close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. దిల్లీని ఏలుదాం

ఈ నెల 23న వెల్లడికానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, తర్వాత కేంద్రంలో పరిణామాలు, ఇరు పార్టీలకు రాబోయే లోక్‌సభ స్థానాలు తదితర అంశాలపై  డీఎంకే అధినేత స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు  సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... ప్రధానంగా ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల పాత్రపై చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌, భాజపాయేతర సంకీర్ణ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, ఈ సమయంలో తెరాస, డీఎంకే లాంటి పార్టీలు కలిసి నడిస్తే దిల్లీలో చక్రం తిప్పవచ్చని కేసీఆర్‌ వివరించారు. ఈ క్రమంలో చేస్తున్న తమ ప్రయత్నానికి మద్దతుపలికి సమాఖ్య కూటమిని బలోపేతం చేయాలని కోరారు.

2. కేబినెట్‌కు సరే

మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయ భవనంలోని కేబినెట్‌ సమావేశ మందిరంలో ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఫొని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, రాష్ట్రంలో తాగునీటిఎద్దడి, కరవు, వాతావరణ మార్పుల ప్రభావం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సహా ఉపాధి పరిస్థితిపై  సమీక్షించనున్నారు. ఎజెండాలోని అంశాలపై తాజా పరిస్థితిని మంత్రివర్గ సమావేశంలో వివరించేందుకు అవసరమైన సమాచారాన్ని వెంటనే సాధారణ పరిపాలన విభాగానికి పంపించాలని, సంబంధిత కార్యదర్శులంతా సమావేశానికి హాజరవ్వాలని సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం  ఉత్తర్వులు జారీ చేశారు.

3. హైకోర్టు సీజేగా జస్టిస్‌ చౌహాన్‌!

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ నియామకానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.  రాజస్థాన్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ను హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది.  హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ పేరును ప్రతిపాదించింది.

4. 22 నుంచి అమరావతిలో జగన్‌

వైకాపా అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రెడ్డి తన, పార్టీ కార్యకలాపాలను ఈ నెల 22 నుంచి అమరావతి నుంచే నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు. అక్కడ నుంచి సామాన్లను ఉండవల్లిలోని జగన్‌ నూతన కార్యాలయానికి తరలిస్తున్నారు. క్యాంపు కార్యాలయం నుంచే ఇకపై పార్టీ కేంద్ర కార్యాలయ కార్యకలాపాలను సాగించనున్నారు. ఈ నెల 21 లేదా 22న ఉండవల్లిలోని తన నివాసానికి (కార్యాలయ భవనం, నివాసభవనం రెండూ పక్కపక్కనే ఉన్నాయి) రానున్నారు. 23న ఓట్ల లెక్కింపును ఆయన ఇక్కడ నుంచే సమీక్షించనున్నారు.

5. సింగరేణికి లాభాలు పెరిగాయ్‌

గత అయిదేళ్లలో అమ్మకాలు, లాభాలు గణనీయంగా పెరిగాయని సింగరేణి సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో ప్రకటించింది. సంస్థ అమ్మకాలు 116.5 శాతం, లాభాలు 282 శాతం పెరిగాయని, సంస్థ చరిత్రలో ఇంత భారీ వృద్ధి రేటునమోదవడం ఆల్‌టైం రికార్డుగా అభివర్ణించింది. దేశంలో 8 మహారత్న కంపెనీలుగా పేరొందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సాధించినదానికన్నా ఎంతో ఎక్కువ సాధించినట్లు వివరించింది. మహారత్న కంపెనీల్లో అగ్ర స్థానంలో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ గత ఐదేళ్ల లాభాల వృద్ధి 104.5 శాతమేనని గుర్తు చేసింది. అమ్మకాల్లో కోల్‌ ఇండియా 55.1 శాతం వృద్ధి సాధించగా, సింగరేణి 116.5 శాతంతో ముందున్నట్లు తెలిపింది.

6. నన్ను అరెస్టు చేయండి చూద్దాం!

