close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. యూపీయే 3.0

ఎన్డీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి యూపీఏ-3 ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. అనారోగ్యంతో ఉన్నా కూడా యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ శనివారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో దిల్లీలోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ నేతృత్వాన కేంద్రంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. వచ్చేది హంగ్‌ పార్లమెంటే అని అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు మోదీని మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని పీఠంపై కూర్చోనీయకూడదనే కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

2. మీదే పెద్దన్న పాత్ర

నరేంద్రమోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఎన్డీయేతర పక్షాలను ఏకతాటిపైకి తేవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సానుకూల దిశలో సాగుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అందరూ ఒక్కతాటిపై నడవాలన్న ఆయన ప్రతిపాదనను రాహుల్‌గాంధీ, మాయావతి, అఖిలేష్‌యాదవ్‌, శరద్‌పవార్‌లు అంగీకరించినట్లు తెలిసింది. రాహుల్‌గాంధీ ‘ఉయ్‌ ఆర్‌ వన్‌’ అని చెప్పగా, మాయావతి మీరు పెద్దన్నయ్య పాత్ర పోషించి అందర్నీ కలిపే బాధ్యతను భుజానకెత్తుకోవాలని సూచించినట్లు సమాచారం. శుక్రవారం దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం తీరిక లేకుండా చర్చల్లో మునిగారు. 

3. ఎక్కడి బొగ్గు అక్కడే

విద్యుదుత్పత్తి కోసం చేసే బొగ్గు కేటాయింపు విధానంలో సమూల మార్పులు తెచ్చి ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు ఎక్కడి బొగ్గును అక్కడి ప్రాజెక్టుకే కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో విద్యుత్తు డిమాండ్‌ పెరుగుతున్నందున ఎన్టీపీసీ నుంచి 2 వేల మెగావాట్లు సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లపై సౌర విద్యుదుత్పత్తికి ఎన్టీపీసీకి అనుమతినిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని శనివారం సాయంత్రం ఆయన సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలించారు.

4. నేడే ఆఖరి విడత

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో తుది ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీచేస్తున్న వారణాసి సహా దేశంలోని ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో విస్తరించిన 59 నియోజకవర్గాల్లోని ఓటర్లు ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ స్థానాల నుంచి 918 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పశ్చిమబెంగాల్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అదనపు బలగాలను మోహరింపజేస్తున్నారు. ఆదివారం పోలింగ్‌తో కలిపితే.. దేశంలో 542 నియోజకవర్గాలకు పోలింగ్‌ ముగిసినట్లవుతుంది.

5. ఎన్నికల సంఘంలో లుకలుకలు

ఎన్నికల సంఘంలో వివాదం నెలకొంది. తన అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదంటూ ఓ ఎన్నికల కమిషనర్‌ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) సునీల్‌ అరోడాతోపాటు, ఎన్నికల కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌చంద్రలు సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదుల విచారణపై నిర్వహించే సమావేశాలకు కమిషనర్‌ అశోక్‌ లావాసా హాజరుకావడం లేదు. మిగిలిన ఇద్దరి అభిప్రాయాలతో ఏకీభవించకుండా, తాను వేరుగా చెబుతున్న అభిప్రాయాలను కనీసం నమోదు చేయడం లేదంటూ ఆయన అసంతృప్తి చెందుతున్నారు.

6. తెలంగాణకు నూతన గెజిట్‌

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అధికారికంగా పూర్తిస్థాయి సమాచారంతో ప్రభుత్వం గెజిట్‌ రూపొందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు జిల్లాలకు మాత్రమే గెజిట్లు ఉన్నాయి. హైదరాబాద్‌ రాష్ట్రానికి సంబంధించి తొలిసారి 1909లో గెజిట్‌ను రూపొందించారు. తాజాగా పూర్తి స్థాయి సమాచారంతో దీనిని రూపొందిస్తున్నారు. ఇందులో వ్యవసాయం, నీటిపారుదల, రెవెన్యూ, సాధారణ పరిపాలన, సాంస్కృతిక-పర్యాటకం, యువజన, అడవులు, పర్యావరణం, చరిత్ర, భౌగోళిక, విద్య, ఆరోగ్య, సంక్షేమం.. ఇలా ప్రజలకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని అందుబాటులోకి తేనున్నారు. 

