close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలుకు ఒత్తిడి తెస్తాం

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో తలపెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల పునరాకృతి, మిషన్‌ భగీరథ పేరుతో కేసీఆర్‌ రూ.లక్షల కోట్లు లూటీ చేస్తున్నారని విమర్శించారు. ఆ డబ్బును కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి కూడా ఇదేవిధంగా తెరాసకు అమ్ముడుపోయారని విమర్శించారు.

2. ఐదు చోట్ల రీపోలింగ్‌

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని 5 పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కేంద్రాల్లో ఈ నెల 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి బుధవారం ఆదేశాలు జారీ చేసింది. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం  కేంద్రాల్లో ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, అక్కడ రీ పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గతంలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

3. ఆ కంపెనీలపై కఠిన చర్యలొద్దు 

జీఎస్టీ ఎగవేతతోపాటు సుజనా గ్రూపునకు చెందిన కంపెనీలనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భరణి కమోడిటీస్‌, విఎస్‌ ఫెర్రస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీఆర్‌ఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అండ్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్‌లపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 73(1), సెక్షన్‌ 74(1) కింద నోటీసులు జారీ చేయాలని, కంపెనీలు ఇచ్చే సమాధానాలను పరిశీలించి పరిష్కరించాకే తదుపరి చర్యలు తీసుకోవాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 69(1), సెక్షన్‌ 132లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు.

4. స.హ. కమిషనర్‌ నియామకంపై వ్యాజ్యం

సమాచార హక్కు చట్టం(స.హ.) కమిషనర్‌గా ఐలాపురం రాజాను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. బుధవారం దీనిపై విచారణ జరిపిన వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, స.హ.చట్ట కమిషనర్ల నియామక ఎంపిక కమిటీ, ఏపీ స.హ.చట్ట ప్రధాన కమిషనర్‌, స.హ.చట్ట కమిషనర్‌ ఐలాపురం రాజాకు నోటీసులు జారీచేసింది. ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. నియామకానికి సంబంధించి ఈనెల 13న జారీచేసిన జీవో 49పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

5. అందరికీ చేయూతనిస్తా: జగన్‌

తానే ముఖ్యమంత్రిని అవుతానని, ప్రజానీకానికి అండగా నిలుస్తానని వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.  కడప జిల్లా పులివెందులలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజైన బుధవారం ప్రజాదర్బారు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు జగన్‌ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. కడపతోపాటు అనంతపురం జిల్లాకు చెందిన వైకాపా శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.  ప్రతి ఒక్కరికి చేయూతనందిస్తానని ఈ సందర్భంగా జగన్‌ భరోసా ఇచ్చారు. వైకాపా ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అంజద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

6. మోదీది దౌర్జన్య సర్కారు

మోదీ, భాజపాలే లక్ష్యంగా కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీది బలమైన సర్కారు కాదనీ... అణచివేత భావనను నిండా నింపుకొన్న దౌర్జన్యపూరిత ప్రభుత్వమని దుయ్యబట్టారు. 56 అంగుళాల ఛాతీ గల ప్రధాని ఉన్నా... ఈ దేశ రైతులు మాత్రం దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. దేవ్‌రియా, వారణాసి తదితర చోట్ల ప్రచారం సందర్భంగా.. ‘‘తాను బలమైన ప్రధాని అని ఆయన చెప్పుకొంటున్నారు. అలాంటప్పుడు రైతులు ఎందుకు దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు? వారణాసిలో నాకు అభివృద్ధి అన్నది ఎక్కడా కనిపించలేదు. రోడ్లపై గుంతలు మాత్రం బాగా కనిపించాయి’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు.