 ‘‘జైశ్రీరాం అంటున్నాను. రేపు కోల్‌కతాలోనే ఉంటాను. దమ్ముంటే నన్ను అరెస్టు చేయ్‌’’ అని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా.. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి సవాల్‌ విసిరారు. టీఎంసీ అధ్యక్షురాలు తనను బెంగాల్‌లో ప్రచారం చేయకుండా అడ్డుకోగలరు కానీ, భాజపా విజయాన్ని అడ్డుకోలేరన్నారు. జాయ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని కానింగ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడారు. ఎవరైనా ‘జైశ్రీరాం’ అంటే మమతకు కోపం వచ్చేస్తుందన్నారు. ఘతల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మమతాబెనర్జీ పాల్గొన్న సభలో కొందరు ‘జైశ్రీరాం’ అని నినాదాలు చేసినవారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో అమిత్‌షా పైవ్యాఖ్యలు చేశారు.

7.  ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌ యాత్రలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న యాత్రలన్నీ.. రాష్ట్రంలోని సమస్యల నుంచి తప్పించుకునేందుకేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ- ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రాణాంతక రోడ్డుప్రమాదాలపై పలు విమర్శలొస్తున్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు పేరిట యాత్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు అజీజ్‌ పాషా, సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు నర్సింహ మాట్లాడుతూ..ఇంటర్‌ బోర్డు వైఫల్యంపై ఈ నెల 16న నల్లచొక్కాలతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామన్నారు.

8. ప్రత్యామ్నాయ మార్గం

తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునేందుకు శేషాచల కొండల్లో కొత్తదారి వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది. భవిష్యత్తు అవసరాలు, రద్దీ నియంత్రణతోపాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న సమయాల్లో ఈ మార్గాన్ని ఉపయోగించాలని భావిస్తోంది. ఈ ప్రత్యామ్నాయ రోడ్డును 2.1 కి.మీ. మేర 4 వరుసలుగా నిర్మిస్తారు. దీనిపై చెన్నై ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో ఎల్‌అండ్‌టీ కంపెనీ సర్వే చేసింది. నివేదికను మరోవారంలో తితిదే ఇంజినీరింగ్‌ విభాగానికి అందించనుంది. అలిపిరి నుంచి తిరుమలకు రెండో కనుమ మార్గం 17 కి.మీ. ఉంది. 13వ కి.మీ. నుంచి తిరుమల వరకు కొండ చరియలు విరిగిపడే ప్రదేశాలు ఎక్కువ.

9. ఈడీ ముందు హాజరైన చందా కొచ్చర్‌ దంపతులు

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ముందు సోమవారం హాజరయ్యారు. బ్యాంకు రుణాల మోసం, మనీ లాండరింగ్‌ కేసుల్లో వీరిపై ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈడీ ప్రధాన కార్యాలయం ఉన్న ఖాన్‌ మార్కెట్‌కు ఈ దంపతులు రావాల్సిన సమయం (ఉదయం 11 గం.) కంటే ముందే హాజరైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రాత్రి 8 గంటల తర్వాతే వారిని బయటకు పంపినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు ముందుకు సాగడం కోసం వీరిద్దరూ దర్యాప్తు అధికారి(ఐఓ)కి సహకరించినట్లు తెలుస్తోంది.

10. రక్తమోడుతున్నా...

ముంబయితో ఐపీఎల్‌ ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓడినా ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ వాట్సన్‌ పోరాటం అందరినీ ఆకట్టుకుంది. అద్భుతంగా పోరాడిన అతడు చెన్నైని దాదాపు గెలిపించినంత పనిచేశాడు. ఐతే ఇంకో విషయం తెలిస్తే అతడిపై గౌరవం మరింత పెరుగుతుంది. అతడు ఎంత అంకితభావం గల ఆటగాడో అర్థమవుతుంది. ఎడమ మోకాలి ప్రాంతంలో గాయమైనా, రక్తం కారుతున్నా ఫైనల్లో అతడు పోరాడాడట. వాట్సన్‌ గాయానికి సంబంధించి చెన్నై సూపర్‌కింగ్స్‌ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ అతడి సహచరుడు హర్భజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో దాని గురించి రాశాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.