక అయిన ‘అబ్రహం లింకన్‌’ను పంపించనున్నట్టు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ ప్రకటించారు.

4. నేడు స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం

ఈ నెల 14 నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశం అజెండాలోని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమవేశం కానుంది. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌ని సీఎస్‌ కార్యాలయం కోరింది. స్క్రీనింగ్‌ కమిటీలో సీఎస్‌తో పాటు, సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌, అజెండాలోని అంశాలకు సంబంధించిన శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

5. 22న పీఎస్‌ఎల్‌వీ-సి 46 ప్రయోగం

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ నెల 22వ తేదీన పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌- సి 46 వాహక నౌకను నింగిలోకి పంపనున్నారు. ఈ మేరకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదికలో చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. వాహక నౌకకు సంబంధించిన అనుసంధానం పనులు ప్రస్తుతం పూర్తికావచ్చాయి. ఉపగ్రహం బెంగళూరు నుంచి రావాల్సి ఉంది. పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక రీశాట్‌-2 బీఆర్‌ 1 రాడార్‌ ఇమేజింగ్‌ ఉప్రగహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

6. ఒక్కో పేజీ రూ.2కు ఇవ్వాల్సిందే

విద్యార్థులు తమ జవాబు పత్రాల నకలు అడిగితే ఒక్కో పుట రూ.2 చొప్పున ఇవ్వాల్సిందేనని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) విశ్వవిద్యాలయాలను సూచించింది. ఈ మేరకు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు యూజీసీ కార్యదర్శి రజనీష్‌ జైన్‌ ఈ నెల 7న లేఖ రాశారు. గతంలో కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పేజీకి రూ.2 చొప్పున తీసుకొని జవాబు పత్రాలను ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని సూచించారు.

7. డిగ్రీలో విజువల్‌ ఆర్ట్స్‌, డిజైన్‌

రాష్ట్రంలో విజువల్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ పేరిట డిగ్రీ కళాశాలలు రానున్నాయి. ఇప్పటివరకు బీఏ, బీకాం కోర్సుల వ్యవధి మూడేళ్లు కాగా, ఈ కొత్త కళాశాలల్లో మాత్రం కొన్ని కోర్సులను బీటెక్‌ తరహాలో నాలుగేళ్లు అందించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి కొత్త డిగ్రీ కళాశాలలకు అనుమతివ్వని ఉన్నత విద్యామండలి కొత్త కోర్సులతోపాటు గతేడాది వరకు ఎంఓయూ విధానంలో నడుస్తున్న కోర్సులను వచ్చే నూతన విద్యా సంవత్సరం నుంచి కొనసాగించరాదని నిర్ణయించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. విజువల్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటన జారీ చేసింది.

8. జులై 31కి ఎన్‌ఆర్‌సీ పూర్తి 

అసోంలో జాతీయ పౌరుల రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ)కు తుదిరూపు ఇచ్చే గడువును జులై 31 కంటే ఒక్కరోజు కూడా పొడిగించేది లేదని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. అలాగే దీనికి సంబంధించిన ఫిర్యాదులు, అభ్యంతరాలు వంటివాటి విషయమై నిర్ణయం తీసుకోవడానికి సంబంధిత సమన్వయకర్త (కోర్డినేటర్‌) ప్రతీక్‌ హజేలాకు స్వేచ్ఛనిచ్చింది. ఎన్‌ఆర్‌సీ ముసాయిదాలో కొందరు వ్యక్తులను చేర్చడంపై అభ్యంతరాలు తెలిపిన చాలామంది వాటి పరిష్కారానికి సంబంధించి కమిటీ ముందుకు రావడం లేదని ప్రతీక్‌ సుప్రీంకోర్టుకు నివేదించారు.

9. కనీస ఆదాయ పథకాలతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది: ఆర్‌బీఐ

కనీస ఆదాయ పథకాలు, రైతు రుణ మాఫీల వంటి ప్రజాకర్షక పథకాల వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరించింది. ఆర్‌బీఐ కేంద్ర కార్యాలయంలో జరిగిన 15వ ఆర్థిక కమిషన్‌, ఆర్‌బీఐ సభ్యుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, డిప్యూటీ గవర్నర్లు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతంలో విద్యుత్‌ రంగంలో వచ్చిన ఉదయ్‌ బాండ్లు రాష్ట్రాల ఆర్థిక స్థితిని దిగజారేలా చేశాయని ఆర్‌బీఐ గుర్తుచేసింది.

10. పంత్‌ ప్రతాపం 

సవత్తరంగా సాగిన ఎలిమినేటర్‌లో దిల్లీ 2 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై గెలిచింది. బుధవారం దిల్లీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు మొదట సన్‌రైజర్స్‌ 8 వికెట్లకు 162 పరుగులే చేయగలిగింది. గప్తిల్‌ (36; 19 బంతుల్లో 1×4, 4×6) టాప్‌ స్కోరర్‌. అమిత్‌ మిశ్రా   (1/16) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఆరంభంలో పృథ్వీ షా (56; 38 బంతుల్లో 6×4, 2×6), ఆఖర్లో రిషబ్‌ పంత్‌ (49; 21 బంతుల్లో 2×4, 5×6) మెరుపులతో లక్ష్యాన్ని దిల్లీ.. 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.