close

తాజా వార్తలు

బెంగాల్‌లో భాజపా భం..భం..

బెంగాల్‌లో భాజపా విజయానికి కారణాలివే

ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం‌పశ్చిమబెంగాల్‌లో కాషాయం మెరిసింది. రాష్ట్రంలోని 42లోక్‌సభ స్థానాల్లో తొలిసారిగా 18 స్థానాలను సొంతం చేసుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో కేవలం 2 స్థానాలకే పరిమితమైన కమలం పార్టీ ఈసారి అనూహ్యంగా పుంజుకుంది. గత ఫలితాలతో పోల్చితే తృణమూల్‌ కాంగ్రెస్‌ 12 స్థానాలను కోల్పోయి 22కి పరిమితమైంది. కాంగ్రెస్‌ రెండు స్థానాలు కోల్పోయి రెండింటికి పరిమితం అవగా.. సీపీఎం ఉన్న 2 స్థానాలూ కోల్పోయింది. అయితే ఈ ఐదేళ్లలోనే భాజపా రాష్ట్రంపై పట్టు బిగించి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తట్టుకోలేని షాక్‌ ఇచ్చింది. బెంగాల్‌లో భాజపా ఇంతటి ఘన విజయం నమోదు చేయడానికి గల కారణాలను ఓసారి పరిశీలిస్తే..

కమ్యూనిస్టుల కంచుకోట

పశ్చిమబెంగాల్‌.. ఒకప్పుడు వామపక్షాల కంచుకోట. దాదాపు 34 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పాలించారు. అయితే 8 ఏళ్ల క్రితం తృణమూల్‌ కాంగ్రెస్‌ రూపంలో వారి ఆధిపత్యానికి అడ్డుకట్టపడింది. ఆ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ 2011లో తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి కమ్యూనిస్టుల వరుస విజయాలకు చెక్‌ పెట్టారు. అనంతరం 2016లో జరిగిన ఎన్నికల్లోనూ తృణమూల్‌ విజృంభించింది. మొత్తం 294 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 211 స్థానాల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి దీదీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, తాజా సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి.. దీదీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తన పార్టీ ఎంపీలను విజయతీరాలకు చేర్చడంలో దీదీ చతికిలపడ్డారు. కేంద్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలన్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి. 

భాజపాకు బలమైన కేడర్‌ లేనప్పటికీ..

తాజా సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్సించిన వారిలో మోదీ, మమతా బెనర్జీ ప్రథములు. వీరిద్దరూ పరస్పరం చేసుకున్న విమర్శలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. వ్యక్తిగత విమర్శలకు సైతం వీరు వెనకాడకపోవడం చర్చనీయాంశమైంది. నిజానికి భాజపాకు పశ్చిమబెంగాల్‌లో సరైన కేడర్‌ లేదు. గతంలో పార్టీ తరఫున నిలబెట్టేందుకు సరైన అభ్యర్థులే కరవయ్యేవారు. అందువల్ల చాలా నియోజవర్గాల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతిస్తూ వచ్చారు.  రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు కూడా ఈ మధ్యే ఏర్పాటు చేస్తున్నారంటే... అక్కడ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ, ఒక్కసారిగా ఇంతలా పార్టీ బలోపేతమైందంటే దానికి కొంతవరకు డబ్బే కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ భాజాపాకు రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థ లేదు. కానీ బలం ఉంది... రాష్ట్రాన్ని మూడు దశాబ్దాలపాటు పాలించిన కామ్యూనిస్టులకు వ్యవస్థ ఉంది.. కానీ, బలం లేదు. అందువల్ల రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఓడించాలంటే కచ్చితంగా భాజపాకే ఓటు వేయండి’’ అని కమ్యూనిస్టు మాజీ నేత ఒకరు చెప్పారు. దీనిని బట్టి తృణమూల్‌ను దెబ్బతీసేందుకు కమ్యూనిస్టులు బయటి నుంచి మద్దతు ప్రకటించారా? అనే  ప్రశ్న తలెత్తింది. అయితే ఈ వాదనను పార్టీ సీనియర్‌ నాయకులు కొట్టిపారేశారు. అయితే సీపీఎం శ్రేణులు మొత్తం భాజపా వైపు మళ్లినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

తృణమూల్‌పై వ్యతిరేకత

రాష్ట్రంలో ఇటీవల కాలంలో తృణమూల్‌పై వ్యతిరేక పవనాలే వీచాయని చెప్పాలి. వివిధ సందర్భాల్లో చెలరేగిన మత ఘర్షణలను అణచివేయడంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  విఫలమయ్యారనే వాదనలు వెల్లువెత్తాయి. ఫలితంగా ప్రభుత్వంపై అసమ్మతి పెరిగిపోయింది. దీనికి తోడు ప్రతిపక్ష కమ్యూనిస్టు పార్టీ, అధికార పక్షాన్ని నిలదీయడంలో విఫలమైంది. ఇవి కూడా ప్రజలు భాజపా వైపు మొగ్గు చూపేందుకు కారణాలై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికలే ఉదాహరణ. దాదాపు 34 శాతం స్థానాల్లో ప్రతిపక్ష వామపక్ష కూటమి  అభ్యర్థులు పోటీయే చేయలేదు. ఫలితంగా భాజపా రాష్ట్రంలో రెండో స్థానానికి ఎగబాకింది.

