close

తాజా వార్తలు

‘ప్రత్యేక హోదా’ ఏమవుతుంది?

ప్రత్యేక హోదా... 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలతో పెనవేసుకుపోయిన అంశం. దాన్ని సాధించటమే తమ లక్ష్యమని ప్రతి పార్టీ పదేపదే చెబుతూ వస్తోంది. గత, ఇప్పటి ఎన్నికల్లో ఇదే అంశాన్ని అన్ని పార్టీలు ఎన్నికల అజెండాలోనూ చేర్చాయి. తాజాగా అఖండ విజయం సాధించిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి దీనిపై మొదట్నుంచి పోరాడుతున్నారు. 2014 ఎన్నికల్లో వైకాపా ఓడిపోయాక కళాశాలల విద్యార్థులతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశాల్లో, ఇతరత్రా వేదికలపై దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టి మాట్లాడారు. పారిశ్రామిక రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా వస్తే ప్రతి పట్టణం హైదరాబాద్‌గా మారుతుందని, యువతకు ఉద్యోగాలొస్తాయని పేర్కొన్నారు. విజయం సాధించిన అనంతరం గురువారం జాతీయ మీడియాతో జగన్‌ మాట్లాడుతూ ‘‘ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని, ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసి ఈ విషయమై విజ్ఞప్తి చేస్తామని’’ మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు, పార్టీల అభిప్రాయాలు ఇలా ఉండగా కేంద్రంలో భాజపా నేతృత్వంలో మరలా ఏర్పడనున్న ఎన్‌డీఏ ప్రభుత్వం హోదా అంశాన్ని ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. కిందటి ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా భాజపా సొంతగానే అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో కీలక బిల్లుల ఆమోదం విషయంలో తప్ప ఎన్‌డీఏలోని ఇతర పార్టీల మద్దతు ఆ పార్టీకి అవసరం ఉండదు. ఈ కారణంతోనే అప్పట్లో మిత్రపక్షమైనప్పటికీ తెదేపా విజ్ఞప్తిని భాజపా అధినాయకత్వం పరిగణనలోకి తీసుకోలేదు. బిహార్‌తోపాటు, ఒడిశా కూడా ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధించే దిశగా కేంద్రాన్ని ఒప్పించటం అంత సులువు కాదు. వైకాపా అత్యధిక సంఖ్యలో లోక్‌సభ స్థానాల్ని గెలుచుకున్న నేపథ్యంలో ఈ డిమాండ్‌ని బలంగా వినిపించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావటానికి మాత్రం అవకాశముంది. ఆ ఆకాంక్ష ఎంత వరకు నెరవేరుతుంది? అనేది ప్రస్తుతానికి సందిగ్ధమే.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.