close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. భారతీయులకు తీపి కబురు

వలసలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. ప్రతిభ, పాయింట్ల ఆధారిత ఇమిగ్రేషన్‌ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుత గ్రీన్‌ కార్డుల స్థానంలో ‘బిల్డ్‌ అమెరికా’ వీసాలను ప్రతిపాదించారు. యువత, అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఇచ్చే కోటాను 12 నుంచి 57 శాతానికి పెంచారు. దీనివల్ల భారత్‌కు చెందిన వేల మంది నిపుణులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఆయన వైట్‌హౌస్‌లోని రోజ్‌ గార్డెన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విధానాన్ని ప్రకటించారు.

2. నాయకుల నోళ్లకు తాళాలు

నాయకుల మాటల యుద్ధంతో వేడెక్కిన రాజకీయ వాతావరణం శుక్రవారం చల్లబడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 38 రోజులుగా హోరాహోరీగా సాగిన ప్రచారం శుక్రవారం ముగిసింది. ఏడోదశ ఎన్నికల్లో భాగంగా చివరి 59 స్థానాలకు ఆదివారం పోలింగ్‌ జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గం కూడా ఇందులో ఉంది. భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య హింస చెలరేగడంతో పశ్చిమబెంగాల్‌లో గురువారమే ఎన్నికల ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనున్నాయి.

3. ఉత్సవాలన్నీ పబ్లిక్‌ గార్డెన్స్‌లోనే

రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పబ్లిక్‌ గార్డెన్స్‌లోని మైదానంలో నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. జూబ్లీహాలు ఎదురుగా ఉన్న స్థలాన్ని దీనికోసం ఎంపిక చేశారు. ఇదేకాక స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం కూడా ఇక్కడే జరుగుతాయి. ప్రస్తుతం రాష్ట్రావతరణ, గణతంత్ర వేడుకలు పరేడ్‌ మైదానంలో, స్వాతంత్య్ర వేడుకలు గోల్కొండ కోటలో జరుగుతున్నాయి. ఈ మూడు వేదికలు మారనున్నాయి. ప్రజలకు   ఇబ్బంది కలుగకుండా, మరింత వైభవంగా నిర్వహించేందుకు ఈ ప్రతిపాదన రాగా దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారు.

4. భాజపాకు అవకాశం సున్నా

ఈ ఎన్నికల్లో భాజపాకి సొంతంగా గానీ, ఎన్డీయేపక్షాలన్నిటికీ కలిపిగానీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు రావని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్డీయేలోలేని, ఇతర పార్టీల మద్దతు కూడగట్టినా భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని ఆయన తెలిపారు. తిరంగా ఛానల్‌లో ప్రసారమయ్యే అప్‌ఫ్రంట్‌ కార్యక్రమం కోసం ప్రముఖ పాత్రికేయుడు కరణ్‌ థాపర్‌ గురువారం చంద్రబాబుని ఇంటర్వ్యూ చేశారు. కేసీఆర్‌, జగన్‌, నవీన్‌ పట్నాయక్‌లు ఇప్పటి వరకు భాజపాకి మద్దతిస్తామని ఎక్కడా హామీ ఇవ్వలేదని, వాళ్ల రాజకీయ అనివార్యతలు వాళ్లకున్నాయని, ఒకవేళ కొన్ని పార్టీలు భాజపాకి మద్దతిచ్చినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు తెలిపారు.

5. వచ్చేది లౌకిక కూటమే

ఈసారి ఎన్నికల్లో లౌకిక కూటమి విజయం సాధించబోతోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఎస్పీ, బీఎస్పీ, తెదేపా, టీఎంసీలు భాజపాకు మద్దతు ఇవ్వబోవన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలాతో కలసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో రాహుల్‌ మాట్లాడారు. మే 23న ప్రజల తీర్పు వస్తుందని, ఆ తరువాతే భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది ఆలోచిస్తామన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మోదీ వదులుకున్నారన్నారు.

6. రీపోలింగ్‌పై హైకోర్టుకు తెదేపా

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అయిదు పోలింగ్‌ కేంద్రాల్లో ఈనెల 19న రీపోలింగ్‌ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఆ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, చిత్తూరు పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎన్‌.శివప్రసాద్‌ శుక్రవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై విచారించింది. ఈసీ వివరాలు సమర్పించేందుకు విచారణను శనివారానికి వాయిదా వేసింది.

7. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత

ఎల్‌జీబీటీ, స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలకు చట్టబద్ధమైన ఆమోదం తెలిపిన తొలి ఆసియా దేశంగా తైవాన్‌ చరిత్రపుటలకెక్కింది. సేమ్‌ సెక్స్‌ దంపతులు ప్రత్యేకమైన శాశ్వత సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి, వారి వివాహాల నమోదు(రిజిస్ట్రేషన్‌)కు వీలు కల్పించే బిల్లును ఆ దేశ పార్లమెంటు శుక్రవారం ఆమోదించింది. ఈ చట్టం ఈ నెల 24 నుంచి అమల్లోకి రానుంది. ఈ బిల్లుపై ఓటింగ్‌ పూర్తి అయిందని తెలుసుకున్న వేలాదిమంది ‘‘ఎల్‌జీబీటీ’’ వ్యక్తులు పార్లమెంటు ముందు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. పార్లమెంటు తాజాగా ఆమోదించిన బిల్లు ప్రకారం పురుషుడు - స్త్రీ వివాహం చేసుకున్నట్లే ఎల్‌జీబీటీల మధ్య జరిగిన పెళ్లి మాత్రమే చట్టబద్ధమవుతుంది.

8. యుద్ధం యోచన లేదు: ట్రంప్‌

ఇరాన్‌తో యుద్ధం యోచన లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌, విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియోలు యుద్ధభేరీలు మోగించేందుకు సన్నద్ధమవుతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బోల్టన్‌, పాంపియోలు తనను యుద్ధం వైపునకు నెట్టేస్తున్నారన్న ఆరోపణలను ట్రంప్‌ ఖండించారు. ఇరాన్‌ దురుసుగా ప్రవర్తిస్తోందన్న వాదనపై మరింత సమాచారం ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు వైట్‌హౌస్‌ను డిమాండ్‌ చేశాయి. దీంతో అమెరికా కాంగ్రెస్‌లోని అగ్రశ్రేణి సభ్యులకు ప్రభుత్వం రహస్య వివరణ ఇచ్చింది.

9. రాలుతున్న పసిమొగ్గలు

అభం శుభం తెలియని పసిమొగ్గలు అర్ధాంతరంగా రాలిపోతున్నాయి. 2015లో భారత్‌లో 2.51 కోట్ల మంది శిశువులు జన్మించగా, వీరిలో ఐదేళ్లలోపు చిన్నారులు 12.01 లక్షల మంది వేర్వేరు కారణాలతో మరణించారు. ప్రతి వెయ్యి ప్రసవాలకు సగటున 47.81 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు మరణిస్తున్నట్లు తేలింది. ఇందులోనూ నవజాత శిశు(0-28రోజులు) మరణాలు 6.96 లక్షలు(57.9శాతం) ఉన్నట్లు అంచనా. ప్రపంచ దేశాలన్నింటిలోకి భారత్‌లోనే ఈ గణాంకాలు అత్యధికం కావడం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల సంఖ్య ప్రతి వెయ్యి జననాలకూ 39.68 శాతంగా నమోదైంది. చిన్నారుల మరణాలకు నిమోనియా, డయేరియాలే కారణమని తేలింది.

10. ప్రపంచకప్‌ గీతం ‘స్టాండ్‌ బై’

ప్రపంచకప్‌ అధికారిక గీతం ‘స్టాండ్‌ బై’ని ఐసీసీ శుక్రవారం విడుదల చేసింది. గాయకులు లోరెన్‌, రుడిమెంటల్‌ కలిసి ఈ పాటను రూపొందించారు. ఈనెల 30న ప్రారంభం కాబోతున్న ఈ మెగా ఈవెంట్‌ను గుర్తు చేస్తూ ఈ పాప్‌ సాంగ్‌ను తయారు చేశారు. ప్రతి అభిమాని ఈ టోర్నీలో పాల్గొనే తమ జట్ల పట్ల అభిమానాన్ని తెలిపేలా ఈ పాట సాగుతుంది. 48 మ్యాచ్‌ల పాటు సుదీర్ఘంగా ఈ భారీ టోర్నీని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వీక్షించనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.