వామపక్షాల అసహనం

చాలా కాలం నుంచి వామపక్షాలకు మద్దతు పలుకుతూ వచ్చిన ఓటర్లకు భాజపా రూపంలో మరో ప్రత్యామ్నాయం లభించింది.  ఎన్ని సంవత్సరాలు గడిచినా తృణమూల్‌ను ఎదిరించే సత్తా సీపీఐ(ఎం) నాయకులకు లేదని భావించిన వారంతా..ఈ సారి భాజపా వైపు మొగ్గు చూపారు. భాజపా, టీఎంసీ నాణేనికి ఇరువైపులా ఉన్న రెండు గుర్తులని.. ఆ రెండింటినీ నమ్మొద్దని పార్టీ సీనియర్లు ప్రచారం చేసినప్పటికీ అవి ఫలించలేదు. తృణమూల్‌ నుంచి స్వాతంత్ర్యం పొందేందుకు భాజపాకు ఓటు వేయడం కన్నా మరో చెడ్డ పని లేదని త్రిపుర మాజీ సీఎం మాణిక్‌సర్కార్‌ వ్యాఖ్యానించినా... టీఎంసీ పెనంపై వేయిస్తోందని భాజపా మంటల్లో పడటం వల్ల ఉపయోగముండదని పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య హెచ్చరించినా.. ఓటర్లు మాత్రం భాజపాకే జై కొట్టారు. ఫలితంగా తాజా ఎన్నికల్లో వామపక్షాల ప్రభావం అంతగా కనిపించలేదు. 

అంచెలంచెలుగా ఎదిగిన భాజపా

పశ్చిమబెంగాల్‌లో భాజపా విజయం నల్లేరుమీద నడకలా సాగలేదు. అంచెలంచెలుగా రాష్ట్రంలో తన ప్రభావాన్ని పెంచుకుంటూ వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు కేబీ హెగ్డేవర్‌ కోల్‌కతాలోనే మెడిసిన్‌ విద్యనభ్యసించారు. జన్‌సంఘ్‌లో కీలక నేత శ్యామ్ ప్రకాశ్‌ ముఖర్జీ కూడా ఇక్కడే జన్మించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత ధన్‌పంత్‌ రామ్‌ అగర్వాల్‌ ఇదే ప్రాంతంలో పెరిగారు. ఇంతమంది కీలక నేతలున్నప్పటికీ ఈ రాష్ట్రంలో భాజపాకు మంచి కేడర్‌ లేకపోవడం కొంత వరకు మింగుడు పడని విషయమే. ఈ నేపథ్యంలో స్థానిక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలకు అధిష్ఠానం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉండేది. రాష్ట్రంలో పార్టీ కేడర్‌ను బలోపేతం చేయడంలో స్థానిక నాయకులు విజయం సాధించారనే చెప్పాలి. మరోవైపు వామపక్షాల సుదీర్ఘపాలనలో హిందుత్వవాదాన్ని అణచివేశారు. మమతాబెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మొత్తం జనాభాలో దాదాపు 28 శాతం ఉన్న ముస్లింలను బాగా ఆదరించారు. నెలవారీ ఇమామ్స్‌ పేరిట వారికి ప్రత్యేక ఆర్థిక సాయం అందజేస్తున్నారు. హిందువులకు, ముస్లింలకు వ్యత్యాసం చూపించడంతో..హిందుత్వ వాదులంతా భాజపాకు వైపు మొగ్గు చూపారు. ఈ ప్రభావం ఎక్కువగా బంగ్లాదేశ్‌తో ఉన్న సరిహద్దు జిల్లాల్లో కనిపించింది.

మమత ప్రయత్నించినా..!

ఎన్నికల ముందే పరిస్థితిని అంచానా వేసిన మమతా బెనర్జీ.. హిందువుల ఓట్లు భాజపా వైపు మళ్లకుండా చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక కమిటీలు వేసి పూజల నిర్వహణ కోసం ఆర్థిక సాయం చేశారు. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. అయినా ఫలితం లేకపోయింది. హిందుత్వాన్నే భాజపా ప్రచార అస్త్రంగా మలచుకుంది. మమతా బెనర్జీ హిందుత్వాన్ని కించపరుస్తున్నారని, హిందువులను చిన్న చూపుచూస్తున్నారనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ల గలిగింది. ఇది కూడా రాష్ట్రంలో భాజపా జయకేతనం ఎగురవేయాడానికి సహకరించిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.