7. ఒక్కటి తేడా వచ్చినా అన్నీ లెక్కించాలి

అయిదు వీవీప్యాట్‌లను లెక్కించి ఈవీఎంలతో సరిపోల్చినప్పుడు అందులో ఒక్క దాంట్లో తేడా వచ్చినా నియోజకవర్గంలోని అన్ని ఈవీఎంలు-వీవీప్యాట్‌లను లెక్కించాల్సిందేనని కేంద్ర ఎన్నికలసంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ డిమాండ్‌ చేశారు. వీవీప్యాట్‌లన్నీ ఈవీఎంలు జనరేట్‌ చేసినవేనని, అందులో ఒక్కటి తేడా వచ్చినా అన్నీ లెక్కించడమే సబబు అని, అప్పుడే అది ప్రపంచానికి నమూనాగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడి ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ‘‘ఎన్నికల కమిషన్‌ స్వతంత్రత, ఎన్నికల  ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం’’ అన్న అంశంపై జరిగిన చర్చావేదికలో మాట్లాడారు. 

8. ఇందిరలా నన్నూ చంపేస్తారు: కేజ్రీవాల్‌

భాజపా తనను ఏదో ఒక రోజు హతమారుస్తుందని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ప్రధాని ఇందిరలాగే తనను కూడా వ్యక్తిగత భద్రతా అధికారే చంపేస్తారన్నారు.  ఇటీవల దిల్లీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేజ్రీపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దాడి చేసింది ఆప్‌ కార్యకర్తేనని పోలీసులు  ప్రకటించారు. దీనిపై శనివారం పంజాబ్‌లో ఓ ఛానల్‌తో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ  ‘నేను హత్యకు గురైనా మాపై వ్యతిరేకత ఉన్న ఆప్‌ కార్యకర్తలే ఈ పని చేశారని పోలీసులు చెబుతారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తకు ఆగ్రహం వస్తే కెప్టెన్‌ సాబ్‌ (సీఎం అమరీందర్‌ సింగ్‌)ను కొట్టగలరా? భాజపా కార్యకర్తలకు కోపమొస్తే మోదీజీపై దాడి చేయగలరా?’ అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

9. తెలంగాణలో కారు.. ఏపీలో సైకిల్‌

ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు సైకిల్‌, తెలంగాణ ఓటర్లు కారు ఎక్కారని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ వెల్లడించారు. మిగులు బడ్జెట్‌తో కూడిన తెలంగాణలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేనందున అక్కడ ఓటర్లు కారు ప్రయాణాన్నే కోరుకున్నారని, లోటు బడ్జెట్‌, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ ఓటర్లకు వారికున్న పరిస్థితుల రీత్యా సైకిలే మార్గమైందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం (హంగ్‌) ఏర్పాటయ్యే అవకాశమే లేదని, పూర్తి ఆధిక్యతతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కంటే, ఆయన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీకి తక్కువ స్థానాలు వస్తాయని, పవన్‌కల్యాణ్‌ మాత్రం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో అడుగుపెడతారన్నారు.

10. మహర్షి.. పోకిరి స్క్వేర్‌ అవుతుందని ముందే చెప్పా

‘‘విజయవాడ రావాలని నేనెప్పుడూ ప్లాన్‌ చేసుకోను. నా సినిమా విజయం సాధించినప్పుడల్లా కనకదుర్గమ్మ నన్ను పిలుస్తుంటుంది’’ అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. అశ్వనీదత్‌, దిల్‌రాజు, పీవీపీ నిర్మాతలు. ‘మహర్షి’ విజయోత్సవం శనివారం రాత్రి విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడారు. ‘‘ డెహ్రాడూన్‌లో మహర్షి తొలి రోజు షూటింగ్‌ ముగిశాక ‘పోకిరి స్క్వేర్‌ అవుతుంది’ అన్నాను. ఈ సినిమాలో మూడు పాత్రలూ బాగా నచ్చాయి. అందులో విద్యార్థి పాత్ర మరింత కిక్‌ ఇచ్చింది. సినిమా నచ్చితే అభిమానులు ఏ స్థాయికి తీసుకెళ్తారో నాకు తెలుసు. నా గత చిత్రాల రికార్డులన్నీ ఒక్క వారంలో దాటించారు’’ అని మహేష్‌ అన్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.