7. ముఖ్యమంత్రి పదవికి ఖర్గేనే అర్హుడు

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే అన్నివిధాలా అర్హులని ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న కుమారస్వామి వ్యాఖ్యానించారు. ‘నిజానికి ఖర్గేకు ఉన్న అనుభవాన్ని చూస్తే ఆయనను ఎప్పుడో ఆ కుర్చీలో కూర్చోబెట్టాల్సింది’ అంటూ విశ్లేషించారు. కర్ణాటకలో ఉప ఎన్నిక జరుగుతున్న చించోళి శాసనసభ నియోజకవర్గంలో కుమార బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేసిన పై వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య- అంటూ పలువురు కాంగ్రెస్‌ నేతలు కొత్త అంకానికి తెరతీసిన వేళ- కుమార వినూత్నంగా స్పందించి సిద్ధుకు అడ్డుపుల్ల వేసే ప్రయత్నాన్ని నాటకీయంగా ప్రారంభించారు.

8. 14,000 కోట్లకు కొంటాం

జెట్‌ ఎయిర్‌వేస్‌ను రూ.14,000 కోట్లకు కొనుగోలు చేసేందుకు డార్విన్‌ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ వాటా విక్రయానికి బిడ్ల ప్రక్రియ నిర్వహిస్తున్న ఎస్‌బీఐ క్యాప్స్‌తో డార్విన్‌ గ్రూప్‌ ఉన్నతాధికారులు ఈ విషయమై బుధవారం సంప్రదింపులు జరిపారు. ఏప్రిల్‌ 17 నుంచి కార్యకలాపాలు నిలిపేసిన జెట్‌లో 75 శాతం వరకు వాటా విక్రయానికి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకర్లు ప్రయత్నిస్తున్న సంగతి విదితమే. ఈ ప్రక్రియను ఎస్‌బీఐ క్యాప్‌ చేపట్టింది. ఏప్రిల్‌8-12 తేదీల్లో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు దాఖలు చేసిన 4 సంస్థల్లో డార్విన్‌ గ్రూప్‌ లేదు.

9. 359.. 44.5 ఓవర్లలోనే ఉఫ్‌! 

వన్డేల్లో 359 పరుగుల లక్ష్యమంటే ఏ జట్టు మీదైనా, ఏ పిచ్‌పై అయినా ఛేదన కష్టమే. ఐతే బలమైన బౌలింగ్‌ దళమున్న పాకిస్థాన్‌పై అంతటి లక్ష్యాన్ని ఇంకో 5.1 ఓవర్లు మిగిలుండగానే అలవోకగా ఛేదించి సంచలనం సృష్టించింది ఇంగ్లిష్‌ జట్టు. ఇంగ్లాండ్‌ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుని ప్రపంచకప్‌ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (128; 93 బంతుల్లో 15×4, 5×6), జేసన్‌ రాయ్‌ (76; 55 బంతుల్లో 8×4, 4×6) తొలి వికెట్‌కు 17.3 ఓవర్లలోనే 159 పరుగులు జోడించి ఛేదనలో జట్టుకు ఘనమైన ఆరంభాన్నిచ్చారు. తర్వాత రూట్‌ (43), స్టోక్స్‌ (37), మొయిన్‌ అలీ (46 నాటౌట్‌) కూడా రాణించడంతో ఇంగ్లాండ్‌ సునాయాస విజయాన్నందుకుంది.

10. కథానాయిక దొరికేసిందా?

నందమూరి బాలకృష్ణ - కె.ఎస్‌.రవికుమార్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. సి.కల్యాణ్‌ నిర్మాత. ఈ చిత్రానికి ‘రూలర్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇద్దరు నాయికలుంటారు. ప్రస్తుతం వారి కోసం అన్వేషణ జరుగుతోంది. ఓ కథానాయికగా పాయల్‌ రాజ్‌పుత్‌ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ‘ఆర్‌.ఎక్స్‌ 100’తో ఆకట్టుకున్న పాయల్‌కి  వరుసగా అవకాశాలొస్తున్నాయి. ప్రస్తుతం ‘ఆర్‌డీఎక్స్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికీ సి.కల్యాణే నిర్మాత. ఆయనే పాయల్‌కి మరో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈవారంలోనే హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.